Mithuna Rasi Ugadi Horoscope 2023
Image Credit source: TV9 Telugu
తెలుగువారి కొత్స సంవత్సరాదినే ఉగాది అని అంటారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం బుధవారం (మార్చి 22) నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్ 23 నుంచి గురుగ్రహం మేషరాశిలో సంచారం ప్రారంభిస్తుంది. అదేవిధంగా, అక్టోబర్ 24న మీనరాశిలో రాహు సంచారం కన్యారాశిలో కేతువు సంచారం ప్రారంభం అవుతుంది. శని గ్రహం ఈ ఏడాదంతా కుంభ రాశిలో కొనసాగుతుంది. మిగిలిన గ్రహాలు సుమారుగా నెలరోజులు చొప్పున వివిధ రాశుల్లో సంచరించడం జరుగుతుంది. గ్రహాల సంచారం ఆధారంగా శ్రీ శోభకృత్ నామ సంవత్సర కాలంలో మిథున రాశి వారికి జ్యోతిష్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నది ఇక్కడ పరిశీలిద్దాం.
మిథున రాశి (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆదాయం 2, వ్యయం 11 | రాజపూజ్యం 2, అవమానం 4
ఈ ఏడాది భాగ్య స్థానంలో శనీశ్వరుడు, లాభ స్థానంలో గురువు, లాభ స్థానంలో రాహువు, పంచమ స్థానంలో కేతువు సంచరిస్తున్నందువల్ల, ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయని చెప్పవచ్చు. ఊహించని విధంగా కొన్ని శుభ పరిణామాలు చోటుచేసుకుని జీవితం కొత్త మలుపులు తిరుగుతుంది. మంచి ఉద్యోగం లభించడం లేదా మంచి ఉద్యోగంలోకి వెళ్లడం, తద్వారా జీవితంలో ఆర్థికంగా స్థిర పడటం వంటివి జరుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి.
కాస్తంత ఎక్కువగానే దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. టెక్నాలజీ నిపుణులు బాగా రాణించడానికి, సరైన గుర్తింపు పొందటానికి అవకాశం ఉంది. క్రీడాకారులు, కళాకారులు ఊహించనంతగా పురోగతి సాధిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆస్తి వివాదం ఒకటి బంధువుల జోక్యంతో సానుకూలంగా పరిష్కారం అవుతుంది. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. తనకు మాలిన ధర్మం పనికిరాదనే విషయాన్ని గుర్తించండి. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో విజయాలు సాధిస్తారు.
త్వరలో శుభ ఫలితాలు
నిరుద్యోగులకు దూరప్రాంతంలో మంచి కంపెనీలో ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. ఈ ఏడాది జూలై నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు వీరి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఆరోగ్యం మీద ఒక కన్ను వేసి ఉండటం మంచిది. వ్యాపారులు, వివిధ వృత్తుల వారు, ఐటీ నిపుణులు ఆర్థికంగా ఆశించిన ప్రయోజనాలను పొందడం జరుగుతుంది.
దుర్గా దేవిని పూజించండి
పునర్వసు నక్షత్రం వారు అత్యధికంగా ప్రయోజనాలు పొందడం జరుగుతుంది. వీరికి ఈ ఏడాది గృహ, వాహన లాభాలు కలిగే అవకాశం ఉంది. అయితే మిత్రుల వల్ల మోసపోవటం కానీ నష్టపోవటం గాని జరిగే ప్రమాదం ఉంది. ఈ రాశి వారు ఎక్కువగా దుర్గాదేవిని ఆరాధించడం వల్ల ఆశించిన సత్ఫలితాలను త్వరగా పొందటానికి అవకాశం ఉంటుంది.
(Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..)
మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..