
Ketu Transit 2025
ఈ నెల(మే) 18న కన్యా రాశి నుంచి సింహ రాశిలోకి మారుతున్న కేతువు కొన్ని రాశుల వారి జీవితాలను సమూలంగా మార్చేసే అవకాశం ఉంది. ఈ కేతువు 2026 డిసెంబర్ 5 వరకూ సింహ రాశిలో కొనసాగుతాడు. కేతువు ఒక మిస్టరీ గ్రహం. ఆధ్యాత్మికత, నైపుణ్యాలు, జ్ఞానం, విజ్ఞానం, ఆకస్మిక ధన ప్రాప్తి వంటి అంశాలకు కారకుడైన కేతువు మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, మీన రాశులకు శుభ ఫలితాలు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. కేతువు వల్ల శుభ ఫలితాలు పొందడానికి మొక్కుబడులు ఏవైనా ఉంటే పూర్తి చేయడం, తరచూ సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం, తరచూ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలకు వెళ్లడం చాలా మంచిది.
- మేషం: ఈ రాశికి పంచమ స్థానంలో కేతువు ప్రవేశించడం వల్ల ఈ రాశివారు నైపుణ్యాలను పెంచుకోవడం, ప్రతిభా పాటవాలకు పదును పెట్టడం జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు లాభాల వర్షం కురిపిస్తాయి. ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు, కొత్త పద్ధతులు ప్రవేశపెట్టి లబ్ధి పొందుతారు. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధాసక్తులు పెరుగుతాయి.
- మిథునం: ఈ రాశికి తృతీయ స్థానంలో కేతు సంచారం వల్ల అనేక విధాలైన పురోగతికి, అభివృద్ధికి అవకాశం ఉంటుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటి ఆర్థిక మదుపులు, పెట్టుబడుల వల్ల అత్యధికంగా లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతి కలుగు తుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- సింహం: ఈ రాశిలో కేతు సంచారం వల్ల ఈ రాశివారికి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో తమ లక్ష్యాలను సాధించుకోగలుగుతారు. ఆదాయం అనేక మార్గాల్లో వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగా అనుకూలమవుతుంది. విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉంది. విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా ఉంటాయి. నైపుణ్యాలను పెంచుకుంటారు. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. పుణ్య క్షేత్రాలను ఎక్కువగా సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి.
- తుల: ఈ రాశికి లాభ స్థానంలో కేతు సంచారం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. మనసులోని ముఖ్యమైన కోరికలు, ఆశలు నెరవేరుతాయి. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- ధనుస్సు: ఈ రాశికి కేతువు భాగ్య స్థానంలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశికి చెందిన ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నవారికి స్థిరత్వం లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు లభించే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. సంతాన యోగం కలుగుతుంది. కోరికలు, ఆశలు నెరవేరుతాయి.
- మీనం: ఈ రాశికి షష్ట స్థానంలో కేతు సంచారం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెంది కొన్ని ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలు కూడా చాలావరకు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. వైద్య ఖర్చులు బాగా తగ్గే అవకాశం ఉంది. ఉద్యో గంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. రావలసిన సొమ్మును రాబట్టుకుంటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు.