సంక్రాంతి పండగ అంటే మిగిలిన ప్రాంతాల్లోకెల్లా ఉభయ గోదావరి జిల్లాల్లోనిసందడే వేరు. మిగిలిన ప్రాంతాల్లో సినిమాలు- షికార్లు- అరిసెలు- సకినాలు- గారెలు- బూరెలు కొత్తబట్టలే ప్రధానంగా పండగ సాగితే.. ఇక్కడ మాత్రం కోడి పందేలే మెయిన్ అట్రాక్షన్.
భోగి- సంక్రాంతి- కనుమ.. మూడు పండగల పేర్లు వేరై ఉండొచ్చు. కానీ గోదావరి జిల్లాల్లోని అనేక గ్రామాల్లో ఆ మూడు రోజుల పాటు సాగేది మాత్రం ఒక్కటే. అదే కోడి పందెం. ఐపీఎల్ రేంజ్ లో భారీ బరులు. రాత్రింబవళ్లు ఆడేలా వాటిలో ఫ్లడ్ లైట్లు. చుట్టూ ఫుడ్ స్టాల్స్.. ఇవి చాలవన్నట్టు గుండాట వంటి సైడు జూదాలతో.. భారీ కాక్ కార్నివాల్ జరుగుతుందిక్కడ.
ఏడు నుంచి పది నెలల పాటు బలంగా పెరిగిన కోళ్లు. ఒక్కో కోడి అరవై నుంచి డెబ్భై వేల వరకూ ధర పలికే కోడి పుంజులను కొని.. వాటిని బరిలోకి దించుతారు. అయితే తమ ప్రాంతానికే సంప్రదాయ క్రీడైన కోడి పందెంలోకి దిగి ప్రత్యర్ధి కోడితో తలబడాలంటే.. ఆ కోడికి రకరకాల తర్ఫీదులిస్తారు.. ఇదో పద్ధతి ప్రకారం సాగుతుందంటారు ఇక్కడి వారు. ఒకటీ రెండు కాదు.. ఏకంగా ముప్పై వరకూ రకాలను బరిలోకి దింపుతామనీ.. అంటారు స్థానిక కోళ్ల పెంపకందారులు.
కోళ్ల రంగులను బట్టీ రకాల విభజన చేయటం మాత్రమే కాదు.. వాటికంటూ ఒక జ్యోతిష శాస్త్రం ఉంది. దీనినే కుక్కుట శాస్త్రం అని అంటారు . రంగును బట్టీ, రకాన్నిబట్టీ వాటిని బరిలోకి దింపే ఆచారాన్ని తాము ఫాలో అవుతామంటారు పెంపకందార్లు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా పండగ వేళల్లో సాగే పందేల్లో పాల్గొనే కోళ్లంటే అంత ఆషామాషీ కాదు. పందెం కోళ్లను సిద్ధం చేయడమొక వ్యాపారం. చాలా మందికిదో జీవనోపాధి. చిన్నపిల్లగా ఉన్న కోళ్లను పరిశీలించి. వాటిని క్షుణ్ణంగా పరిశీలఇంచి మరీ ఎంపిక చేసి.. ప్రత్యేకంగా సిద్ధం చేస్తారు.
తామెంతో శ్రద్ధగా పెంచే.. ఈ కోడి పుంజులకు ప్రత్యేక ఆహారం అందిస్తారు. జీడిపప్పు, బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ తినిపిస్తారు. కొన్ని కోళ్లకు బోన్ లెస్ చికెన్ కూడా ఆహారంగా ఇస్తారు. పౌష్టికాహారంతో పాటు ఈత తదితర ఎక్సర్ సైజులు చేయిస్తారు. పందెం కోళ్లకంటూ స్పెషల్ క్యూరేటర్లుంటారు. ఆ మూడు రోజుల పాటు ఆ కోళ్లకు సపర్యలు చేయడానికి ప్రత్యేకించీ కొందరుంటారు. అయితే ఈ పందెం కోడి పుంజులకు మనుషులకు ఉన్నట్లు నక్షత్రాలు, జాతకాలూ ఉన్నాయి. ఇక్కడ సంక్రాంతి సమయంలో జరిగే కోడి పందాలులో కుక్కుట శాస్త్రం ప్రముఖ పాత్ర పోశిస్తుంది. ఈ శాస్త్రాన్ని అనుసరించి తమ కోడిని పోటీలకు దింపుతారు.
పందెం కోడి పుంజు రకాలు
కోడి పుంజుల్లో దాదాపు ముపై వరకూ రకాలున్నా.. ప్రధానంగా 16 రకాల కోడి పంజులు వాడుకలో ఉన్నాయి. వీటిని ఈ కల రంగులను బట్టి కోడి పుంజులను రకాలను విభజిస్తారు. కాకి, సేతు, పర్ల, సవల, కొక్కిరాయి, డేగ, నెమలి , కౌజు, మైల ,పూల ,పింగళ, నల్లబోర, ఎర్రపొడ, ముంగిస, అబ్రాసు, గేరువా వంటి రకాల పుంజులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు.
కోళ్ల నక్షత్రాలు:
మనుషులకు నక్షత్రాలు ఉన్నట్లే కోళ్లకు 27 జన్మ నక్షత్రాలు ఉంటాయి. అశ్వని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వాస, పుష్య, అశ్లేష, మాఘ, పుర్వ ఫాల్గుణి, పుబ్బ, ఉత్తర ఫల్గుణి, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్టా, మూల, పూర్వాపాఢ, ఉత్తరాపాఢ, శ్రావణ, ధనిష్ట, శతభిష, పూర్వాభద్ర, ఉత్తరాభద్ర, రేవతి ఉన్నాయి. ఈ నక్షత్రాలను పరిగణలోకి తీసుకుని పుంజుని బరిలోకి దింపుతారు. అంతేకాదు పందెం జరిగే సమయంలో కోడిని వదిలే దిశ కూడా గెలుపు ఓటములను నిర్ణయిస్తుంది. వీటన్నిటిని అనుసరిస్తూ పందెంరాయుళ్లు పక్కా ప్లాన్ తో పందెం బరిలోకి వస్తారు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..