Money Astrology
ఈ ఏడాది చివరి లోపు ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కే అవకాశం ఉందా అని చాలామంది మధనపడుతుంటారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడడమనేది చాలా మందికి అతి ప్రధాన విషయం. సాధారణంగా ద్వితీయ స్థానాన్ని బట్టి ఆదాయాన్ని, ఆరవ స్థానాన్ని బట్టి ఆర్థిక (రుణ) సమస్యల్ని చెప్పాల్సి ఉంటుంది. ఈ రెండు స్థానాల బలాబలాల మీద ఆదాయాలు, ఆర్థిక సమస్యలు ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం ఉన్న గ్రహ సంచారాన్ని బట్టి ఈ ఏడాది లోగా మేషం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి బయట పడడానికి అవకాశం ఉంది. ఏ రాశుల వారైనప్పటికీ రుణ సమస్యల నుంచి బయటపడడానికి కాలభైరవాష్టకాన్ని రోజూ చదువుకోవడం మంచిది.
- మేషం: ఈ రాశికి ధన, షష్ట స్థానాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. ధన స్థానంలో ధన కారకుడు గురువు కుజుడితో యుతి చెందినందువల్ల ఆదాయం ఎక్కువగా ఉండి, రుణాలు, వ్యయాలు బాగా తక్కువగా ఉండే అవకాశం ఉంది. కొత్తగా ఆర్థిక సమస్యలేవీ తలెత్తకపోవచ్చు. ఆదాయం దిన దినాభివృద్ధి చెందే అవకాశం ఉన్నందువల్ల ఆర్థిక సమస్యల నుంచి, ఆర్థిక అవసరాల నుంచి క్రమంగా బయటపడే అవకాశం ఉంటుంది. గృహ, వాహన రుణాలు పెద్దగా ఇబ్బంది కలిగించకపోవచ్చు.
- కర్కాటకం: ఈ రాశికి ధన స్థానంలో ప్రస్తుతం బుధ, శుక్రులు ఉండడం, ధనాధిపతి రవి కలవబోతుండడం, ఆరవ స్థానాధిపతి గురువు భాగ్య స్థానంలో ఉన్నందువల్ల అతి కొద్ది కాలంలో ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభానికి, అప్రయత్న ధన లాభానికి కూడా బాగా అవకాశం ఉన్నందువల్ల, ఒక ప్రణాళిక ప్రకారం ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. కొద్ది కాలంపాటు రుణాలు చేసే అవసరమే ఉండకపోవచ్చు.
- తుల: ఈ రాశివారికి ధన స్థానాధిపతి కుజుడు, షష్ట స్థానాధిపతి గురువు బాగా అనుకూలంగా ఉన్నం దువల్ల ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఫలితంగా ఆర్థిక సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. ఒకటి రెండు నెలల్లో ఈ రాశివారు గృహ రుణాల నుంచి తప్ప మిగిలిన అన్ని రకాల రుణాల నుంచి పూర్తిగా బయట పడడం జరుగుతుంది. ఈ రాశివారు ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం జరుగుతుంది.
- వృశ్చికం: ఈ రాశికి ధన స్థానాధిపతి అయిన గురువు రాశ్యధిపతి కుజుడితో సప్తమ స్థానంలో కలిసి ఉన్నందువల్ల ఈ రాశివారికి ఈ ఏడాదంతా ఆదాయానికి లోటుండదు. అనేక వైపుల నుంచి ధనాదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది. పైగా రాశ్యధిపతి కుజుడే షష్ట స్థానాధిపతి అయి నందువల్ల దీర్ఘకాలిక రుణాల నుంచి కూడా బయటపడడం జరుగుతుంది. ఎంత కష్టానికైనా సిద్ధపడే ఈ రాశివారికి అనేక ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. వీరు క్రమంగా రుణ విముక్తులవుతారు.
- మకరం: ఈ రాశికి ధన స్థానంలో ధన స్థానాధిపతి శనీశ్వరుడే సంచారం చేస్తున్నందువల్ల ఆదాయం నిలకడగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆదాయ మార్గాలు విస్తరించే అవకాశం ఉంది. ఫలితంగా రుణ సమస్యలు, ఆర్థిక ఒత్తిళ్ల నుంచి క్రమంగా బయటపడడం జరుగుతుంది. ఆర్థిక క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే ఈ రాశివారు రుణాలు చేసే అవకాశం ఉండదు. ఈ ఏడాదంతా ధనాధిపతి బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందడం జరుగుతుంది.
- మీనం: ఈ రాశికి ధన స్థానాధిపతి అయిన కుజుడు, షష్ట స్థానాధిపతి అయిన రవి మరో మూడు నెలల పాటు అనుకూలంగా సంచారం చేయడం జరుగుతోంది. దీనివల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరగడానికి అవ కాశం ఉన్నందువల్ల వీరు అతి త్వరలో రుణ సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. ఈ రాశివారు ఈ ఏడాది రుణాలనే కాకుండా ఖర్చుల్ని కూడా వీలైనంతగా తగ్గించుకునే అవకాశం ఉంది.