Marriage Astrology
పెళ్లిళ్లకు, ప్రేమలకు కారకుడైన శుక్రుడు ప్రస్తుతం కన్యా రాశిలో నీచబడి ఉన్నందువల్ల, పైగా కేతువు కలిసి ఉన్నందువల్ల పెళ్లిళ్లు అవుతాయా, పెళ్లి సంబంధాలు కుదురుతాయా అన్న సందేహం చాలామందికి కలుగుతోంది. అయితే, అన్ని రాశులకూ పెళ్లిళ్లు కాకపోవడం లేదా పెళ్లి సంబంధాలు కుదరకపోవడం అనేది లేదు. మొత్తం 12 రాశులలో 7 రాశుల వారికి పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఎక్కువగానే ఉంది. ఒక్క అయిదు రాశులకు మాత్రం కొద్దిగా సమస్య ఉంది. వృషభం, మిథునం, సింహం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశులకు పెళ్లిళ్ల సమయం ఈ నెల 29 వరకూ బాగా అనుకూలంగా ఉంది.
- మేషం: ఈ రాశివారికి ఆరవ స్థానంలో శుక్రుడు నీచబడడం అనేది పెళ్లి సంబంధాల విషయంలో ఏమాత్రం అనుకూలంగా ఉండకపోవచ్చు. పెళ్లి సంబంధాలు బాగా దగ్గర దాకా వచ్చి వెనక్కు వెళ్లిపోయే అవకాశం ఉంది. శుక్రుడితో కేతువు కూడా కలిసి ఉన్నందువల్ల పెళ్లి ప్రయత్నాలు చేసే విషయంలో కొద్దిగా మోసపోవడం, ఓర్పు నశించడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంది. పెళ్లి సంబంధాల కోసం ఎక్కువగా శ్రమపడాల్సి వస్తుంది. సాధారణంగా సానుకూల స్పందన లభించదు.
- వృషభం: ఈ రాశివారికి శుక్రుడు రాశ్యధిపతి అయినందువల్ల, సాధారణంగా కొద్ది ప్రయత్నంతో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. అప్రయత్నంగా కూడా పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది. సంపన్న కుటుంబంలో కానీ, ఉన్నత స్థాయి కుటుంబంలో కానీ పెళ్లి సంబంధం కుదరవచ్చు. కేతువు కారణంగా ఒకటి రెండు సంబంధాలు తప్పిపోయినప్పటికీ నిరాశ చెందవలసిన అవసరం లేదు. తెలిసినవారు, పరిచయస్థులు, బాగా దగ్గర బంధువులతో పెళ్లి సంబంధం ఖాయం కావచ్చు.
- మిథునం: ఈ రాశికి నాలుగవ స్థానంలో శుక్ర, కేతువులు కలిసి ఉండడం వల్ల, అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. సాధారణంగా బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదరవచ్చు. పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించడానికి కూడా ఇది బాగా అనుకూలమైన సమయం. గతంలో ప్రయ త్నించి, చివరి క్షణంలో విరమించుకున్న సంబంధమే మళ్లీ వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. సమాజంలో బాగా పలుకుబడి కలిగిన కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
- కర్కాటకం: ఈ రాశివారికి మూడవ స్థానంలో శుక్రుడు, కేతువు కలిసినందువల్ల పెళ్లి ప్రయత్నాలు కలిసి రాకపోవచ్చు. ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా నిష్ఫలం అవుతుంటాయి. మామూలు స్పందన కూడా లభించకపోవచ్చు. పెళ్లి ప్రయత్నాలు బాగా విసుగు కలిగిస్తాయి. ఎక్కువ సమయం నిరీ క్షించాల్సి వస్తుంది. ఈ నెల 29 తర్వాత చేసే ప్రయత్నాలకు చాలావరకు సానుకూల స్పందన లభించవచ్చు. తృతీయ స్థానంలో సంచరిస్తున్న కేతువు వల్ల ప్రయత్నాలు కూడా ఇబ్బంది పెడతాయి.
- సింహం: ఈ రాశికి ద్వితీయ స్థానంలో శుక్ర, కేతువుల సంచారం వల్ల కొద్ది ప్రయత్నంతో తప్పకుండా మంచి పెళ్లి సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది. తాహతుకు మించిన సంబంధం కుదరడం జరుగుతుంది. సాధారణంగా దూర ప్రాంతానికి చెందిన వ్యక్తితోనో, విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితోనో అనుకోకుండా పెళ్లి సంబంధం కుదరవచ్చు. పెళ్లి సంబంధం విషయంలో ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలం అవుతుంది. పెళ్లి చేయడానికి ఎక్కువ సమయం ఉండకపోవచ్చు.
- కన్య: ఈ రాశిలో శుక్ర, కేతువులు సంచారం చేస్తున్నందువల్ల కొద్ది ప్రయత్నంతో తప్పకుండా పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. అయితే, ఈ రాశికి రాహువు సప్తమంలో ఉన్నందువల్ల, గురు వీక్షణ లేనందువల్ల పెళ్లి ప్రయత్నాల విషయంలో చివరి వరకూ మానసిక ఒత్తిడి లేదా టెన్షన్ ఉండే అవకాశం ఉంది. పెళ్లి వ్యవహారానికి బాగా ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. బాగా పరిచయస్థులలో కానీ, సహోద్యోగులలో కానీ పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి.
- తుల: ఈ రాశివారు ఎంత కష్టపడ్డా పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. పైగా పెళ్లి ప్రయత్నాల వల్ల బాగా ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది. ఈ నెల 29 వరకూ పెళ్లి ప్రయత్నాలు చేయకపోవడం మంచిది. పెళ్లి సంబంధం విషయంలో మోసపోవడం గానీ, నష్ట పోవడం గానీ జరిగే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలలో భాగంగా బాగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. గట్టి ప్రయత్నం చేసినప్పటికీ ఆశించిన స్థాయి పెళ్లి సంబంధం కుదరకపోవచ్చు.
- వృశ్చికం: ఈ రాశికి లాభస్థానంలో శుక్ర, కేతువుల సంచారం వల్ల పరిచయస్థులలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఇష్టపడ్డ వ్యక్తితో పెళ్లి జరిగే అవకాశం కూడా ఉంది. కొద్ది ప్రయత్నంతో మంచి సంబంధం కుదరడానికి అవకాశం ఉంది. సమాజంలో బాగా పలుకుబడి కలిగిన కుటుంబంతో పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. బాగా ఆర్భాటంగా పెళ్లి చేయడం జరుగుతుంది. పెళ్లి సంబంధం కుదరడానికి కొందరు బంధుమిత్రులు బాగా సహాయ సహకా రాలు అందించే అవకాశం ఉంది.
- ధనుస్సు: ఈ రాశివారికి దశమ స్థానంలో శుక్ర, కేతువుల సంచారం వల్ల పెళ్లి సంబంధం కుదిరే అవకాశాలు చాలా తక్కువ. పెళ్లి సంబంధం కుదరడానికి బాగా కష్టపడాల్సి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాల వల్ల కొన్ని ఇబ్బందులు పడడం జరుగుతుంది. బాగా ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావడంతో పాటు, డబ్బు నష్టానికి, పరువు నష్టానికి కూడా అవకాశం ఉంటుంది. పెళ్లివారి నుంచి ఆశించిన స్పందన లభించకపోవచ్చు. ఈ నెల 29వ తేదీ వరకు నిరీక్షించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
- మకరం: ఈ రాశికి భాగ్య స్థానంలో శుక్ర, కేతు సంచారం వల్ల దూర ప్రాంతానికి చెందిన వ్యక్తితోనో, విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితోనో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో మంచి పెళ్లి సంబంధం కుదరే సూచనలున్నాయి. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదరవచ్చు. సాధారణంగా బంధువర్గంలో కానీ, స్నేహితులకు తెలిసిన వారితోనో గానీ పెళ్లి ఖాయమయ్యే అవ కాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు ఈ నెల 29 వరకూ చాలా అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు.
- కుంభం: ఈ రాశివారు పెళ్లి ప్రయత్నాల విషయంలో మరి కొంత కాలం ఆగవలసి ఉంటుంది. ఈ రాశికి అష్టమ స్థానంలో శుక్ర, కేతువులు సంచారం చేస్తున్నందువల్ల, సాధారణంగా పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉండదు. పెళ్లి ప్రయత్నాల వల్ల బాగా ఇబ్బంది పడడం, తిప్పట, శ్రమకు అవ కాశం ఉంది. మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల మధ్యలోనే తమ ప్రయత్నాలను విర మించే అవకాశం ఉంటుంది. ఈ నెల 29 తర్వాత ఈ రాశివారికి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
- మీనం: ఈ రాశివారికి కొద్ది ప్రయత్నంతో తప్పకుండా పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. సప్తమ స్థానంలో శుక్ర, కేతువుల సంచారం వల్ల అనుకోని వైపు నుంచి పెళ్లి సంబంధం వచ్చి, ఖాయం అయ్యే అవకాశం ఉంది. బాగా పరిచయస్థులతో లేదా బాగా ఇష్టపడ్డ వారితో సంబంధం నిశ్చయం కావచ్చు. సాధారణంగా బంధువర్గంలోని వారు ప్రయత్నం చేయడం వల్ల పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది. దూర ప్రాంతంలో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..