హిందూ మతంలో శరత్ పూర్ణిమకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శరదృతువులో ఆశ్వీయుజ మాసం పౌర్ణమిన రోజున కాముడు పున్నమి అని కూడా అంటారు. ఈ రోజున శ్రీ కృష్ణుడు రాధా, గోపికలతో కలిసి బృందావనంలో విహరించాడని నమ్ముతారు. ఈ శరద్ పూర్ణిమ ఈ సంవత్సరం ఈ తేదీ అక్టోబర్ 28 న వచ్చింది. ఈ రోజున లక్ష్మి దేవి, చంద్రుడిని పూజిస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని, ఇంటిలో సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్ముతారు. ఈ రోజున పాలు, పాయసం తయారు చేసి చంద్రుడికి నైవేద్యంగా సమర్పించి ఆ పాయసాన్ని సేవించే సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. అయితే ఇలా శరత్ పూర్ణమి రోజున పాయసాన్ని నైవేద్యంగా సమర్పించే సంప్రదాయం ఎప్పటిదో తెలుసా? శరద్ పూర్ణిమ రోజున సమర్పించే నైవేద్యాన్ని ఎందుకు పవిత్రంగా భావిస్తారో .. దానిని అమృతంతో ఎందుకు పోలుస్తారో ఈ రోజు తెలుసుకుందాం..
వాస్తవానికి శరత్ పూర్ణిమ రోజున చంద్రుడు తన 16 కళలతో నిండి ఉంటాడని.. ఈ రోజు చంద్రుడి వెన్నెల నుంచి అమృతం వర్షిస్తుందని నమ్ముతారు. ఈ సమయంలో చంద్రుని నుండి వెలువడే కిరణాలు చాలా శక్తివంతమైనవిగా పరిగణించబడతాయి. ఇవి అనేక రకాల వ్యాధులను నాశనం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని నమ్మకం. ఈ రోజున చంద్రకాంతిలో పాయసాన్ని ఉంచడం శుభప్రదంగా పరిగణించబడటానికి కారణం ఇదే. చంద్రుడి వెన్నెల తగిలిన పాలు, పాయసం అమృతంలాగా మారుతుందని.. దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని పెద్దల నమ్మకం.
శరత్ పూర్ణిమ రోజున చంద్రుని కిరణాలు సోకిన పాలు అమృతంలా మారతాయట. అటువంటి పరిస్థితిలో ఈ పాలతో పాయసం తయారు చేసి వినియోగిస్తారు. అయితే ఈ సంవత్సరం శరత్ పూర్ణిమ నాడు చంద్రగ్రహణం ఏర్పడనుంది. అటువంటి పరిస్థితిలో చంద్రుడికి పాయసం నైవేద్యంగా పెట్టే విషయంలో చాలా గందరగోళం నెలకొంది.
చంద్రగ్రహణం అక్టోబర్ 28న తెల్లవారుజామున 01:05 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 02:23 గంటలకు ముగుస్తుంది. సూత కాలం 9 గంటల ముందు నుంచి ప్రారంభమవుతుంది. అయితే శరత్ పూర్ణిమ అక్టోబర్ 28 ఉదయం 04:17 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 28 అర్థరాత్రి 03:46 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో జ్యోతిష్క నిపుణుల చెప్పిన ప్రకారం ఈ సంవత్సరం శరత్ పూర్ణిమ రోజున పాలను లేదా పాయసం చంద్రుడికి సమర్పించడం లేదా పూజ చేయడం వీలు కాదు. ఎందుకంటే సూత కాలం ప్రారంభమైన తర్వాత హిందూ సంప్రదాయం ప్రకారం దేవాలయ తలుపులు మాత్రమే కాదు ఇంటిలో పూజ గదిని కూడా మూసివేస్తారు. అయితే ఈ సూతక సమయంలో రాహుకేతు సహా గ్రహాల అనుగ్రహం కోసం మంత్రాలను పఠించవచ్చు .. దైవం అనుగ్రహం కోసం కీర్తనలు చేయవచ్చు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.