Lucky Zodiac Signs: కుజుడితో 100 రోజుల పండుగ.. ఆ రాశుల వారికి అనూహ్య అదృష్టాలు

Mars Transit 2025: ప్రస్తుతం కుజుడు తన మిత్రక్షేత్రమైన కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. జూన్ 6 నుండి జులై 28 వరకు తనకు మరో మిత్రక్షేత్రమైన సింహ రాశిలో సంచరిస్తాడు. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు కలిగిస్తాడు.. అలాగే ఉద్యోగ అవకాశాలు, ఆస్తి లాభాలు, సంతాన ప్రాప్తి వంటి అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. కుజుడి ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి ఆస్తి వివాదాల పరిష్కారం, విదేశ ప్రయాణాలు కూడా కలిగే అవకాశం ఉంది.

Lucky Zodiac Signs: కుజుడితో 100 రోజుల పండుగ.. ఆ రాశుల వారికి అనూహ్య అదృష్టాలు
Lucky Zodiac Signs

Edited By: Janardhan Veluru

Updated on: Apr 18, 2025 | 12:42 PM

ప్రస్తుతం తన మిత్ర క్షేత్రమైన కర్కాటక రాశిలో సంచారం చేస్తున్న కుజుడు జూన్ 6న తనకు మరో మిత్రక్షేత్రమైన సింహ రాశిలోకి మారి, అక్కడ జూలై 28 వరకూ కొనసాగుతాడు. ధైర్యం, సాహసం, తెగువ, చొరవ, పోరాటం వంటి లక్షణాలు కలిగిన కుజ గ్రహం భూమికి, బ్యాంక్ బ్యాలెన్స్ కి, ఆస్తిపాస్తులకు, ముఖ్యంగా స్థిరాస్తులకు కారకుడు. జాతకంలో కుజుడు అనుకూలంగా లేనిదే పురోగతి ఉండదు. సుమారు వంద రోజుల పాటు తన మిత్ర క్షేత్రాలైన కర్కాటక, సింహ రాశుల్లో కొనసాగుతున్న కుజ గ్రహం వల్ల మేషం, వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, మీన రాశులకు ఊహించని అదృష్టాలు కలగబోతున్నాయి.

  1. మేషం: ఈ రాశివారు ఏలిన్నాటి శనితో ఇబ్బందులేమీ పడకుండా రాశ్యధిపతి కుజుడు కాపాడడం జరుగుతుంది. ఈ వంద రోజుల కాలంలో ఈ రాశివారికి తప్పకుండా అధికార యోగం పడుతుంది. ఒక సంస్థకు అధిపతి అయ్యే అవకాశం కూడా ఉంది. జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెంది సంపన్నులు కావడం జరుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై, భూలాభం, ఆస్తి లాభం కలిగే అవకాశం ఉంది. సంతాన ప్రాప్తి సూచనలున్నాయి.
  2. వృషభం: ఈ రాశికి ఈ కుజుడి సంచారం అనేక విధాలుగా అదృష్టాలను కలుగజేయబోతోంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం నిశ్చయం కావడం జరుగుతుంది. ప్రేమ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. తల్లితండ్రుల నుంచి ఆస్తి లాభం కలుగుతుంది. సొంత ఇల్లు అమరే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలున్నాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి.
  3. కర్కాటకం: ఈ రాశికి అత్యంత శుభుడైన కుజుడు ఈ రాశిలోనూ, ధన స్థానంలోనూ సంచారం చేయడం వల్ల ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమై, భూలాభాలు, ఆస్తి లాభాలు కలిగే అవకాశం ఉంది. ఈ రాశివారికి విదేశీ సంపాదన అనుభవించే యోగం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల కారణంగా విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగాల్లో జీతభత్యాలు, అదనపు రాబడి బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది.
  4. తుల: ఈ రాశికి అత్యంత యోగదాయక స్థానాలైన దశమ, లాభ స్థానాల్లో కుజ సంచారం వల్ల ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ నూరు శాతం ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతులతో పాటు జీతభత్యాలు కూడా గణనీయంగా పెరుగుతాయి. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.
  5. వృశ్చికం: రాశ్యధిపతి కుజుడు భాగ్య, దశమ స్థానాల్లో సంచారం చేయడం వల్ల ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ, తద్వారా రాబడి బాగా వృద్ధి చెందుతాయి. ఆస్తి లాభం కలుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. సొంత ఇంటి ప్రయత్నాలు ఫలిస్తాయి.
  6. మీనం: ఈ రాశికి కుజ సంచారం విపరీత రాజయోగాలను కలిగించే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తల పెట్టినా విజయవంతం అవుతుంది. అనుకున్న పనులన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు అత్యధికంగా లాభాలనిస్తాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.