Career Astrology: మీకు ఉద్యోగం మంచిదా.. స్వయం ఉపాధి మంచిదా? ఏ రాశి వారు ఏది ఎంచుకోవాలి..?

| Edited By: Janardhan Veluru

Sep 07, 2023 | 3:53 PM

Astro Tips in Telugu: ఉద్యోగాలకు శనీశ్వరుడు, గురువు, చంద్రుడు, రవి, కేతువు ఎక్కువగా సహాయ పడతాయి. వ్యాపారాలకు లేదా స్వయం ఉపాధికి శుక్రుడు, రాహువు, బుధుడు, కుజుడు ఎక్కువగా సహకరిస్తాయి. వివిధ రాశుల వారికి ఈ ఏడాది ఈ సంధిగ్ధావస్థ నుంచి ఏ విధంగా విముక్తి లభిస్తుందో ఇక్కడ పరిశీలిద్దాం.

Career Astrology: మీకు ఉద్యోగం మంచిదా.. స్వయం ఉపాధి మంచిదా? ఏ రాశి వారు ఏది ఎంచుకోవాలి..?
Career Astrology
Follow us on

Astrology in Telugu: ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారిలో సాధారణంగా ఉద్యోగం మంచిదా లేక వ్యాపారం మంచిదా అన్న ఊగిసలాట, సందిగ్ధం ఉంటాయి. జ్యోతిషశాస్త్ర పరంగా ఇటువంటి డోలాయమాన పరిస్థితికి మంచి పరిష్కారం, మార్గం లభిస్తాయి. ఇందుకు వివిధ రాశుల తత్వాలు కూడా దోహదం చేస్తాయి. ఉద్యోగాలకు శనీశ్వరుడు, గురువు, చంద్రుడు, రవి, కేతువు ఎక్కువగా సహాయ పడతాయి. వ్యాపారాలకు లేదా
స్వయం ఉపాధికి శుక్రుడు, రాహువు, బుధుడు, కుజుడు ఎక్కువగా సహకరిస్తాయి. వివిధ రాశుల వారికి ఈ ఏడాది ఈ సంధిగ్ధావస్థ నుంచి ఏ విధంగా విముక్తి లభిస్తుందో ఇక్కడ పరిశీలిద్దాం.

  1. మేషం: ఈ రాశిలో గురు, రాహువుల సంచారం జరుగుతోంది. సాధారణంగా గురువు ఉద్యోగానికి పనికి వచ్చే గ్రహమే అయినప్పటికీ, పక్కన రాహువు కూడా ఉన్నందువల్ల ఉద్యోగం, వ్యాపారాల మధ్య ఏది ఎంచుకున్నా ఆదాయానికి లోటుండదు. ఉద్యోగం చేస్తూనే పక్కన వ్యాపారం చేసుకోవడం వల్ల లాభం ఉంటుంది. ఈ రెండు గ్రహాల యుతి వల్ల డబ్బాశ ఎక్కువగా ఉంటుంది. ఏదో విధంగా సంపాదించాలనే తపన పెరుగుతుంది. మొదటగా ఉద్యోగానికి ప్రయత్నించడమే శ్రేయస్కరం.
  2. వృషభం: ఈ రాశివారికి ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు ఎంతగానో లాభిస్తాయి. ఆర్థిక ప్రణాళికలు వేయ డంలో ఈ రాశివారు ఉద్దండులు. అందువల్ల ఈ రాశివారికి వ్యాపారమే మంచిది. పైగా నాలుగవ స్థానంలో రవి, బుధులు కూడా కలిసి ఉన్నందువల్ల ఇప్పుడు చేపట్టిన వ్యాపారాలు అతి త్వరగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. గురువు వ్యయంలో ఉన్నందువల్ల అత్యవసరమైతే తప్ప జేబులోంచి డబ్బు తీయని మనస్తత్వం ఏర్పడుతుంది. ఈ తత్వం వ్యాపారాలకు పనికి వస్తుంది.
  3. మిథునం: ఈ రాశివారు ఉద్యోగం చేయడమే మంచిది. ఈ రాశివారికి లౌక్యం గానీ, ఆర్థిక నిర్వహణ గానీ తెలియకపోవడం వల్ల వీరికి వ్యాపారాలు పనికి రావనే చెప్పాలి. ఉద్యోగాల్లో మాత్రం అతి వేగంగా ఆర్థిక, వ్యక్తిగత పురోగతి ఉంటుంది. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులయి, ప్రభుత్వోద్యోగాల్లో చేరడదానికి, డాక్టర్లు, లాయర్లు, ఆర్కిటెక్ట్ వంటి వృత్తులు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. వీరు తమ తెలివితేటలతో డబ్బు సంపాదించే అవకాశాలు ఉండవచ్చు కానీ, అది వ్యాపారాల్లో మాత్రం కాదు.
  4. కర్కాటకం: వీరిలో భావోద్వేగాలు, పొంగిపోవడం, కుంగిపోవడం వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందు వల్ల వీరు వ్యాపారాలలో అభివృద్ధి సాధించడం కొంచెం కష్టమే అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కలిసి వచ్చే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తులలో కూడా వీరు రాణిస్తారు. ఈ ఏడాది వీరికి ఉద్యోగావకాశాలు బాగానే కలిసి వస్తాయి. వీటిని సద్వినియోగం చేసుకోవడం మంచిది. విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించే అవకాశం కూడా ఉంది. వృత్తి, ఉద్యోగాలే వీరికి శ్రేయస్కరం.
  5. ఇవి కూడా చదవండి
  6. సింహం: ఈ రాశివారికి పదిమందినీ కలుపుకునిపోయే తత్వం తక్కువగా ఉంటుంది. అహంకారం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రభుత్వ ఉద్యోగాలకు లేదా మార్కెటింగ్, రియల్ ఎస్టేట్, లిక్కర్, రాజకీయాలకు ప్రయత్నాలు చేయడం మంచిది. పోటీ పరీక్షల్లో వీరు ఈ ఏడాది విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ సంబంధాలకు కూడా అవకాశం ఉంది. ప్రత్యేకంగా భారీగా పెట్టుబడి పెట్టే వ్యాపారాలకు వీరు ఈ ఏడాది ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
  7. కన్య: ఈ రాశివారు ఉద్యోగాల కంటే వృత్తి, వ్యాపారాలకు బాగా పనికి వస్తారు. ఈ రాశివారు ఆర్థిక విషయాల్లో సరైన ప్లానింగ్ చేయడంలో, డబ్బును ఆచితూచి ఖర్చు చేయడంలో సిద్ధహస్తులు. ఉపయోగం లేకుండా ఒక్క పైసా కూడా ఖర్చు చేయని వీరి మనస్తత్వం వ్యాపారాలకు పెట్టుబడి అవుతుంది. ఏ వృత్తి చేపట్టినా విజయాలు సాధిస్తారు. విజయం సాధించే వరకూ నిద్రపోరు. ఏ వ్యాపారం చేపట్టినా వీరి ప్రత్యేకత వీరికి ఉంటుంది. లాయర్లుగా, డాక్టర్లుగా కూడా బాగా రాణిస్తారు.
  8. తుల: ఈ రాశివారికి వ్యాపారాలే బాగా అనుకూలిస్తాయి. సాధారణంగా స్త్రీ సంబంధమైన వస్తువులు, అంటే దుస్తులు, ఆభరణాలు, కాస్మటిక్స్, మార్కెటింగ్, రియల్ ఎస్టేట్, కన్సల్టెన్సీ వంటి రంగాలలో వీరు శక్తి సామర్థ్యాలను నిరూపించుకో గలుగుతారు. వృత్తుల్లో కూడా వీరికి వైద్యం, వైద్య సంబంధమైన వృత్తులు బాగా అనుకూలిస్తాయి. ప్రస్తుతం ఈ రాశినాథుడైన శుక్రుడు కర్కాటక రాశిలో ఉన్నందువల్ల ఈ రాశివారు వ్యాపార ప్రయత్నాలను వెంటనే ప్రారంభించడం మంచిది.
  9. వృశ్చికం: ఈ రాశివారికి ఉద్యోగం కన్నా, వ్యాపారాలు ఉపయోగకరంగా ఉంటాయి. వ్యాపారాల కన్నా వృత్తులు మరింత లాభం కలిగిస్తాయి. డాక్టర్లు, బిల్డర్లు, రియల్ ఎస్టేట్, లిక్కర్, రాజకీయాలు, వాస్తు శిల్పులు వంటి రంగాలు వీరికి ఎంతగానో కలిసివస్తాయి. ఇతర వృత్తులు లేదా వ్యాపారాలు కూడా వీరికి చాలావరకు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలకు మాత్రం దూరంగా ఉండడం మంచిది. ఇతరులతో కలిసి పని చేయడం అన్నది వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది.
  10. ధనుస్సు: డాక్టర్లు, లాయర్లు వంటి ఇతరులకు సేవ చేయడానికి సంబంధించిన వృత్తులు వీరికి బాగా కలిసి వస్తాయి. రాజకీయనాయకులు, సేవా సంస్థలు కూడా వీరికి డబ్బు, కీర్తి ప్రతిష్ఠలను తీసుకు వస్తాయి. వీరిలో సహజసిద్ధంగా యాంబిషన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఉద్యోగాల చట్రంలో వీరు ఇమడలేరు. ఒకవేళ ఉద్యోగంలో చేరినా వీరి మనసు వ్యాపారాల వైపే మొగ్గు చూపుతూ ఉంటుంది. ఈ ఏడాది వీరికి వృత్తులు, వ్యాపారాలకే ముఖ్యమైన గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి.
  11. మకరం: ఈ రాశివారు సేవకే అంకితమైన వ్యక్తులు. ఎక్కువ ప్రాధాన్యం ఉద్యోగాలకే ఇవ్వడం మంచిది. ఈ రాశినాథుడైన శనీశ్వరుడిది సేవకా తత్వం. ఈ రాశివారు ఉద్యోగంలో అభివృద్ధి సాధించినంతగా వ్యాపారంలో సాధించడం కష్టమవుతుంది. ఏదైనా వృత్తిని చేపట్టడానికి అవకాశం ఉంటుంది కానీ, వ్యాపారంలో ఇమిడే అవకాశం ఉండదు. ఆస్పత్రులు, హోటళ్లు వంటి సేవా రంగానికి సంబంధించిన రంగాలు కొద్దిగా అనుకూలంగా ఉంటాయి. సేవకు, చాకిరీకి అవకాశముంటేనే వీరు రాణిస్తారు.
  12. కుంభం: ఇతర రాశుల మాదిరిగా వీరికి డబ్బు సంపాదించాలనే యావ ఉండదు. తన గౌరవానికి భంగం కలగకుండా, తన ప్రతిభకు, శ్రమకు గుర్తింపు లభించే ఉద్యోగం ఉంటేచాలని భావించేవారే ఈ రాశి వారిలో ఎక్కువగా ఉంటారు. వీరికి వ్యాపారం కంటే ఉద్యోగమే మంచిది. ఆ తర్వాతి స్థానం వృత్తు లకే చెందుతుంది. సేవా రంగ సంస్థల్లో వీరు బాగా రాణిస్తారు. ఆర్థిక స్థిరత్వం కోసం ప్రయత్నించే వీరిలో డబ్బాశ బాగా తక్కువగా ఉంటుంది. ఈ ఏడాది వీరికి ఉద్యోగావకాశాలు పెరుగుతాయి.
  13. మీనం: ఈ రాశివారికి వృత్తి, వ్యాపారాల కంటే ఉద్యోగాలకే అవకాశం ఎక్కువ. సాధారణంగా ఈ రాశివారికి ఆధ్మాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. పైగా బాగా సున్నిత మనస్కులు. ఇటువంటి లక్షణాలు వ్యాపారాలకు పనికి రాకపోవచ్చు. సేవకు సంబంధించిన వృత్తుల్లో కూడా వీరు బాగా రాణించే అవకాశం ఉంటుంది. వైద్యం, ఆస్పత్రులు, హోటళ్లు, ట్రస్టులు, అనాథాశ్ర మాలు, వృద్ధాశ్రమాలు, ఆలయాలు, బోధన వంటి రంగాలు వీరికి సరైనవి. ఈ ఏడాది అందుకు అవకాశాలున్నాయి.

Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.  దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.