Budh Vakri 2024
ఈ నెల 5 నుంచి 19 వరకూ సింహ రాశిలో వక్రిస్తున్న బుధుడి వల్ల ఆరు రాశులకు శుభ ఫలితాలున్నప్పటికీ మిగిలిన ఆరు రాశులకు చిక్కులు, చికాకులు తప్పకపోవచ్చు. తెలివితేటలకు, బుద్ధి బలానికి, కమ్యూనికేషనుకు సంబంధించిన బుధుడు వక్రించడం వల్ల మిథునం, సింహం, కన్య, మకరం, కుంభం, మీన రాశుల వారు ఊహించని ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ఈ రాశుల వారు తరచూ స్కంధాష్టకం చదువుకోవడంతో పాటు, కొత్త ప్రయత్నాలు, ఒప్పందాలు, ఆస్తి వ్యవహారాలు, పోటీ పరీక్షలు వంటి వ్యవహారాల్లో వీలైనంత అప్రమత్తంగా ఉండడం మంచిది.
- మిథునం: రాశ్యధిపతి బుధుడు తృతీయ స్థానంలో వక్రించడం వల్ల ఇతరులతో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ప్రయాణాల్లో విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది. ఇతరత్రా కూడా ప్రయాణాలు ఏమంత లాభించకపోవచ్చు. వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటి లావాదేవీలు కూడా ఇబ్బందులు పెట్టే అవ కాశం ఉంది. సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా సంతృప్తికరంగా పూర్తయ్యే అవకాశం ఉండదు.
- సింహం: ఇదే రాశిలో బుధుడు వక్రించడం వల్ల లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. అయితే, గృహ, వాహన సంబంధమైన రుణాలకు ప్రయత్నించకపోవడం మంచిది. ఆర్థిక వ్యవహారాలకు వీలైనంత దూరంగా ఉండడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వల్ల అవమానాలకు గురవుతారు. అధికారులతో హఠాత్తుగా సంబంధాలు బెడిసికొట్టే ప్రమాదం ఉంటుంది. మిత్రుల వల్ల డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది. శుభ కార్యాల్లో చికాకులు ఎదురవుతాయి.
- కన్య: రాశ్యధిపతి బుధుడు వ్యయ స్థానంలో వక్రించడం వల్ల పని తలపెట్టినా కొద్ది రోజుల పాటు వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కష్టార్జితంలో అధిక భాగం ఏదో రూపేణా వృథా అవుతుంది. వైద్య ఖర్చులు పెరుగుతాయి. అనవసర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. విలాసాలు, వ్యసనాల వల్ల కూడా ఖర్చు పెరుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ చాలావరకు తగ్గిపోతుంది. ఆస్తి లేదా గృహ ఒప్పందాలు పెట్టుకోకపోవడం మంచిది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.
- మకరం: ఈ రాశికి అష్టమ స్థానంలో బుధుడు వక్రగతి చెందడం వల్ల ఆస్తి వివాదాలు ఇబ్బంది పెడతాయి. పింఛన్లు, బీమా వ్యవహారాలు బాగా ఆలస్యం అవుతాయి. రావలసిన డబ్బు సమయానికి అందక ఇబ్బంది పడతారు. ఆర్థిక లావాదేవీల వల్ల నష్టపోతారు. గృహ, వాహన సంబంధమైన రుణాలను పొందడానికి ఇది సమయం కాదు. ఉద్యోగంలో అధికారులతో, వృత్తి, వ్యాపారాల్లో వినియోగదార్లతో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం చాలా మంచిది.
- కుంభం: ఈ రాశికి సప్తమ స్థానంలో బుధుడు వక్రించడం వల్ల సంబంధ బాంధవ్యాలు దెబ్బ తింటాయి. చివరికి జీవిత భాగస్వామితో కూడా అపార్థాలు తలెత్తుతాయి. వ్యాపార భాగస్వాములతో ఇబ్బం దులు ఏర్పడతాయి. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. దూర ప్రయాణాల వల్ల ఇబ్బందులు పడతారు. విదేశీ ప్రయాణాలకు సంబంధించి ఆటంకాలు, అవరోధాలు తప్పక పోవచ్చు. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు.
- మీనం: ఈ రాశికి ఆరవ స్థానంలో బుధుడి వక్రం వల్ల ఇతరులకు సహాయం చేయడం వల్ల ఇబ్బందులు పడతారు. ఆదాయం పెరగడానికి సంబంధించిన మార్గాలు మూసుకుపోతాయి. ఉద్యోగంలో పదో న్నతులు, జీతభత్యాల పెరుగుదలకు విఘ్నాలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో అపార్థాలకు, అనవసర కలహాలకు అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అనారోగ్య సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. మనశ్శాంతి తగ్గుతుంది.