
Double Yoga
ఈ నెల(జులై) 23, 24, 25 తేదీల్లో రెండు మహా యోగాలు చోటు చేసుకుంటున్నాయి. మిథునంలో గురు, చంద్రులు కలవడం వల్ల గజకేసరి యోగం, కర్కాటకంలో రవి, బుధులు కలిసి ఉండడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతున్నాయి. ఈ రెండు యోగాల వల్ల కొన్ని రాశులకు బ్యాంక్ బ్యాలెన్స్, సంపద పెరగడంతో పాటు పట్టిందల్లా బంగారమయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో అందలాలు ఎక్కడం, పలుకుబడి పెరగడం వంటివి కూడా చోటు చేసుకుంటాయి. ఈ యోగాల ప్రభావం ఈ మూడు రోజులకే పరిమితం కాకుండా పదిహేను రోజుల వరకు కొనసాగే అవకాశం ఉంది. మేషం, వృషభం, మిథునం, కన్య, తుల, మీన రాశుల వారు ఈ రెండు మహా యోగాల ఫలితాలను అనుభవించడం జరుగుతుంది.
- మేషం: ఈ రాశికి ఈ గజకేసరి, బుధాదిత్య యోగాలు అనేక విధాలుగా ఆదాయాన్ని పెంచే అవకాశం ఉంది. ఈ మూడు రోజుల్లో వీరు చేపట్టే ఆదాయ ప్రయత్నాలు అంచనాలకు మించిన శుభ ఫలితాలనిస్తాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. భూమి సంబంధమైన ఆస్తుల పైనా, షేర్లలోనూ, పెట్టుబడులు పెట్టడం వల్ల సంపద పెరుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతాయి. ఒకటికి రెండుసార్లు ఊహించని ధన యోగాలు పడతాయి.
- వృషభం: ఈ రాశికి ఈ గజకేసరి, బుధాదిత్య యోగాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయం వృద్ధి చెంది, ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడి సంపన్నుల స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పలుకు బడి బాగా విస్తరిస్తుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయపరంగా ఎలాంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతికి అవకాశం ఉంది.
- మిథునం: ఈ రాశికి గజకేసరి, బుధాదిత్య యోగాల వల్ల ధన స్థానానికి బలం పెరగడంతో ఊహించని స్థాయిలో ధనవృద్ది చోటు చేసుకునే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతుంది. వ్యాపారాలు నష్టాలు, ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి.
- కన్య: గజకేసరి, బుధాదిత్య యోగాల వల్ల ఈ రాశికి దశమ, లాభ స్థానాలు బలపడడం వల్ల ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి సంస్థల నుంచి ఆఫర్లు అందు తాయి. అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కుటుంబంలో ముఖ్యమైన శుభ పరిణామాలు సంభవిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. రాజపూజ్యాలు కలుగుతాయి.
- తుల: ఈ రాశికి భాగ్య, దశమ స్థానాల్లో ఈ రెండు మహా యోగాలు ఏర్పడడం వల్ల విదేశీ సంపాదన అనుభవించే యోగం కూడా పడుతుంది. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. విదేశీ అవకాశాలు లభిస్తాయి. అప్రయత్న ధన లాభానికి అవకాశం ఉంటుంది. లాటరీలు, షేర్లు, ఆర్థిక లావాదేవీల వల్ల అత్యధికంగా ప్రయోజనం ఉంటుంది. వారసత్వ సంపద లభిస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ దినదినాభివృద్ధి చెందుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి.
- మీనం: ఈ రాశికి చతుర్థ, పంచమ స్థానాల్లో ఈ రెండు ధన యోగాలు ఏర్పడుతున్నందువల్ల ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. ఆదాయపరంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తయి, ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో కూడిన పదోన్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల పరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. ధన యోగాలు పట్టడం వల్ల జీవనశైలి బాగా మారిపోతుంది.