Shukra Gochar: దుస్థానాల్లో శుక్రుడు.. ఈ రాశుల వారు దాంపత్య జీవితంలో జాగ్రత్త!

నవంబర్ 3-26 వరకు శుక్రుడు తన స్వక్షేత్రమైన తులా రాశిలో సంచరిస్తున్నాడు. ప్రేమ, వివాహం, సంపదలకు కారకుడైన శుక్రుడి సంచారం కొన్ని రాశులకు అదృష్టాన్ని కలిగించినా, వృషభం, సింహం, వృశ్చికం, మీన రాశి వారికి మాత్రం దాంపత్య, ఆర్థిక, ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అనవసర పరిచయాలు, ఖర్చులు తగ్గించుకుని, భాగస్వామితో పారదర్శకంగా ఉండటం మంచిది.

Shukra Gochar: దుస్థానాల్లో శుక్రుడు.. ఈ రాశుల వారు దాంపత్య జీవితంలో జాగ్రత్త!
Marriage Astrology

Edited By:

Updated on: Oct 29, 2025 | 6:54 PM

నవంబర్ 3వ తేదీ నుంచి 26 వరకు శుక్రుడు తన స్వస్థానమైన తులా రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. సిరిసంపదలు, భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు, శృంగారం, దాంపత్య జీవితం, ప్రేమలు, పెళ్లిళ్లకు కారకుడైన శుక్రుడు తులా రాశిలో సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారు అదృష్టవంతులు కావచ్చు కానీ, కొన్ని రాశులవారు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. శుక్రుడు దుస్థానాల్లో, అంటే 3, 6, 8, 12 రాశుల్లో సంచారం చేస్తున్నప్పుడు సుఖ సంతోషాలు తక్కువగానూ, కష్టనష్టాలను ఎక్కువగానూ ఇచ్చే అవకాశం ఉంది. వృషభం, సింహం, వృశ్చికం, మీన రాశి వారు కొన్ని విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.

  1. వృషభం: రాశ్యధిపతి శుక్రుడు ఈ రాశికి ఆరవ స్థానంలో సంచారం చేయడం సుఖ సంతోషాలకు ఏమంత మంచిది కాదు. శుక్రుడు తులా రాశికి కూడా అధిపతి అయినప్పటికీ, దాంపత్య జీవితంలో కొద్దిగా సమస్యలు సృష్టించే అవకాశం ఉంటుంది. ఈ రాశివారికి గానీ, జీవిత భాగస్వామికి గానీ కొద్దిపాటి అనారోగ్యాలు కలిగించే అవకాశం ఉంది. మనస్పర్థలు తలెత్తడానికి కూడా అవకాశం ఉంది. అనవసర పరిచయాలకు, వ్యసనాలకు, అనవసర ఖర్చులకు కొద్దిగా దూరంగా ఉండడం మంచిది.
  2. సింహం: ఈ రాశికి తృతీయ స్థానంలో శుక్ర సంచారం వల్ల అనవసర పరిచయాల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి కంటే మిత్రులకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలకు ఆటంకాలు ఏర్పడతాయి. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. తరచూ మాట పట్టింపులు, వాగ్వాదాలు, అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో పారదర్శకంగా వ్యవహరించడం మంచిది. మాట తొందరపాటు తగ్గించుకోవడం చాలా అవసరం.
  3. వృశ్చికం: ఈ రాశికి వ్యయ స్థానంలో శుక్ర సంచారం వల్ల దంపతుల మధ్య కొద్దిగా ఎడబాటు కలిగే అవకాశం ఉంది. తరచూ ప్రయాణాల వల్ల, బదిలీ వల్ల, పని భారం వల్ల, అనారోగ్యాల వల్ల ఇద్దరి మధ్యా దాంపత్య సమస్యలు తలెత్తుతాయి. అనవసర పరిచయాలకు, విలాసాలకు కూడా అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో కూడా కొద్దిపాటి అనుమానాలు, అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం మీద, అవసరాల మీద తగినంత శ్రద్ధ పెట్టడం మంచిది.
  4. మీనం: ఈ రాశికి అష్టమ స్థానంలో శుక్ర సంచారం వల్ల ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల కారణంగా దంపతుల మధ్య విభేదాలు, వాగ్వాదాలకు అవకాశం కలుగుతుంది. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు జీవిత భాగస్వామితో సంప్రదించడం మంచిది. కుటుంబ వ్యవహారాల్లో బంధువుల జోక్యం కూడా సమస్యలను సృష్టించే అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ జీవిత భాగస్వామిని విశ్వాసం లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద దాంపత్య జీవితం హ్యాపీగా సాగే అవకాశం లేదు.