మొహమాటాల్లేవ్.. రావాలనుకుంటే వచ్చేయండి అంటూ ఇతర పార్టీ నేతలకు ద్వారాలు తెరిచింది బీజేపీ. మిత్రపక్షం జనసేనతో కలిసి అధికారంలోకి వస్తామని చెబుతున్న కమలదళం, వలసల ద్వారా సొంతంగానూ బలపడతామంటోంది. కొంతకాలంగా తలుపులు బార్లా తెరిచారు కానీ ఒక్కరూ చేరలేదు. గల్లీ స్థాయి లీడర్లను అక్కడక్కడా ఆకట్టుకుంటున్నా, నియోజకవర్గం నుంచి రాష్ట్రస్థాయిలో చెప్పుకోదగ్గ నాయకులు ఎవరూ కాషాయం కండువా కప్పుకోలేదు. మంత్రివర్గ కూర్పు అనంతరం YCPలో అసంతృప్తి ఒక్కసారిగా భగ్గుమంది. దీంతో రంగంలో దిగిన కమలనాథులు దీనిని క్యాష్ చేసుకోవాలనుకున్నారు. అంతే రాష్ట్రానికి వచ్చిన సీనియర్లు అసమ్మతీ నేతలకు టచ్‌లోకి వెళ్లే ప్రయత్నం చేశారు.
అయితే వారికి ఛాన్స్ ఇవ్వకుండానే YCP అధిష్టానం తమ నేతలను దారికి తెచ్చుకుంది. అసమ్మతిని సెగలను వేగంగా చల్లార్చింది. అయినా తమ పార్టీలోకి వలసలు వస్తారని.. అతిత్వరలో భారీగా చేరికలు ఉంటాయంటోంది బీజేపీ. మంత్రి పదవుల్లో YCP సామాజిక న్యాయం పేరుతో సామాజికమోసానికి పాల్పడిందని.. తమవద్దకు వస్తే భవిష్యత్తులో అసలైన న్యాయం చేస్తామంటోంది. గుర్తింపు లేని పదవులు ఇచ్చి కొందరిని, అసలు పదవులే లేకుండా మరికొన్ని వర్గాలను అవమానించిందంటూ విమర్శలు ఎక్కుపెట్టింది బీజేపీ. నాలుగు కులాలకు చోటు ఇవ్వకపోవడం అంటే వారిని విస్మరించడమే అంటూ ఈ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నమూ చేస్తోంది BJP.
అయితే BJPకి అంతసీను లేదు. అంతా మైండ్‌గేమ్ అంటోంది వైసీపీ. పార్టీ వెర్షన్ ఎలా ఉన్నా.. అసలు తమకు ఏమాత్రం అసంతృప్తి లేదని.. వైసీపీ తమ సొంత పార్టీ అని వీడేది లేదంటున్నారు నేతలు.
మొత్తానికి APలో కొద్దిరోజులుగా BJP నేతలు మకాం వేసి మరీ నేతలకు గాలం వేసే ప్రయత్నాల్లో ఉన్నారు. మరి అంత ఈజీగా వర్కువుట్ అవుతుందా? ఫుల్ స్వింగ్‌లో ఉన్న తెలంగాణలోనే నేతల చేరికలు లేవు.. ఏపీలో ఇంకా కష్టమంటూ ఆ పార్టీ నేతలు అంటున్నారు. మరి బీజేపీ ప్రయత్నాలు ఫలిస్తాయా? చూడాలి.
– బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్.
ఇదే అంశానికి సంబంధించి ఇవాళ్టి బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ విత్ రజనీకాంత్‌లో డిబేట్ నిర్వహించారు. ఆ లైవ్ వీడియో దిగువన చూడండి..