Lucky Horoscope: మిథున రాశిలోకి మూడు కీలక గ్రహాలు.. ఈ పరిహారాలతో ఆ రాశుల వారికి అదృష్టమే అదృష్టం

| Edited By: Janardhan Veluru

Jun 12, 2024 | 3:18 PM

ఈ నెల 14 నుంచి ఆరు రాశుల వారికి కొన్ని శుభ యోగాలతో పాటు చిన్నపాటి అవయోగాలు కలిగే అవకాశం కూడా ఉంది. ఈ నెల 14న మిథునంలో మూడు గ్రహాలు చేరడం వల్ల ఆరు రాశుల వారికి మిశ్రమ ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది.

Lucky Horoscope: మిథున రాశిలోకి మూడు కీలక గ్రహాలు.. ఈ పరిహారాలతో ఆ రాశుల వారికి అదృష్టమే అదృష్టం
Lucky Horoscope
Follow us on

ఈ నెల 14 నుంచి ఆరు రాశుల వారికి కొన్ని శుభ యోగాలతో పాటు చిన్నపాటి అవయోగాలు కలిగే అవకాశం కూడా ఉంది. ఈ నెల 14న మిథునంలో మూడు గ్రహాలు చేరడం వల్ల మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశులకు మిశ్రమ ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. పూర్తి స్థాయి యోగం పట్టడానికి ఈ రాశివారు కొన్ని సాధారణ పరిహారాలను అనుసరించడం వల్ల అవయోగాలు, దుష్ఫలితాలు కూడా అదృష్టాలుగా మారే అవకాశం ఉంటుంది. మిథున రాశిలో ఈ మూడు గ్రహాల దాదాపు నెల రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది.

  1. మేషం: ఈ రాశిలో రాశ్యధిపతి కుజుడి సంచారం వల్ల, ధన స్థానంలో గురువు ఉండడం వల్ల అన్ని విధాలుగానూ ప్రాధాన్యం, ప్రాభవం పెరిగే అవకాశం ఉంది. ఊహించని విధంగా రాజయోగాలు, ధన యోగాలు పట్టే సూచనలున్నాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. అయితే, తృతీయ స్థానంలో బుధ, శుక్ర, రవుల కలయిక వల్ల ప్రయత్నాలకు అవరో ధాలు ఏర్పడతాయి. దీని నుంచి బయటపడడానికి, శీఘ్ర పురోగతికి గణపతి స్తోత్రం తప్పనిసరి.
  2. కర్కాటకం: ఈ రాశికి దశమంలో కుజుడు, లాభ స్థానంలో గురువు కొండంత అండగా ఉంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఇబ్బడిముబ్బడిగా ఆర్థిక లాభాలుంటాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. అయితే, వ్యయ స్థానంలో మూడు గ్రహాల సంచారం వల్ల ఆదాయంలో ఎక్కువ భాగం వృథా అవుతుంది. కొన్ని పనులు నిష్ఫలమవుతాయి. సుబ్రహ్మణ్యాష్టకం పఠనం వల్ల సత్ఫలితాలు వృద్ధి చెందుతాయి.
  3. కన్య: ఈ రాశికి భాగ్య స్థానంలో గురువు, దశమ స్థానంలో రాశ్యధిపతి బుధుడు ఉన్నందువల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరగడం, పదోన్నతులు లభించడం, జీతభత్యాలు వృద్ధి చెందడం వంటివి జరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కూడా లాభాల బాటపడతాయి. నిరుద్యోగులు అత్యధికంగా లాభపడతారు. అయితే, అష్టమంలో కుజుడు, దశమంలో వ్యయాధిపతి రవి కారణంగా నరఘోష ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు గణపతి స్తోత్రాన్ని పఠించడం మంచిది.
  4. వృశ్చికం: ఈ రాశివారికి సప్తమ కేంద్రంలో గురు సంచారం వల్ల అనేక విధాలుగా కలిసి వస్తుంది. పెళ్లి సమస్యలు పరిష్కారం అవుతాయి. మంచి పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. కొన్నిముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. అయితే, మూడు గ్రహాలు అష్టమ స్థానంలో చేరడం వల్ల వృథా ఖర్చులు పెరుగుతాయి. కొన్ని ఆరోగ్య సమ స్యలు వేధిస్తాయి. సుందరకాండ పారాయణం వల్ల వీటి నుంచి బయటపడడం జరుగుతుంది.
  5. మకరం: ఈ రాశివారికి ధన స్థానంలో ధనాధిపతి శని, పంచమంలో గురువు వల్ల మంచి రాజయోగం పడుతుంది. అనేక విషయాల్లో పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగవు తుంది. శుభ కార్యాలు జరుగుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ప్రతిభా పాటవాలకు గుర్తింపు లభిస్తుంది. అయితే, 6వ స్థానంలో మూడు గ్రహాలు కలవడం వల్ల లేనిపోని వివాదాలు చుట్టుముడతాయి. బాగా ఒత్తిడి ఉంటుంది. దత్తాత్రేయ స్తోత్ర పఠనంతో వీటి నుంచి బయటపడే అవకాశం ఉంది.
  6. మీనం: ఈ రాశికి ధన స్థానంలో ధనాధిపతి కుజుడు ఉండడం యోగదాయకం. ఆరోగ్యానికి, ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. రాశ్యధిపతి గురువు తృతీయ స్థానంలో ఉన్నందువల్ల శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. అయితే, నాలుగవ స్థానంలో మూడు గ్రహాల కలయిక వల్ల ఎంత సంపాదించినా, ఎంత కష్టపడినా సుఖం ఉండదు. ఆదిత్య హృదయం పఠనం వల్ల సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి.