Astrology: కుజ స్తంభన.. కొత్త ప్రయత్నాల్లో ఆ రాశులవారు కాస్త జాగ్రత్త..!

ఈ నెల(ఫిబ్రవరి) 25 నుంచి మార్చి ఆఖరు వరకూ మిథున రాశిలో కుజుడు స్తంభించిపోవడం జరుగుతోంది. ప్రస్తుతం తాను సంచారం చేస్తున్న నక్షత్రంలోనే ఏమాత్రం మార్పు లేకుండా కొనసాగడం వల్ల కుజుడికి ఈ స్తంభన యోగం ఏర్పడుతోంది. కుజుడు స్తంభించిన కాలంలో కొత్తగా ఏ ప్రయత్నమూ, ఏ కార్యక్రమమూ తలపెట్టకపోవడం మంచిది.

Astrology: కుజ స్తంభన.. కొత్త ప్రయత్నాల్లో ఆ రాశులవారు కాస్త జాగ్రత్త..!
Kuja Stationary Impact

Edited By: Janardhan Veluru

Updated on: Feb 20, 2025 | 8:04 PM

2025 ఫిబ్రవరి 25 నుంచి మార్చి ఆఖరు వరకూ మిథున రాశిలో కుజుడు స్తంభించిపోవడం జరుగుతోంది. ప్రస్తుతం తాను సంచారం చేస్తున్న నక్షత్రంలోనే ఏమాత్రం మార్పు లేకుండా కొనసాగడం వల్ల కుజుడికి ఈ స్తంభన యోగం ఏర్పడుతోంది. కుజుడు స్తంభించిన కాలంలో కొత్తగా ఏ ప్రయత్నమూ, ఏ కార్యక్రమమూ తలపెట్టకపోవడం మంచిది. ఇదివరకే ప్రారంభించిన ప్రయత్నాలు, కార్యక్రమాలను కొనసాగించడం తప్ప కొత్త ప్రయత్నాల జోలికి వెళ్లకపోవడం శ్రేయస్కరం. ముఖ్యంగా మిథునం, కర్కాటకం, వృశ్చికం, ధనుస్సు, మీన రాశులవారు కొత్త ప్రయత్నాలు, కార్యక్రమాలతో పాటు ప్రయాణాలు కూడా పెట్టుకోకపోవడం మంచిది. వీలైనప్పుడల్లా సుబ్రహ్మ ణ్యాష్టకం చదువుకోవడం వల్ల జీవితం సాఫీగా సాగిపోవడానికి అవకాశం ఉంటుంది.

  1. మిథునం: ఈ రాశిలో సంచారం చేస్తున్న కుజుడి వల్ల ఓ నలభై రోజుల పాటు ఈ రాశివారు ప్రయాణాలు కూడా పెట్టుకోకపోవడం మంచిది. ఆస్తి, వివాదాలు, కోర్టు కేసుల జోలికిపోకపోవడం శ్రేయస్కరం. ఇతరుల వ్యవహారాల్లో, వివాదాల్లో తలదూర్చడం వల్ల భంగపడతారు. లేనిపోని తగాదాలు, వివాదాలకు కూడా అవకాశం ఉంది. డబ్బు తీసుకోవడం, ఇవ్వడం వంటి లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ఆహార, విహారాల్లో కూడా తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
  2. కర్కాటకం: ఈ రాశికి వ్యయ స్థానంలో కుజ సంచారం వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆస్తులు లేదా ఇంటి విషయంలో మోసపోయే అవకాశం ఉంది. వీటికి సంబంధించిన లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగంలో పొరపాట్లు జరిగే సూచనలున్నాయి. అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. సన్నిహితులకు కూడా ఆర్థిక బాధ్యతలు అప్పగించవద్దు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
  3. వృశ్చికం: ఈ రాశికి అధిపతి అయిన కుజుడు అష్టమ స్థానంలో స్తంభించిపోవడం వల్ల ఉద్యోగంలో పదోన్నతులు, జీతభత్యాల పెరుగుదల వంటివి వాయిదా పడతాయి. ఉద్యోగంలో పని భారం బాగా పెరుగుతుంది. విశ్రాంతి లభించని పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా తగ్గే సూచనలున్నాయి. రావలసిన సొమ్ము చేతికి అందక ఇబ్బంది పడతారు. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. బంధుమిత్రులతో అకారణ వైరాలు, వైషమ్యాలు ఏర్పడతాయి.
  4. ధనుస్సు: ఈ రాశికి సప్తమ స్థానంలో కుజుడు స్తంభించడం వల్ల ఆస్తి వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఆస్తుపాస్తులకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. వైవాహిక జీవితంలో మనస్పర్ధలు, మాట పట్టింపులకు అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు తీవ్రంగా నిరాశ కలిగిస్తాయి. ప్రయాణాల్లో ఊహించని ఇబ్బందులు పడతారు. ఏ ప్రయత్నమూ కలిసి రాదు. నిరుద్యోగులు దూర ప్రాంతంలో సాధారణ ఉద్యోగంలో చేరవలసి వస్తుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.
  5. మీనం: ఈ రాశికి చతుర్థ స్థానంలో కుజ స్తంభన వల్ల కుటుంబంలో టెన్షన్లు పెరుగుతాయి. కోపతాపాలు, వాదాపవాదాలకు కూడా అవకాశం ఉంది. సొంత ఇల్లు, వాహన ప్రయత్నాల్లో ఇబ్బందులు, ఆటంకాలు ఎదురవుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు బాగా ఇబ్బంది కలిగిస్తాయి. తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రతి పనిలోనూ ఖర్చులు, శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. అనవసర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. మనశ్శాంతి తగ్గుతుంది.