Telugu News Astrology Mars Venus Conjunction in Capricorn: Love and Marriage Yoga After Sankranti
శుక్ర, కుజు గ్రహాల యుతి.. సంక్రాంతి తర్వాత వారి ప్రేమలు, పెళ్లి ప్రయత్నాలు సఫలం
Marriage and Love Astrology: జనవరిలో మకర రాశిలో కుజ శుక్రుల కలయిక ప్రేమ, పెళ్లిళ్లకు మార్గం సుగమం చేస్తుంది. ఈ గ్రహాల యుతి సంక్రాంతి తర్వాత వివాహ ప్రయత్నాలకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీనం రాశుల వారికి ఇది ముఖ్యంగా శుభప్రదం, వీరు ప్రేమ సంబంధాలు, పెళ్లి చేసుకునే అవకాశాలను అధికంగా పొందుతారు.
ఈ నెల(జనవరి) 12న శుక్రుడు, 17న కుజుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నందువల్ల ప్రేమలు, పెళ్లిళ్లకు అవకాశాలు బాగా పెరుగుతాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం కుజుడు పురుష గ్రహం కాగా, శుక్రుడు స్త్రీ గ్రహం. ఈ రెండు గ్రహాలు ఏదైనా రాశిలో యుతి చెందే పక్షంలో ప్రేమలు, పెళ్లిళ్లు ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు గ్రహాలు కలుస్తున్న ఫలితంగా సంక్రాంతి తర్వాత నుంచి ప్రేమలు, పెళ్లి ప్రయత్నాల జోరు పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా విజయం సాధిస్తాయి. ఈ రెండు గ్రహాల కలయిక వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశులవారికి బాగా అనుకూల ఫలితాలనిస్తుంది.
వృషభం: రాశ్యధిపతి శుక్రుడు ఈ రాశికి సప్తమాధిపతి అయిన కుజుడితో భాగ్య స్థానంలో కలవడం వల్ల ఈ రాశివారు తప్పకుండా పెళ్లి సంబంధమైన శుభవార్త వినే అవకాశం ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తి జీవిత భాగస్వామి అవడం జరుగుతుంది. ప్రేమ భాగస్వామి విషయంలో కూడా ఈ రాశివారికి ఊహించని అదృష్టం పడుతుంది. ఫిబ్రవరి, మే నెలల మధ్య వీరికి సంప్రదాయబద్ధంగా పెళ్లయ్యే అవకాశం ఉంది.
కర్కాటకం: ఈ రాశికి సప్తమ స్థానంలో కుజ, శుక్రుల కలయిక వల్ల ఈ రాశివారికి సంక్రాంతి తర్వాత తప్ప కుండా పెళ్లి యోగం కలుగుతుంది. ఉన్నతస్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి కావడం వంటివి జరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి సహోద్యోగి కానీ, బాగా పరిచయస్థుడు గానీ కావడం జరుగుతుంది. సంక్రాంతి తర్వాత చేసే పెళ్లి ప్రయత్నాలు ఆశించిన సానుకూల ఫలితాలనిస్తాయి. మే లోపు వీరికి పెళ్లయ్యే అవకాశం ఉంది. ప్రేమ ప్రయత్నాలు ఫలిస్తాయి.
కన్య: ఈ రాశికి పంచమ స్థానంలో కుజుడు ఉచ్ఛపట్టడం, దానితో శుక్రుడు కలవడం వల్ల ఈ రాశివారికి అతి త్వరలో వివాహం జరిగే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో వీరికి విదేశీ సంబంధం నిశ్చయం అవడం జరుగుతుంది. రాశ్యధిపతి బుధుడు కూడా ఈ రెండు గ్రహాలతో కలవడం వల్ల ప్రేమ జీవితం కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కావడం లేదా ప్రేమలో పడడం జరుగుతుంది. ఫిబ్రవరి తర్వాత పెళ్లి జరిగే అవకాశం ఉంది.
వృశ్చికం: ఈ రాశికి తృతీయ స్థానంలో రాశ్యధిపతి కుజుడు ఉచ్ఛపట్టడం, సప్తమాధిపతి అయిన శుక్రుడితో యుతి చెందడం వంటి కారణాల వల్ల ఈ రాశివారికి అతి త్వరలో ప్రేమ జీవితం పెళ్లికి దారితీసే అవకాశం ఎక్కువగా ఉంది. సంక్రాంతి తర్వాత కొద్ది ప్రయత్నంతో వీరి వివాహం తప్పకుండా నిశ్చయం అవుతుంది. సహచరులు లేదా పరిచయస్థులతో పెళ్లి కుదరడానికి అవకాశం ఉంది. మే నెల చివరి వారం లోపు వీరికి సంప్రదాయబద్దంగా, వైభవంగా పెళ్లి జరిగే సూచనలున్నాయి.
మకరం: ఈ రాశిలో ఉచ్ఛ కుజుడితో శుక్రుడు కలుస్తున్నందువల్ల ఈ రాశివారికి ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లయ్యే అవకాశం ఉంది. సాధారణంగా ప్రేమ వివాహం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అతి తక్కువ ప్రయత్నంతో బాగా పరిచయస్థుల్లో పెళ్లి సంబంధం కుదిరే సూచనలు కూడా ఉన్నాయి. సంక్రాంతి తర్వాత ఈ రాశివారికి ప్రేమ జీవితం మొదలయ్యే అవకాశాలు న్నాయి. ప్రేమ జీవితం సఫలమై, జూన్ నెల మొదటి వారంలో పెళ్లి జరగడానికి అవకాశం ఉంది.
మీనం: ఈ రాశికి లాభ స్థానంలో కుటుంబ స్థానాధిపతి కుజుడ ఉచ్ఛపట్టడం, దాంతో కళత్ర కారకుడు శుక్రుడు యుతి చెందడం వల్ల ఈ రాశివారు సంక్రాంతి తర్వాత ప్రేమలో పడడం గానీ, పెళ్లి చేసుకోవడం గానీ తప్పకుండా జరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. జూన్ నెల లోపు ఈ రాశివారికి తప్పకుండా వైభవంగా, ఆడంబరంగా వివాహం జరిగే అవకాశం ఉంది. ప్రేమ జీవితం కూడా అనుకున్న విధంగా పెళ్లికి దారితీస్తుంది.