Dhanasu Rasi Ugadi Rasi Phalalu 2023
Image Credit source: TV9 Telugu
తెలుగువారి కొత్స సంవత్సరాదినే ఉగాది అని అంటారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం బుధవారం (మార్చి 22) నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్ 23 నుంచి గురుగ్రహం మేషరాశిలో సంచారం ప్రారంభిస్తుంది. అదేవిధంగా, అక్టోబర్ 24న మీనరాశిలో రాహు సంచారం కన్యారాశిలో కేతువు సంచారం ప్రారంభం అవుతుంది. శని గ్రహం ఈ ఏడాదంతా కుంభ రాశిలో కొనసాగుతుంది. మిగిలిన గ్రహాలు సుమారుగా నెలరోజులు చొప్పున వివిధ రాశుల్లో సంచరించడం జరుగుతుంది. గ్రహాల సంచారం ఆధారంగా శ్రీ శోభకృత్ నామ సంవత్సర కాలంలో ధనస్సు రాశి వారికి జ్యోతిష్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నది ఇక్కడ పరిశీలిద్దాం.
ధనుస్సు రాశి (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆదాయం 8, వ్యయం 11 | రాజపూజ్యం 6, అవమానం 3
మూడవ స్థానంలో శని, ఐదవ స్థానంలో గురు రాహువులు, 11వ స్థానంలో కేతు సంచారం వల్ల ఈ ఏడాది ఈ రాశి వారికి జీవితమంతా శుభమయంగా ఉంటుంది. శుభవార్తలు, శుభ పరిణామాలు, శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో సంపాదన బాగా పెరుగుతుంది. సమాజంలో మాటకు విలువ ఉంటుంది. పలుకుబడి కలిగిన వారితో మంచి పరిచయాలు ఏర్పడతాయి. రాజకీయంగా ఎదిగే అవకాశం ఉంది. సంతాన యోగం కలుగుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహిస్తే చాలా బాగుంటుంది.
సమయం అన్ని విధాలుగాను అనుకూలంగా ఉన్నందువల్ల వీలైనంతగా సద్వినియోగం చేసుకోవడం మంచిది. కొత్త నిర్ణయాలు, కొత్త పథకాలతో దూసుకుపోవటం వల్ల ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయి. లాటరీ, స్పెక్యులేషన్, వడ్డీ వ్యాపారం, రియల్ ఎస్టేట్, జూదం వంటి వాటి వల్ల ధన లాభ సూచనలున్నాయి. ఏ విషయంలోనైనా ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. పెద్దల నుంచి సంపద కలిసి వచ్చే అవకాశం ఉంది.
ఏడాదంతా శుభమే..
దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. విందులు, వినోదాలకు, విహార యాత్రలకు అవకాశం ఉంది. ఐటి వంటి వృత్తి నిపుణులకు అవకాశాలు పెరిగే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడతాయి. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి.
అన్నదానం మంచిది
ఈ ఏడాదంతా పూర్వాషాడ నక్షత్రం వారికి మరింత ఎక్కువగా ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. ఇష్ట దైవాన్ని మరింత శ్రద్ధగా పూజిస్తే అదృష్టం పూర్తి స్థాయిలో మీది అవుతుంది. అన్నదానం చేయటం వల్ల, పేదలకు సహాయపడటం వల్ల ఎక్కువగా శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి.
(Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..)
మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..