Telugu Astrology
జ్యోతిష శాస్త్రంలో నాలుగు రాశుల వారు బంధుప్రీతిలో ఇతర రాశుల కంటే వందరెట్లు ముందుంటారు. వీరి బంధు ప్రేమని తట్టుకోలేము అని కూడా చెప్పవచ్చు. ఈ నాలుగు రాశులు వృషభం, తుల, మకరం, కుంభం. వీరు ఎటువంటి బంధాలను కలిగి ఉన్న అవి పటిష్టంగా దృఢంగా కలకాలం అంటే జీవితాంతం ముందుకు సాగుతూ ఉంటాయి. వీరి ప్రేమలు, అనుబంధాలు కూడా అదే విధంగా చెక్కుచెదరకుండా జీవితాంతం కొనసాగుతాయి. ఎవరి మీదనైనా వీరికి ఒకసారి నమ్మకం కుదిరితే అది ఒక పట్టాన సడలదు. వీరిని ప్రేమించడం కష్టం. నమ్మించడం చాలా కష్టం. అయితే వీరితో ప్రేమలో పడినా, వీరి స్నేహ బృందంలో చేరినా, వీరికి నమ్మకం కుదిరినా ఆ తరువాత ఆ బంధాన్ని విడదీయడం ఎవరి వల్లా కాదు. ఈ నాలుగు రాశుల వారితో బంధం ఏ స్థాయిలో ఏ విధంగా ఉంటుందో ఇక్కడ పరిశీలిద్దాం.
- వృషభ రాశి: ఈ రాశి వారు ప్రేమ వ్యవహారాల్లోనే కాకుండా సంబంధ బాంధవ్యాలలో కూడా దృఢంగా, నమ్మకంగా, విశ్వాసపాత్రంగా, ఆధారపడదగిన వ్యక్తిగా మెలుగుతారు. బాంధవ్యాలకు సంబంధించినంతవరకు వీరిని ఇంగ్లీషులో రాక్ ఆఫ్ జిబ్రాల్టర్ గా వ్యవహరిస్తారు. బంధువులలో వీరికి ఏ కారణం చేతనో కొందరు నచ్చుతారు. వారు బాగా సన్నిహితం అవుతారు. ఒకసారి నచ్చితే వృషభ రాశి వారు వారిని వదిలిపెట్టడం జరిగే పని కాదు. వారి కష్టసుఖాల్లో భాగం పంచుకోవడమే కాకుండా వారి బాధ్యతలను పూర్తిగా తన భుజాల మీద వేసుకుంటారు. వారి కోసం ఎటువంటి త్యాగానికైనా వెనుకాడరు. ఈ ఏడాది వీరు తమ ప్రాణ స్నేహితుల కోసం, ప్రేమికుల కోసం, బంధువుల కోసం ఆర్థికంగా బాగా ఖర్చు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. వీరి చేతుల మీదుగా శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.
- తులా రాశి: ఈ రాశి వారు ప్రేమ కోసం ప్రాణత్యాగం చేయటానికైనా సిద్ధపడతారు. స్నేహితులు, ప్రేమికులు, బంధువులలో ఎవరైనా తన మనసుకు నచ్చితే వారి కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధంగా ఉంటారు. వారు ఎన్ని తప్పులు చేసినా పట్టించుకోరు. న్యాయాన్యాయ విచక్షణ కూడా పాటించరు. వీరిది ఒక రకంగా గుడ్డి ప్రేమ. వీరు సొంత ఇంటి పనుల కన్నా బంధువుల ఇంట్లో బాధ్యతలు నెరవేర్చడానికి ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటారు. బంధువులు ఎంత దూరంలో ఉన్నా వారిని క్రమం తప్పకుండా పలకరిస్తూ ఉంటారు. వీరికి ద్వేషం లేదా అయిష్టం కలిగినా ఇదే స్థాయిలో ఉంటుంది. ప్రేమలో పరాకాష్టకు వెళ్లినట్లే ద్వేషం లో కూడా పరాకాష్టకు వెళ్లటం వీరి నైజం. ఈ ఏడాది వీరు బంధుమిత్రులతో విహారయాత్రలకు వెళ్లడం లేదా తీర్థయాత్రలకు వెళ్లడం వంటివి జరిగే అవకాశం ఉంది. బంధువుల ఇంట శుభకార్యాలలో వీరిదే ప్రధాన పాత్ర అవుతుంది.
- మకర రాశి: బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, సొంత ఊరిపై మమకారం, అయినవారు అంటే అతి ప్రేమ వీరి సహజ లక్షణాలు. బంధువుల మీద సొంత ఊరి మీద వీరికి ఉన్నంత అభిమానం మమకారం మరి ఎవరికి ఉండకపోవచ్చు. బంధువులను పలకరించడం మీద బంధువులకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం మీద వీరికి ఉన్నంత శ్రద్ధ శక్తులు ఆశ్చర్యం కలిగిస్తాయి. తమ పట్ల అభిమానం లేదా ప్రేమ చూపించే వారిని వీరు జీవితాంతం వదులుకోరు. వీరికి ఎవరైనా ప్రేమతో దగ్గర కావాల్సిందే తప్ప అధికారంతో లేదా దౌర్జన్యంతో లేదా అవసరంతో దగ్గర కావడం దాదాపు అసాధ్యం అని చెప్పవచ్చు. విచిత్రం ఏమిటంటే, ఇతరుల మనస్తత్వాన్ని వీరు తేలికగా పసిగట్టగలుగుతారు. అందువల్ల నకిలీ అభిమానంతో వీరి మనసును గెలుచుకోవడం కష్టం. ఈ ఏడాది వీరికి మరింత ఎక్కువ సంఖ్యలో బంధువులు, స్నేహితులు అభిమాన పాత్రులయ్యే అవకాశం ఉంది. తనకు నచ్చిన బంధువుల మీదా, స్నేహితుల మీదా భారీగా కానుకల వర్షం కురిపించే సూచనలు కూడా ఉన్నాయి.
- కుంభ రాశి: ఈ రాశి వారికి ఎవరు, ఎప్పుడు, ఎందుకు నచ్చుతారన్నది చెప్పడం చాలా కష్టం. వీరి మనసుకు నచ్చితే మాత్రం వారిని వదిలి పెట్టడం అసాధ్యాల్లోకెల్లా అసాధ్యం అని చెప్పవచ్చు. వాస్తవానికి వీరి ప్రేమని అభిమానాన్ని తట్టుకోవడం స్నేహితులకు బంధువులకు కొంచెం కష్టంగా కూడా కనిపిస్తుంది. వీరి అభిమానం ప్రేమ చాలా స్వచ్ఛంగా ఉంటాయి. కుల మత స్థాయి హోదా వివక్ష లేకుండా వీరు తనకు నచ్చిన వారిపై ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సొంత లాభం పూర్తిగా మానుకుని బంధువులకు సహాయపడుతూ ఉంటారు. కొందరు బంధువుల బాధ్యతలను వీరు జీవితాంతం మోస్తూ కనిపించడం కూడా జరుగుతుంది. వీరిలో మితిమీరిన ఔదార్యం, దయాగుణం వ్యక్తం అవుతూ ఉంటాయి. బంధుప్రీతిలో వీరికి వీరే సాటి. ఈ ఏడాది ఈ రాశి వారికి కొంత కలిసి వచ్చే కాలం అయినందువల్ల కొందరు బంధువులు వీరి వల్ల మంచి జీవితం గడపటానికి అవకాశం ఉంది.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..