తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనంతగా రాజకీయ వేడి రాజుకుంది. అప్పుడే ఎన్నికలు వచ్చాయా అన్నట్టుగా సవాళ్లు, ప్రతిసవాళ్లతో పోటీపడి మరీ రచ్చరచ్చ చేస్తున్నాయి పార్టీలు. ఇంకా రెండున్నర ఏళ్లు ఉండగానే యుద్ధం మొదలు పెట్టాయి. అధికారపార్టీ బంధు పథకాలను తెరమీదకు తీసుకొస్తే… కమలనాథులు యాత్రలతో మతరాజకీయాలకు పదును పెట్టారు. MIMను టార్గెట్ చేస్తూ పాతబస్తీలో కొత్త ఎజెండా తెరమీదకు తీసుకొచ్చారు. హైదరాబాద్‌తో సహా చారిత్రక నిర్మాణాల పేర్లు మార్చి తీరుతామంటున్నారు. అటు దశాబ్ధాల చరిత్ర కాంగ్రెస్ కూడా దండోరా ఆత్మగౌరవ సభలంటూ జనాల్లోకి వెళుతూనే బీజేపీ మతరాజకీయాలపై విమర్శలు ఎక్కుపెట్టింది.
తెలంగాణలో ఎవరి ఎజెండా వారిదే. జెండాలు పట్టుకుని ఊరూవాడా నినాదాలతో ఒకటే హడావిడి. బంధు పథకాలు ప్రకటిస్తోంది అధికారపార్టీ.. పాదయాత్రలు చేస్తోంది బీజేపీ. ఇక దండోరా ఆత్మగౌరవ సభలంటోంది కాంగ్రెస్ పార్టీ. కొంతకాలంగా తెలంగాణలో ప్రత్యామ్నాయం మేమే అని చెప్పుకుంటున్న కమలనాథులు హిందూత్వ ఎజెండాపై ఫోకస్ పెట్టారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో అధికారంలోకి వచ్చి గోల్కొండ పేరు మార్చి.. కాషాయ జెండా ఎగురవేస్తామన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. హిందువులను కాపాడే పార్టీ మాదేనంటూ తమ ఎజెండా ఫిక్స్ చేశారు. అంతేకాదు MIMను దేశం నుంచే తరమికొడతామంటూ వ్యాఖ్యల్ల్లో ఘాటు పెంచారు బండి.
అటు దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా అంటూ కాంగ్రెస్ నేతలు సైతం యాత్రలు మొదలుపెట్టారు. గిరిజనులకు, బీసీలకు కూడా బంధు పథకాలు అమలు చేయాలంటూ హస్తం పార్టీ టీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తోంది. ఎన్ని బంధులు పెట్టినా దళితులు హస్తం పార్టీకే అండగా ఉంటారంటున్న కాంగ్రెస్.. బండి బోల్తాపడటంతో యాత్ర మొదలుపెట్టి భాగ్యలక్ష్మి అమ్మవారి జపం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు ముధుయాష్కీ. షర్మిల, ప్రవీణ్‌కుమార్ పార్టీల వెనకుంది కూడా బీజేపీయేనని ఆరోపించారు హస్తం నేతలు
విపక్షాలు పోర్లు దండాలు పెట్టి… మోకాళ్లపై రాష్ట్రమంతా తిరిగిన సీట్లు ఓట్లు పడవంటోంది అధికారTRS. ప్రగతి భవన్, గోల్కొండలో ఏ జెండాలుంటాయో తెలియకుండానే పార్టీ జెండాలు ఎగరేస్తామని పిచ్చి ప్రేలాపనలు మానుకుంటే మంచివదంటున్నారు TRS ఎమ్మెల్యేలు. దేశాన్ని అమ్ముతున్న బీజేపీకి ఓట్లు వేసేందుకు ప్రజలు సిద్దంగా లేరని.. ముందు పెరిగిన ధరలపై సమాధానం చెప్పాలంటున్నారు అధికారపార్టీ నేతలు. మరి ముందే కూసిన కోయిల అన్నట్టు ప్రజల చుట్టూ తిరుగుతున్న పార్టీల్లో జనాల మద్దతు ఎవరికో…
(బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్)
ఇదే అంశంపై టీవీ9 బిగ్ న్యూస్ బిగ్‌డిడేట్‌లో చర్చ జరిగింది. ఫుల్ వీడియో కోసం కింద లింక్ క్లిక్ చేయండి…