Big News Big Debate: 84 గ్రామాల ఉద్యమం వెనక రాజకీయముందా? జీవో 69ని బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తోంది.?
111 GOలో ఉన్న ఆంక్షలు తొలగిస్తూ అటు నిర్మాణాలను అనుమతిస్తూ GO- 69 విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న 84గ్రామాలకు విముక్తి కల్పించామని ప్రభుత్వమంటే..
111 GOలో ఉన్న ఆంక్షలు తొలగిస్తూ అటు నిర్మాణాలను అనుమతిస్తూ GO- 69 విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న 84గ్రామాలకు విముక్తి కల్పించామని ప్రభుత్వమంటే.. రాజకీయంగా మరో కుట్రకు తెరతీశారని విమర్శిస్తున్నాయి విపక్షాలు. రియల్‌ఎస్టేట్ మాఫియాకు మేలు జరుగుతుందని కాంగ్రెస్, బీజేపీలు ఆరోపిస్తుంటే.. రైతుల భూమలకు ధరలు పెరగడం ప్రతిపక్షాలకు కంటగింపుగా ఉందంటోంది అధికారపార్టీ. జీవో 111 పరిధిలోని గ్రామాల్లో ఆంక్షలు సడలిస్తూ జీవో 69 వచ్చింది. అభివృద్ది లేకుండా మెడపై కత్తిలా మారిన 84 గ్రామాలకు విముక్తి కల్పించామన్నది ప్రభుత్వ వాదన. ఈ నెల 12న రాష్ట్ర మంత్రివర్గం తీసుకొన్న నిర్ణయానికి అనుగుణంగానే 111 goపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ బుధవారం జీవో వచ్చింది.
హైదరాబాద్ నగరానికి మంచినీటి సరఫరా కోసం హిమాయత్‌సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలను పరిరక్షించేందుకు 1996 మార్చి 8న అప్పటి ప్రభుత్వం జీవో 111ను తీసుకొచ్చింది. పది కిలోమీటర్ల పరిధిలోని 84 గ్రామాల్లో ఆంక్షలున్నాయి. లక్షల ఎకరాల్లో వ్యవసాయం మినహా ఏ రంగాల్లోనూ అభివృద్ధి జరగలేదు. 2018 ఎన్నికల్లో 111 జీవోను ఎత్తివేస్తామని TRS అధినేతగా KCR హామీ ఇచ్చారు. ఇటీవల కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. అయితే లీగల్‌గా ఉన్న అడ్డంకుల నేపథ్యంలో పాతది రద్దు చేయకుండా కొత్తగా జీవో 69 తీసుకొచ్చారు. రియల్ ఎస్టేట్ మాఫియాకు భూములు కట్టబెట్టే ప్రయత్నమని.. రెండు జంట జలాశయాలు కూడా మరో హుస్సేన్ సాగర్‌లా మారతాయని ఆరోపించింది కాంగ్రెస్. గతంలో ఇచ్చిన కోర్టు ఆదేశాలకు విరుద్దంగా జీవో ఇచ్చారంటూ పీసీసీ చీఫ్ డాక్యుమెంట్లతో ట్వీట్ చేశారు.
రైతులకు ధరలు పెరిగితే స్వాగతిస్తామని అయితే.. ఇందులో అధికారపార్టీ స్వప్రయోజనాలే అధికంగా ఉన్నాయంటోంది బీజేపీ. లీగల్‌గా సాధ్యం కాదని తెలిసినా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్న కేసీఆర్ మరోసారి స్థానిక ప్రజలను మోసం చేయడమేనంటున్నారు కమలనాథులు. ఇది రెండున్నర దశాబ్దాల పోరాటమని TRS నాయకులు చెబుతున్నారు. 69 జీవోను వ్యతిరేకించడం అంటే స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడకుండా అడ్డుకోవడమేనన్నది వారి వాదన. గ్రామాల్లో కూడా స్థానికులు స్వాగతించడంతో పాటు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించే వారిని గ్రామాల్లోకి రాకుండా అడ్డుకుంటామని తీర్మానాలు చేస్తున్నారు. పర్యావరణ పరంగా ఉండే సమస్యలు పక్కనపెడితే జంటజలాశయాలకు పొలిటికల్ ఫ్లడ్ మాత్రం పోటెత్తుతోంది. – బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్.
ఇదే అంశానికి సంబంధించి ఇవాళ్టి బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ విత్ రజనీకాంత్‌లో డిబేట్ నిర్వహించారు. ఆ లైవ్ వీడియో దిగువన చూడండి..