Telugu Astrology
ప్రస్తుతం మేష రాశిలో సంచరిస్తున్న గురువు మీద పాప గ్రహాలైన శని, కుజ గ్రహాల దృష్టి ఉంది. దీనివల్ల అన్ని రాశులకూ నష్టం లేదు కానీ, ఆరు రాశులకు మాత్రం ధన నష్టం, ఉద్యోగంలో ఒత్తిడి, వేధింపులు, మోసపోవడం, ఆశాభంగం చెందడం, మితిమీరిన ధన వ్యయం, అనారోగ్యాలు వంటివి చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ పరిస్థితి మరో నెల రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండడం, ఆచితూచి వ్యవహరించడం వల్ల ఈ దోషాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఆ ఆరు రాశులుః వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీనం.
- వృషభం: ఈ రాశివారికి వ్యయ స్థానంలో ఉన్న గురువును శని తృతీయ దృష్టితోనూ, కుజుడు నాలుగవ దృష్టితోనూ చూస్తున్నందువల్ల ఎంత కష్టపడ్డా ఫలితం ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. అతిగా ధన వ్యయం జరుగుతుంటుంది. స్నేహితులు మోసగించడం, ప్రయాణాల్లో డబ్బు కోల్పోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా కుట్రలు, కుతంత్రాలకు కూడా అవకాశం ఉంటుంది. అయితే, ఇతర గ్రహాల అనుకూలత ఉన్నందువల్ల ఇవన్నీ తగ్గు స్థాయిలో జరగవచ్చు.
- కర్కాటకం: ఈ రాశికి దశమ స్థానంలో సంచరిస్తున్న గురువును శని, కుజులు వీక్షించడం ఉద్యోగపరంగా ఏమంత మంచిది కాదు. తప్పకుండా ఉద్యోగంలో ఒత్తిడి, అధికారుల నుంచి వేధింపులుంటాయి. సహోద్యోగులు దుష్ప్రచారం సాగించే అవకాశం ఉంది. కొందరు స్నేహితులు తప్పుదారి పట్టించడం వల్ల ఆర్థిక నష్టం జరుగుతుంది. ఎటువంటి వివాదంలోనూ తలదూర్చకపోవడం మంచిది. కుటుంబ విషయాలు ఇబ్బంది కలిగిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.
- కన్య: ఈ రాశివారికి ఎనిమిదవ స్థానంలో ఉన్న గురువు మీద శని, కుజుల దృష్టి పడడం వల్ల ఆర్థిక వ్యవహారాలన్నీ ఆలస్యం అవుతుంటాయి. ఆస్తి వివాదాలు వాయిదా పడుతుంటాయి. ముఖ్య మైన పనులు, ప్రయత్నాలు ఒకపట్టాన ముందుకు వెళ్లవు. ఆదాయానికి లోటుండకపోవచ్చు కానీ, వృథా ఖర్చులు ఇబ్బంది పెడతాయి. పెళ్లి ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు దగ్గర వరకూ వచ్చి ఆగిపోతుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి మందగిస్తుంది. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి.
- వృశ్చికం: ఈ రాశికి ఆరవ స్థానంలో ఉన్న గురువు మీద శని, కుజుల దృష్టి పడడం ఒకటి రెండు అవ యోగాల్ని కలిగించే అవకాశం ఉంది. సంపాదనలో అధిక భాగం వృథా అయిపోతుంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతికి ఎవరో ఒకరు అడ్డుపుల్లలు వేస్తుంటారు. ఏదో ఒక సమస్య చికాకు పెడు తుంటుంది. ఆర్థిక వ్యవహారాలు మందకొడిగా ముందుకు సాగుతాయి. శత్రు బాధ, పోటీదార్ల బెడద ఎక్కువగా ఉంటుంది. మధ్య మధ్య వైద్య ఖర్చులు పెరుగుతుంటాయి. బాగా ఒత్తిడి ఉంటుంది.
- మకరం: ఈ రాశికి నాలుగవ స్థానంలో ఉన్న గురువు మీద శని, కుజుల దృష్టి పడడం వల్ల ఇంటా బయటా పనిభారం బాగా పెరుగుతుంది. మధ్య మధ్య మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. వృత్తి, ఉద్యో గాల్లో అధికారులు అతిగా ఆధారపడడం గానీ, సహచరుల బాధ్యతలను కూడా అప్పగించడం గానీ జరుగుతుంటుంది. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. డబ్బు తీసుకున్నవారు సకాలంలో తిరిగివ్వరు. కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరిని స్వల్ప అనారోగ్యం పీడిస్తూ ఉంటుంది.
- మీనం: ఈ రాశ్యధిపతి అయిన గురువును పాపగ్రహాలైన శని, కుజులు వీక్షించడం వల్ల ఏ ప్రయత్నమైనా, ఏ పనైనా పూర్తి స్థాయి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉండదు. ఆర్థిక పరిస్థితి కొద్ది కొద్దిగా మెరుగు పడుతున్నప్పటికీ, ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతుంటుంది. బాగా నమ్మినవారు మధ్య మధ్య మోసం చేస్తూ ఉంటారు. రావలసిన సొమ్ము ఒక పట్టాన చేతికి అందదు. శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలకు లోటుండదు కానీ పనిభారం పెరుగుతుంది.