Marriage
జ్యోతిషశాస్త్రంలో సప్తమ స్థాన అధిపతిని బట్టి ప్రేమలు, పెళ్లిళ్లు తదితర విషయాలను నిర్ణయించడం జరుగుతుంది. సప్తమాధిపతి అనుకూలంగా ఉన్న పక్షంలో కొద్ది ప్రయత్నాలతో పెళ్లి సంబంధం కుదరడం, వైవాహిక జీవితం అనుకూలంగా, అన్యోన్యంగా సాగిపోవడం వంటివి జరుగుతాయి. ప్రేమ వ్యవహారాలను కూడా సప్తమాధిపతిని బట్టే నిర్ణయించడం జరుగుతుంది. ఈ ఏడాది కొన్ని రాశులకు మాత్రమే సప్తమాధిపతి అనుకూలంగా ఉన్నందువల్ల ప్రేమలు, పెళ్లిళ్లపరంగా యోగదాయక జీవితం ఏర్పడుతుంది. మేషం, వృషభం, సింహం, కన్య, కుంభం, మీన రాశులకు సప్తమాధిపతి శుభ యోగాలను కలిగించే అవకాశం ఉంది.
- మేషం: ఈ రాశికి సప్తమాధిపతి అయిన శుక్రుడు అనుకూల రాశుల్లో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారు అనుకూలమైన వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. ఈ శుక్రుడు కర్కాటకం, సింహ రాశుల్లో సంచారం చేస్తున్నందువల్ల మంచి వృత్తి, ఉద్యోగాల్లో ఉన్న వ్యక్తి లేదా సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు కూడా సునాయాసంగా విజయం సాధిస్తాయి. బాగా అనుకూలమైన వ్యక్తితోనే పెళ్లయ్యే అవకాశం ఉంది.
- వృషభం: ఈ రాశికి సప్తమాధిపతి అయిన కుజుడు ప్రస్తుతం ఇదే రాశిలో సంచారం చేస్తుండడంతో ఈ రాశి వారు తప్పకుండా ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి వ్యాపారంలో లేదా స్వతంత్ర జీవ నంలో ఉండే అవకాశం కూడా ఉంది. ప్రేమ వ్యవహారాలు తప్పకుండా పెళ్లికి దారితీస్తాయి. దంప తుల మధ్య అన్యోన్యత చెక్కుచెదరకుండా కొనసాగుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో కూడా మొదటి చూపులోనే ఒకరినొకరు ఇష్టపడే అవకాశం ఉంది. అన్యోన్య జీవితం ఏర్పడే సూచనలున్నాయి.
- సింహం: ఈ రాశికి సప్తమాధిపతి అయిన శనీశ్వరుడు సప్తమంలోనే ఉన్నందువల్ల కొద్దిగా ఆలస్యంగానే అయినప్పటికీ మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. సాధారణంగా ప్రేమలో పడడానికి, ప్రేమ వివాహానికి అవకాశం ఉండదు. ఎక్కువ సంఖ్యలోనే పెళ్లి ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. అయితే, సరైన ఆదాయం కలిగిన వ్యక్తితో లేదా విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నవ్యక్తితో సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది. దంపతుల మధ్య విడదీయలేని బంధం ఏర్పడుతుంది.
- కన్య: ఈ రాశివారికి సప్తమాధిపతి అయిన గురువు భాగ్య స్థానంలో స్థిర రాశిలో ఉన్నందువల్ల, ఈ రాశివారు ప్రేమలో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగంలో కలిసి పని చేస్తున్న వ్యక్తితో గానీ, పరిచయస్థులతో గానీ ప్రేమలో పడడం జరుగుతుంది. ఆ వ్యక్తి స్థిరమైన ఉద్యోగంలో ఉండడం, సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి అయి ఉండడం జరుగుతుంది. విదేశాల్లో స్థిర పడిన వ్యక్తితో పెళ్లి ప్రయత్నాలు చేయడం మంచిది. వివాహ బంధం అన్యోన్యంగా సాగిపోతుంది.
- కుంభం: ఈ రాశికి సప్తమాధిపతి రవి అయినందువల్ల ప్రేమలో పడడానికి అవకాశం ఉండకపోవచ్చు. సాధారణంగా పెద్దలు కుదర్చిన సంబంధమే ఖాయం అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వ్యక్తితో లేదా దూర ప్రాంతంలో ఉన్న వ్యక్తితో పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో కొద్దిగా శ్రమ తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. వివాహ బంధం అనుకూలంగా, అన్యోన్యంగా కొనసాగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అతి త్వరలో పెళ్లయ్యే సూచనలున్నాయి.
- మీనం: ఈ రాశికి సప్తమాధిపతి అయిన బుధుడు ప్రస్తుతం పంచమ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల వీరు ప్రేమలో పడే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపార రంగంలో ఉన్న వ్యక్తితో గానీ, ఆర్థిక రంగంలో పనిచేస్తున్న వ్యక్తితో గానీ ప్రేమలో పడడం జరుగుతుంది. వీరి ప్రేమ తప్పకుండా పెళ్లికి దారితీసే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో కూడా వ్యాపారాల్లో ఉన్నవారితో, ఆర్థిక సంస్థల్లో పని చేస్తున్నవారితో పెళ్లయ్యే అవకాశం ఉంది. వీరి వివాహ బంధం తప్పకుండా అన్యోన్యంగా సాగిపోతుంది.