పదేపదే ఎవడ్రా ఆపేది అంటూ పదేపదే డైలాగ్ విసురుతున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. సంచలన వ్యాఖ్యలు విషయంలో తగ్గడం లేదు. గణతంత్ర వేడుకుల్లో పాల్గొన్న పవన్ కల్యాణ్ ఇటీవల ప్రత్యేక ఉత్తరాంధ్ర నినాదం వినిపించిన మంత్రి ధర్మాన ప్రసాదరావును ఘాటైన వ్యాఖ్యలతో తప్పుబట్టారు. అటు సీమ హక్కులపై పోరాడుతున్న బైరెడ్డి రాజశేఖరరెడ్డి పైనా భారీ డైలాగులతో విరుచుకపడ్డారు. అయితే అంతే స్ట్రాంగ్‌గా అటు వైసీపీ నుంచి.. ఇటు బైరెడ్డి నుంచి కౌంటర్లు పడుతున్నాయి. అంతా చంద్రబాబు స్క్రిప్టే అంటున్న అధికారపార్టీ.. అసలు లోకేష్, చంద్రబాబు, పవన్‌లో సీఎం అభ్యర్ధి ఎవరంటూ ప్రశ్నించడం కూడా ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
అవును, మాటల విషయంలో ఎవరూ తగ్గలేదు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మొదలుపెడితే మిగిలిన పార్టీల నేతలు కూడా ఏమాత్రం తగ్గకుండా అంతేస్థాయిలో కౌంటర్లు ఇచ్చారు. దీంతో రిపబ్లిక్ డే కాస్తా పొలిటికల్ ఎటాక్ డేగా మారింది. విశాఖ రాజధాని వద్దంటే ఉత్తరాంధ్రను రాష్ట్రం చేయాలని ఇటీవల మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. రాష్ట్రాన్ని విభజిస్తే చూస్తూ ఊరుకుంటామా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చాలాఘాటుగా వినిపించాయి.
తమ ప్రాంత ప్రయోజనాలకు భంగం కలుగుతుందని ఏదో ఆవేశంలో మంత్రి ఓ మాట అంటే.. పండగ లేదు.. పబ్బం లేదు అంత మాట అంటారా మంత్రి బొత్స సత్యనారాయణ తన సహజశైలికి భిన్నంగా స్పందించారు. అటు రాయలసీమ అభివృద్ధి కమిటీ కన్వీనర్ బైరెడ్డి కూడా తగ్గేదే లే.. కొండారెడ్డి బురుజు దగ్గరకు రా అంటూ సవాల్ చేశారు.
వేర్పాటువాద అంశంపై మాటలమంటలు కొనసాగుతుండగానే.. తన వ్యూహాలు మార్చుకోవడం తప్పు కాదంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. లోకేష్, చంద్రబాబు, పవన్‌లో సీఎం అభ్యర్ధి ఎవరో తెలియడం లేదని.. ముగ్గురు ఓ నిర్ణయానికి వస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. కట్టకట్టుకుని వచ్చేవాళ్లు ఓ క్లారిటీ వస్తే మంచిదన్నారు.
గణతంత్రం రోజున జెండా వందనాలతో ప్రశాంతంగా ఉండాల్సిన పార్టీ ఆఫీసులు మరోసారి రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలతో కాకరేపాయి.
మరిన్ని బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..