Sun Transit In Libra 2023
Surya Gochar October 2023: గ్రహ రాజైనటువంటి రవి గ్రహం ఈ నెల 17న తులా రాశిలో ప్రవేశించి నీచబడడం జరుగుతోంది. రవి గ్రహం ప్రభుత్వానికి, పాలనకు, అధికారులకు, అధిపతులకు సంబంధించిన గ్రహం. అందువల్ల రవి నీచబడితే ఈ అంశాలన్నీ దెబ్బతినే లేదా బలహీనపడే అవకాశం ఉంటుంది. అయితే, తులా రాశిలో ప్రవేశించిన రవితో కుజుడు, ఆ మరునాడు బుధుడు కలుస్తుండడం వల్ల, గురు వీక్షణ కూడా పొందుతున్నందువల్ల చెడు ఫలితాలు బాగా తగ్గే అవకాశం ఉంది. నవంబర్ 17 వరకూ రవి గ్రహం తులా రాశిలో కొనసాగడం జరుగుతుంది. రవి నీచబడడం వల్ల ఏయే రాశుల వారికి ఏ విధంగా ఉండబోయేదీ ఇక్కడ గమనిద్దాం.
- మేషం: ఈ రాశికి పంచమాధిపతి అయిన రవి సప్తమ స్థానంలో నీచబడడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపా రాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో అసంతృప్తిని ఎదుర్కోవాల్సి వస్తుంది. పిల్లలతో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అయితే, ఈ రవి కుజుడితో కలిసి ఉండడం, గురువు చూస్తుండడం వల్ల వృత్తి, ఉద్యోగాలపరంగా అధికారులకు చేరువ కావడం, కొద్దిగా ప్రయోజనాలు పొందడం కూడా జరుగుతుంది. అనవసర పరిచయాలకు అవకాశం ఉంది.
- వృషభం: ఈ రాశివారికి నాలుగవ స్థానాధిపతి అయిన ఆరవ స్థానంలో నీచపడడం వల్ల సుఖం తగ్గడం, మనశ్శాంతి కరువవడం, ఇల్లు మారాల్సి రావడం, ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం తగ్గవచ్చు. అధికారులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. సతీమణితో అపా ర్థాలు తలెత్తే అవకాశం కూడా ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభించక పోవచ్చు.
- మిథునం: ఈ రాశికి పంచమ స్థానంలో తృతీయాధిపతి రవి ప్రవేశించడం వల్ల, అక్కడ రాశినాథుడు బుధుడితో కలుస్తున్నందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ ఆలోచనలు ఫలిస్తాయి. ప్రతిభా పాటవాలు మరింతగా వెలుగులోకి వస్తాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. పంచమ స్థానంలో ఉన్న రవి, బుధులను గురువు చూడడం వల్ల పిల్లలు ఆశించిన స్థాయిలో అభివృద్ధిలోకి వస్తారు. ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు తీరిపోతాయి.
- కర్కాటకం: ఈ రాశివారికి ధన స్థానాధిపతి అయిన రవి నాలుగవ స్థానంలో నీచబడడం వల్ల గృహ, వాహన సౌకర్యాల మీద బాగా ఖర్చు అవడంతో పాటు, కుటుంబం మీద కూడా ఖర్చు పెరుగుతుంది. ఇల్లు మారడం, స్థాన చలనం కలగడం, తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగించడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఈ రవితో బుధ, రవులు కలవడం, గురువు వీక్షించడం వల్ల ఎక్కువగా ప్రతికూల ఫలితాలు ఉండకపోవచ్చు. పిల్లల చదువుల విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవడం మంచిది.
- సింహం: ఈ రాశినాథుడైన రవి తృతీయ స్థానంలో నీచబడడం వల్ల స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ప్రయత్న లోపం వల్ల కొన్ని వ్యవహారాలు పెండింగులో పడే అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో విలువైన వస్తువులు పోగొట్టుకోవడం జరుగుతుంది. సోదరులతో ఆస్తి వివాదం ఏర్పడుతుంది. గురు వీక్షణ వల్ల తీవ్రమైన సమస్యలు, ఇబ్బందులు ఉండకపోవచ్చు. అయితే, వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో కాస్తంత ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆదాయానికి లోటుండకపోవచ్చు.
- కన్య: ఈ రాశికి ద్వితీయ స్థానంలో వ్యయాధిపతి రవి నీచబడడం వల్ల ఆదాయం పెరగకపోవచ్చు కానీ, ఖర్చులు బాగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో రాబడి ఆశించిన స్థాయిలో పెరగకపోవచ్చు. రాశినాథుడైన బుధుడు ధన స్థానంలో బలంగా ఉన్నందువల్ల ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. మాటకు, చేతకు విలువ ఉంటుంది. కుటుంబంలో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ఆశించిన శుభవార్తలు వింటారు.
- తుల: ఈ రాశిలో లాభాధిపతి రవి నీచబడుతున్నందువల్ల ఎంత కష్టపడ్డా ఫలితం తక్కువగా ఉంటుంది. స్నేహితుల కారణంగా నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. నీచబడిన రవి మీద గురు దృష్టి కారణంగా, వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి. ఈ రాశిలో బుధుడు కూడా ప్రవేశిస్తున్నందువల్ల వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కొద్ది వ్యయ ప్రయాసలతో ముఖ్య మైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. తోబుట్టువులకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తారు.
- వృశ్చికం: దశమాధిపతి రవి వ్యయ స్థానంలో నీచబడడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలు తలెత్తుతాయి. దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగం మారాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. రాశ్యధిపతి కూడా వ్యయ స్థానంలో ఉన్నందువల్ల ఆదాయాన్ని మించి అనవసర ఖర్చులు ఉండే అవకాశం ఉంది. ఏ విషయంలోనైనా శ్రమ ఎక్కువగా ఫలితం తక్కువగా ఉంటుంది. స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోవడం, ఆరోగ్యం ఇబ్బంది పెట్టడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంది.
- ధనుస్సు: ఈ రాశివారికి భాగ్య స్థానాధిపతి అయిన రవి లాభస్థానంలో ప్రవేశించడం వల్ల ఆశించిన ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది. ఈ రవితో కుజ, బుధులు కలిసి ఉండడం, రాశ్యధిపతి గురువు వీక్షించడం వల్ల అధికార యోగానికి కూడా అవకాశం ఉంది. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అంది వస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది.
- మకరం: ఈ రాశివారికి దశమ స్థానంలో రవి ప్రవేశం వల్ల, అక్కడ కుజ, బుధులు కూడా ఉండడం వల్ల వృత్తి, ఉద్యోగాలపరంగా ప్రాభవం, ప్రాధాన్యం బాగా పెరుగుతాయి. రవి నీచబడినప్పటికీ, ఎక్కువగా శుభ ఫలితాలే ఇవ్వడం జరుగుతుంది. వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో బాగా డిమాండ్ పెరగడం, బిజీ కావడం జరుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా మంచి ఆఫర్లు అందుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి.
- కుంభం: ఈ రాశివారికి సప్తమ స్థానాధిపతి రవి భాగ్య స్థానంలో నీచబడడం శుభ సూచకమని చెప్ప వచ్చు. శత్రు, రోగ, రుణ సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపా రాల్లో పోటీదార్లు తగ్గుతారు. వృత్తి, వ్యాపారాల్లో జోరు పెరుగుతుంది. తండ్రి వైపు నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. దూర ప్రయాణాలు లేదా తీర్థయాత్రలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు, చేసే ఆలోచనలు భవిష్యత్తులో శుభ ఫలితాలనివ్వడం జరుగుతుంది.
- మీనం: ఈ రాశివారికి ఆరవ స్థానాధిపతి అయిన రవి అష్టమ స్థానంలో నీచబడడం వల్ల మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వ్యక్తిగతంగా దీనివల్ల శత్రు బాధ, పోటీదార్ల బెడద తగ్గవచ్చు. అయితే, సతీమణికి స్వల్ప అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ నీచబడిన రవిని రాశ్యధిపతి గురువు ధన స్థానం నుంచి వీక్షిస్తున్నందువల్ల ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం కొనసాగుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి