Big News Big Debate: తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాలు.. కామ్రేడ్ల దారెటు.?

| Edited By: Ravi Kiran

Sep 30, 2021 | 9:34 PM

తెలంగాణ గట్టు మీద సరికొత్త రాజకీయం మొదలైంది. కామ్రేడ్లు కొత్త దోస్తీ మొదలు పెట్టారు. పాత ఫ్రెండ్‌తో కొత్తగా స్నేహం చేస్తున్నారు. జాతీయ స్థాయి..

Big News Big Debate: తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాలు.. కామ్రేడ్ల దారెటు.?
Big News Big Debate
Follow us on

తెలంగాణ గట్టు మీద సరికొత్త రాజకీయం మొదలైంది. కామ్రేడ్లు కొత్త దోస్తీ మొదలు పెట్టారు. పాత ఫ్రెండ్‌తో కొత్తగా స్నేహం చేస్తున్నారు. జాతీయ స్థాయి అజెండాతో రాష్ట్ర స్థాయిలో పోరాటం చేస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్‌తో కలుస్తూ, మరోవైపు ప్రగతి భవన్‌కు వెళుతున్నారు. ఇంతకీ వాళ్ల దారెటు? హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో కామ్రేడ్ల అవసరం ఎవరికి ఎంత ఉంది?

ఒకవైపు హుజూరాబాద్‌ ఉప ఎన్నిక, మరోవైపు జాతీయ స్థాయిలో అఖిలపక్ష పార్టీల ఉమ్మడి పోరాటం. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కాంగ్రెస్‌, లెఫ్ట్‌, మరికొన్ని పార్టీల ఉమ్మడి పోరాటం సరికొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తోంది. 2018లో మహా కూటమిగా జట్టు కట్టినా పెద్దగా ఫలితం లేదు. ఆ తర్వాత ఏ పార్టీకి ఆ పార్టీనే సింగిల్‌గా పోరాడూతూ వచ్చాయి. ఇటీవల గాంధీభవన్‌కు లెఫ్ట్‌ పార్టీల నేతలు, మిగిలిన నాయకులు మళ్లీ వెళ్లడం రాజకీయ ఆసక్తిని పెంచుతోంది.

జాతీయ స్థాయిలో బీజేపీపై, రాష్ట్ర స్థాయిలో టీఆర్‌ఎస్‌పై పోరాటానికి ఉమ్మడి పోరాటానికి సిద్ధమయ్యాయి పార్టీలు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన భారత్‌ బంద్‌లో కలిసికట్టుగానే పాల్గొన్నారు నేతలు. లెఫ్ట్‌ పార్టీల జాతీయ నేతలు మహాధర్నాకు వచ్చారు. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో నిరుద్యోగం, పోడు భూముల సమస్యలపై పోరాట కార్యాచరణను ప్రకటించారు కాంగ్రెస్‌, లెఫ్ట్‌ నేతలు. ప్రజాసమస్యలపై పోరాటంతోపాటు హుజూరాబాద్‌ ఉప ఎన్నిక వీరి మధ్య మళ్లీ పొత్తుకు తెరతీస్తుందా అనే చర్చ జరుగుతోంది. ఉప ఎన్నికలో లెఫ్ట్‌, మిగిలిన పార్టీల మద్దతు కోరుతోంది కాంగ్రెస్‌. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. దళిత బంధు అంశంలో మాత్రం ప్రభుత్వానికి మద్దతుగానే ఉన్నారు లెఫ్ట్‌ పార్టీల నేతలు. ప్రగతి భవన్‌లో జరిగిన సమావేశాలకు వెళ్లారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయాన్ని సమర్ధించారు. ఈ నేపథ్యంలో 2023 నాటికి కామ్రేడ్ల దారి ఎవరి వైపు? కాంగ్రెస్‌ వైపా? టీఆర్‌ఎస్‌ వైపా? లేదంటే ఎవరి దారి వారిదేనా? అసలు వారి అవసరం ఎవరికి ఎంత ఉంది?

(బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్)

ఇదే అంశంపై టీవీ9 స్టూడియోలో బిగ్‌ డిబేట్‌ జరిగింది.. పూర్తి సమాచారం కోసం కింద వీడియో చూడండి..