జ్యోతిషశాస్త్రంలో ఆదాయానికి ఎంత ప్రాముఖ్యం ఉందో వ్యయానికి కూడా అంత ప్రాముఖ్యం ఉంది. ఏ రాశివారు దేని మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు? ఆదాయ, వ్యయాలలో ఏది ఎక్కువగా ఉంటుంది? ఇటువంటి అంశాలన్నిటికీ సమాధానం జాతక చక్రంలో 12 వ స్థానం మీద ఆధారపడి ఉంటుంది. 12వ స్థానాన్ని బట్టి, 12 వ స్థానాధిపతిని బట్టి, 12లో ఉన్న గ్రహాన్ని బట్టి జాతకుడి వ్యయ యోగం గురించి చెప్పాల్సి ఉంటుంది. ఇటువంటి ఫలితాలు వ్యక్తిగత జాతక చక్రం మీదే కాకుండా గ్రహ సంచారం మీద కూడా ఆధారపడి ఉంటాయి. ఏయే రాశుల వారు దేని మీద ఖర్చు చేసేదీ, ఈ ఏడాది వారి ఖర్చు ఏవిధంగా ఉండేదీ ఇక్కడ పరిశీలిద్దాం.
మేషం: ఈ రాశివారికి వ్యయ స్థానం మీనం. ఈ రాశికి అధిపతి గురువు. మేష రాశి జాతకులు తమ జీతభత్యాలు లేదా లాభాలలో ఎక్కువ భాగాన్ని సత్కార్యాలకే వినియోగించడం జరుగుతూ ఉంటుంది. దైవ కార్యాలు, శుభ కార్యాలు, దానధర్మాలు, సహాయ కార్యక్రమాల మీద ఎక్కువగా ఖర్చు చేసే అలవాటుంటుంది. ఈ రాశివారికి ప్రస్తుతం వ్యయాధిపతి మేషంలోనే ఉన్నందువల్ల కష్టార్జితంలో ఎక్కువ భాగాన్ని ఇతరులకు సహాయం చేయడానికే వినియోగించే అవకాశం ఉంది.
వృషభం: ఈ రాశివారికి వ్యయ స్థానం మేషం. ఈ రాశికి అధిపతి కుజుడు. సాధారణంగా బాగా తక్కువగా ఖర్చు చేసే ఈ వృషభ రాశివారు సామాజిక హోదా కోసం, గౌరవ మర్యాదల కోసం తరచూ ఖర్చు చేస్తుంటారు. జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల మీద కూడా ఖర్చు చేయడం జరుగు తుంటుంది. ప్రస్తుతం వ్యయ స్థానంలో గురు, రాహువులు ఉన్నందువల్ల ఎక్కువగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ వృథా ఖర్చులు పెరుగుతాయి.
మిథునం: ఈ రాశివారికి వ్యయ స్థానం వృషభం. శుక్రుడు ఈ రాశికి అధిపతి. మిథున రాశివారు ఎక్కువగా విలాసాలు, వ్యసనాలు, ఆడంబరాలు, అలంకరణల మీద ఖర్చు చేయడం జరుగుతుంటుంది. అతి చిన్న పనికి కూడా భారీగా వ్యయం అవుతూ ఉంటుంది. సతీమణి కోసం కూడా ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రాశికి వ్యయ స్థానాధిపతి ధన స్థానంలో ఉన్నందువల్ల కష్టా ర్జితం ఎక్కువగా వృథా అయ్యే సూచనలున్నాయి. కుటుంబం మీద ఖర్చు బాగా పెరుగుతుంది.
కర్కాటకం: ఈ రాశివారికి మిథునం వ్యయ స్థానం. ఈ రాశి అధిపతి బుధుడు. సాధారణంగా తల్లి, భార్య, సోదరీమణుల మీద ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. విజ్ఞాన సేకరణ మీద కూడా ఖర్చు అవుతుంటుంది. కష్టార్జితంలో ఎక్కువ భాగాన్ని బంధుమిత్రుల మీద ఖర్చు చేసే అలవాటు కూడా ఉంటుంది. సాధారణంగా వీరిలో డబ్బు దాచుకోవాలనే యావ తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఈ బుధుడు ధన స్థానంలో ఉన్నందువల్ల కుటుంబం మీద ఎక్కువగా వ్యయం అవుతుంది.
సింహం: ఈ రాశివారికి కర్కాటకం వ్యయ స్థానం. ఈ రాశికి అధిపతి చంద్రుడు. ఈ రాశివారికి ఎక్కువగా ఖర్చు చేసే అలవాటు లేనప్పటికీ, ఎప్పుడు దేనికి ఖర్చు చేస్తారనే విషయం అంతుబట్టకుండా ఉంటుంది. అవసర విషయాల్లో జాగ్రత్తలు పడి, అనవసర విషయాల్లో భారీగా ఖర్చు చేయడం జరుగుతుంటుంది. ప్రస్తుతం ఈ రాశివారికి వ్యయంలో శుక్రుడు సంచరిస్తున్నందువల్ల రహస్య పరిచయాల మీద, విలాసాలు, వ్యసనాల మీద బాగా ఖర్చయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
కన్య: ఈ రాశివారికి సింహం వ్యయ స్థానం. ఈ రాశికి అధిపతి రవి. సాధారణంగా సామాజిక హోదా కోసం డబ్బు ఖర్చు చేస్తుంటారు. ఆహారం, దుస్తులు, ఆభరణాల మీద కూడా ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. ప్రస్తుతం ఈ వ్యయాధిపతి రవి కన్యా రాశిలోనే ఉండడం వల్ల ఖర్చుల మీద అదుపుండదు. అనవసర ఖర్చులు, ఆడంబర ఖర్చులు తప్పకపోవచ్చు. పైగా కన్యారాశి అధిపతి అయిన బుధుడు వ్యయంలోనే ఉన్నందువల్ల ఖర్చులకు కళ్లెం వేయడం కూడా కష్టమవుతుంది.
తుల: ఈ రాశికి వ్యయ స్థానం కన్య. ఈ రాశికి అధిపతి బుధుడు. సాధారణంగా తులా రాశి వారికి ఖర్చులు ఆదాయంతో పోటీపడుతుంటాయి. సుఖ సంతోషాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తుం టారు. విలాసాలు, వినోదాలు, వ్యసనాలు, ఆడంబరాల మీద ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది. ఖర్చు విషయంలో ఆ తరువాతి స్థానం కుటుంబ సభ్యులదే అవుతుంది. ఈ రాశికి వ్యయాధిపతి అయిన బుధుడు ప్రస్తుతం లాభ స్థానంలో ఉన్నందువల్ల కొద్దిగా ఖర్చులు తగ్గించుకునే అవకాశం ఉంది.
వృశ్చికం: ఈ రాశివారికి వ్యయ స్థానం తులా రాశి. ఈ రాశికి శుక్రుడు అధిపతి. సాధారణంగా వృశ్చిక రాశివారు మూడో కంటికి తెలియకుండా డబ్బు దాస్తుంటారు కానీ, మధ్య మధ్య విలాసాలు, వ్యసనాల మీదకు దృష్టి మళ్లుతుంటుంది. స్నేహితుల మీదా, పరిచయాలను పెంచుకోవడం మీదా తరచూ ఖర్చు చేస్తుంటారు. ప్రస్తుతం ఈ శుక్రుడు భాగ్య స్థానంలో సంచరిస్తున్నందువల్ల వీరి ఖర్చు ఒక విధమైన పెట్టుబడిగా మారి, వీరికి మున్ముందు లాభం చేకూర్చే అవకాశం ఉంది.
ధనుస్సు: ఈ రాశికి వ్యయ స్థానం వృశ్చికం. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ రాశివారు సాధారణంగా స్నేహితులు, పరిచయస్థులు, బంధువులు, సన్నిహితుల మీద ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. సామాజిక హోదా కోసం పాకులాడుతుంటారు. శుభకార్యాల మీదా, దైవ కార్యాల మీద కూడా ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం కుజుడు దశమంలో ఉన్నందువల్ల ఆడంబరాలకు ఎక్కు వగా ఖర్చు చేయడం జరుగుతుంది. విలువైన వస్త్రాభరణాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు.
మకరం: ఈ రాశికి వ్యయ స్థానం ధనుస్సు కాగా, వ్యయాధిపతి గురువు. సాధారణంగా ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరించే మకర రాశివారు విచిత్రంగా మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేస్తుంటారు. సన్నిహితుల వల్ల ఎక్కువగా నష్టపోతుంటారు. కష్టార్జితంలో కొద్ది భాగం వృథా అయిపోవడమో, నష్టపోవడమో జరుగుతుంటుంది. ప్రస్తుతం ఈ గురువు 4వ స్థానంలో ఉన్నందువల్ల కుటుంబం మీదా, సౌకర్యాల మీదా ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది.
కుంభం: ఈ రాశికి వ్యయ స్థానం మకరం. ఈ రాశికి శనీశ్వరుడు అధిపతి. సాధారణంగా ఈ రాశివారికి ఖర్చు మీద అదుపు ఉంటుంది. డబ్బు విషయంలో వీరు జాగ్రత్తపరులు. కుటుంబానికి తప్ప సొంతానికి ఖర్చు చేయడం తక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా దైవ కార్యాలకు, సహాయ కార్యక్రమా లకు మాత్రమే ఖర్చు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ రాశికి వ్యయస్థానంలో వ్యయాధిపతే ఉన్నందువల్ల ధన వ్యయం విషయంలో అతి జాగ్రత్తగా వ్యవహరించడం జరుగుతుంది.
మీనం: ఈ రాశికి వ్యయ స్థానం కుంభం. ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు. సాధారణంగా మీన రాశివారు శుభ కార్యాలు, దైవకార్యాలు, ఇతర సత్కార్యాల మీద తప్ప, అవసరముంటే తప్ప ఖర్చు చేసే అవకాశం ఉండదు. అనవసర ఖర్చులు, వృథా ఖర్చుల జోలికి పోయే అవకాశం ఉండదు. డబ్బు కూడబెట్టడానికే ప్రాధాన్యం ఇస్తారు. ప్రస్తుతం ఈ గురువు ధన స్థానంలో ఉన్నందువల్ల ఖర్చు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉంది. కుటుంబం మీదే ఖర్చులు కొద్దిగా పెరుగుతాయి.