
Kubera Yoga
ఈ నెల 8 (మంగళవారం) తో గురు మౌఢ్యమి తొలగిపోయింది. దీనివల్ల రవి ప్రభావం నుంచే కాక, ఇతర గ్రహాల యుతి నుంచి, చెడు దృష్టుల నుంచి కూడా గురువు బయటపడి బలోపేతం కావడం జరుగు తుంది. ధన కారకుడు, గృహ కారకుడు, పుత్ర కారకుడు అయిన గురువుకు బలం పెరగడం వల్ల వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశులవారికి కుబేర యోగం పట్టడం జరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరగడం, సంతానానికి సంబంధించి శుభవార్తలు వినడం, గృహ, వాహన ప్రయత్నాలు సఫలం కావడం, మనసులోని కోరికలు నెరవేరడం వంటివి జరుగుతాయి. అక్టోబర్ 5 వరకూ ఈ రాశులకు గురువు అనుగ్రహం కలిగే అవకాశం ఉంది.
- వృషభం: ధన స్థానంలో ఉన్న గురువు వల్ల మరో మూడు నెలల్లో ఈ రాశివారు సంపన్నులయ్యే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు దాదాపు పూర్తిగా సమసిపోయే అవకాశం కూడా ఉంది. కొద్ది ప్రయత్నంతో తప్పకుండా గృహ యోగం కలుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించి పెరుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి.
- మిథునం: ఈ రాశిలో ఉన్న గురువుకు బలం పెరగడం వల్ల అనుకున్న పనులన్నీ పూర్తవడంతో పాటు మనసులోని ముఖ్యమైన కోరికలు, ఆశలు నెరవేరుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. ఆదాయ వృద్ధికి ఇది బాగా అనుకూల సమయం. సొంత ఇంటి కలతో పాటు, విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల కూడా నెరవేరుతుంది. అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. పిత్రార్జితం కానీ, తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు కానీ లభించే అవకాశం ఉంది.
- సింహం: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న గురువుకు బలం బాగా పెరగడం వల్ల ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం కలగడంతో పాటు షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి విశేషంగా లాభించడం జరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. జీతభత్యాలు అంచనాలకు మించి పెరుగుతాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలరీత్యా విదేశీ ప్రయాణాలు చోటు చేసుకుంటాయి. అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు బాగా తగ్గుతాయి.
- తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉన్న గురువుకు బలం పెరగడం వల్ల అపారంగా లక్ష్మీకటాక్షం కలుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. రావలసిన సొమ్ము పూర్తిగా చేతికి అందుతుంది. మొండి బాకీలను సైతం వసూలు చేసుకుంటారు. షేర్లు, స్పెక్యులేషన్లు అంచనాలకు మించి లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. పిత్రార్జితం లభిస్తుంది.
- ధనుస్సు: ఈ రాశికి సప్తమ స్థానంలో ఉన్న గురువుకు బలం పెరగడం వల్ల ప్రేమ వ్యవహారాల్లోనూ, పెళ్లి ప్రయత్నాల్లోనూ కలలో కూడా ఊహించని విజయాలు సాధిస్తారు. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి కావడం వంటివి జరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో భాగస్వాముల సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు కలుగుతాయి. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు.
- కుంభం: ఈ రాశికి పంచమ స్థానంలో ఉన్న గురువు బలోపేతుడు కావడం వల్ల సంతాన యోగానికి, పిల్లలు బాగా వృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ సమర్థతకు గుర్తింపు లభించడంతో పాటు పదోన్నతికి బాగా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు బాగా వృద్ధి చెందుతాయి. అత్యంత ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. రాజ పూజ్యాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా ఆదాయ ప్రయత్నాలన్నీ బాగా లాభిస్తాయి.