Lord Shani Dev: శని రాశి మారినా ఫలితం లేదా? ఈ పరిహారాలు చేస్తే ఇక మీకు తిరుగుండదు..!

Saturn Transit 2025: మార్చి 29న శని గ్రహం కుంభం నుండి మీన రాశికి మారడంతో కొన్ని రాశుల వారికి శని దోషం నుండి విముక్తి పొందే అవకాశం ఉంది. ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం మెరుగుపడతాయి. శని మారినా మీ పరిస్థితిలో మార్పు రాకపోతే.. మునుపటి సమస్యలు కొనసాగితే శని పరిహారాలు చేయడం మంచిది. ఏ రాశి వారు ఏ పరిహారాలు చేయాలో ఇక్కడ వివరించడం జరిగింది.

Lord Shani Dev: శని రాశి మారినా ఫలితం లేదా? ఈ పరిహారాలు చేస్తే ఇక మీకు తిరుగుండదు..!
Lord Shani Dev

Edited By: Janardhan Veluru

Updated on: Apr 05, 2025 | 11:56 AM

Shani Gochar 2025: మార్చి 29న శనీశ్వరుడు కుంభ రాశి నుంచి మీన రాశిలోకి మారడం జరిగింది. ఈ మార్పు వల్ల వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశుల వారు శని దోషం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అనేక సమస్యల నుంచి, ఒత్తిళ్ల నుంచి విముక్తి లభించడం, ఆదాయం వృద్ధి చెందడం, వృత్తి, ఉద్యోగాల్లో స్తబ్ధత తొలగిపోయి, పురోగతి చెందడం వంటివి చోటు చేసుకోవడం జరుగుతుంది. అటువంటిదేమీ జరగకుండా కష్టనష్టాలు కొనసాగుతున్న పక్షంలో శనీశ్వరుడు శాంతించలేదని, సంతృప్తి చెందలేదని భావించాల్సి ఉంటుంది. ఈ రాశులవారు శనికి కొద్దిపాటి పరిహారాలు చేయడం వల్ల ఆశించిన ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. ప్రయత్నించి చూడండి.

  1. వృషభం: ఈ రాశికి రెండున్నరేళ్లుగా దశమ స్థానంలో ఉన్న శనీశ్వరుడి వల్ల ఈ రాశివారు ఉద్యోగంలో పనిభారం, తీవ్రమైన మానసిక ఒత్తిడి, పదోన్నతులు ఆగిపోవడం, వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగడం వంటి ఫలితాలను అనుభవించి ఉంటారు. శని లాభ స్థానంలోకి మారడం వల్ల వీరికి ఈ సమస్యలన్నీ తొలగిపోవడం, ఆదాయం పెరగడం, పదోన్నతులు కలగడం వంటివి జరగాల్సి ఉంది. వీరు రోజూ ఉదయమే శనిని ప్రార్థించడం, శివ స్తోత్రం పఠించడం వల్ల పురోగతి మొదలవుతుంది.
  2. కర్కాటకం: ఈ రాశివారికి మార్చి 29తో అష్టమ శని తొలగిపోయింది. భాగ్య స్థానంలో ప్రవేశించిన శనీశ్వరుడి వల్ల అనేక రకాలైన కష్టనష్టాల నుంచి బయటపడాల్సి ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడడం, విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల నెరవేరడం, విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోవడం, ఉద్యోగంలో పదోన్నతులు లభించడం వంటివి జరగాల్సి ఉంది. ఈ రాశివారి జీవితం మారాలన్న పక్షంలో శనీశ్వరుడికి దీపం వెలిగించడం, నల్ల రంగు కలిసిన దుస్తులు ధరించడం మంచిది.
  3. తుల: ఈ రాశికి శనీశ్వరుడు పంచమ స్థానం నుంచి ఆరవ స్థానంలోకి మారడం వల్ల ఆర్థిక, వ్యక్తిగత, అనారోగ్య సమస్యల నుంచి విముక్తి చెందడం ప్రారంభం కావాల్సి ఉంటుంది. ఆదాయం బాగా వృద్ధి చెందడం, ఉద్యోగంలో ప్రాధాన్యం పెరగడం, మరింత మంచి ఉద్యోగంలోకి మారడం, సంతాన యోగానికి సంబంధించిన శుభవార్త వినడం వంటివి కూడా జరగాల్సి ఉంది. అవేవీ జరగని పక్షంలో ఈ రాశివారు శివార్చన చేయించడం, నల్ల రంగు కలిసిన దుస్తులు ధరించడం మంచిది.
  4. వృశ్చికం: ఈ రాశికి గత మార్చి 29 న శని మీన రాశిలోకి మారడం వల్ల అర్ధాష్టమ శని తొలగిపోయింది. దీని వల్ల వీరికి అనేక విధాలైన సమస్యలు, వివాదాల నుంచి విముక్తి లభించాల్సి ఉంటుంది. ఆర్థిక సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వృత్తి, వ్యాపారాల్లో నష్టాల నుంచి బయటపడడం వంటివి కూడా జరగాల్సి ఉంది. వీటికి సంబంధించిన సూచనలు కనిపించని పక్షంలో ఈ రాశివారు తరచూ శివార్చన చేయించడంతో పాటు శనీశ్వరుడికి తిలాదానం చేయించడం చాలా మంచిది.
  5. మకరం: ఈ రాశివారికి గత నెల(మార్చి) 29 నుంచి ఏలిన్నాటి శని నుంచి విముక్తి లభించింది. ఆదాయం పెరగడం, శుభవార్తలు ఎక్కువగా వినడం, ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గి హోదాలు పెరగడం, వృత్తి, వ్యాపా రాలు నష్టాల నుంచి బయటపడడం వంటివి ప్రారంభం కావాల్సి ఉంది. ఏలిన్నాటి శని సంబంధమైన కష్టనష్టాల నుంచి వీరు విముక్తి పొందడం జరగని పక్షంలో కొద్ది రోజుల పాటు రోజూ ఉదయమే శివ స్తోత్రం పఠించడం మంచిది. శనివారం రోజున శనీశ్వరుడికి దీపం వెలిగించడం అవసరం.