Simha Rasi Ugadi Rasi Phalalu 2023
Image Credit source: TV9 Telugu
తెలుగువారి కొత్స సంవత్సరాదినే ఉగాది అని అంటారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం బుధవారం (మార్చి 22) నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్ 23 నుంచి గురుగ్రహం మేషరాశిలో సంచారం ప్రారంభిస్తుంది. అదేవిధంగా, అక్టోబర్ 24న మీనరాశిలో రాహు సంచారం కన్యారాశిలో కేతువు సంచారం ప్రారంభం అవుతుంది. శని గ్రహం ఈ ఏడాదంతా కుంభ రాశిలో కొనసాగుతుంది. మిగిలిన గ్రహాలు సుమారుగా నెలరోజులు చొప్పున వివిధ రాశుల్లో సంచరించడం జరుగుతుంది. గ్రహాల సంచారం ఆధారంగా శ్రీ శోభకృత్ నామ సంవత్సర కాలంలో సింహ రాశి వారికి జ్యోతిష్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నది ఇక్కడ పరిశీలిద్దాం.
సింహ రాశి (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆదాయం 14, వ్యయం 2 | రాజపూజ్యం 1, అవమానం 7
ఈ రాశి వారికి సప్తమ స్థానంలో శనీశ్వరుడు, నవమ స్థానంలో గురు రాహువులు, మూడవ స్థానంలో కేతువు సంచరిస్తున్నందువల్ల ఈ ఏడాది వీరికి మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. భాగ్యరాశిలో గురు రాహువుల సంచారం వల్ల వీరికి కొన్ని అనుకోని అదృష్టాలు పట్టడం జరుగుతుంది. ఉద్యోగంలో సంపాదన, వృత్తిలో ఆదాయం, వ్యాపారంలో లాభాలు ఆశించిన స్థాయిలో పెరగవచ్చు. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు తిరిగి చేతికి వస్తుంది. మొండి బాకీలు వసూలు కావచ్చు. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనాలు కలుగుతాయి. ఇవన్నీ మే నెల మొదటి వారం నుంచి ఈ ఏడాది చివరి వరకు కొనసాగటం జరుగుతుంది.
స్నేహితులు లేదా బంధువులకు ఆర్థికపరంగా ప్రస్తుతానికి వాగ్దానాలు చేయడం లేదా హామీలు ఉండటం శ్రేయస్కరం కాదు. ఆర్థిక వ్యవహారాలు చిక్కుల్లో పడేసే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సత్కారాలు అందుకునే అవకాశం కూడా ఉంది. తోబుట్టువులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఆచితూచి మాట్లాడటం మంచిది. మీ ఆస్తి విలువ పెరుగుతుంది. ఇల్లు గానీ, స్థలంగానీ కొనే ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో శుభకార్యం జరగటానికి అవకాశం ఉంది. విహారయాత్ర చేసే సూచనలు ఉన్నాయి.
రాజకీయంగా అనుకూలం
రాజకీయ నాయకులకు ప్రాభవం పెరుగుతుంది. వారికి అధికార యోగం పట్టే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాలలో ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. పిల్లలు కొద్ది శ్రమతో మంచి ఫలితాలను పొందవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకటి రెండు కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. అయితే, ఇంటా బయటా బాగా ఒత్తిడి శ్రమ ఉంటాయి.
శివారాధన తప్పదు
మఖ నక్షత్రం వారి కంటే పుబ్బ నక్షత్రం వారికి పై శుభ ఫలితాలు మరింత ఎక్కువగా అనుభవానికి వస్తాయి. ఈ రాశి వారు ఎక్కువగా శివుడిని ఆరాధించటం వల్ల మరిన్ని శుభ ఫలితాలను పొందటానికి అవకాశం ఉంటుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వాహన ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి.
(Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..)
మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..