శుభ గ్రహాల బలం.. ఆ రాశులకు ఆకస్మిక ధన లాభాలు, కలలో కూడా ఊహించని..

Shubh Yogas: మే 31 తర్వాత కొన్ని రాశులకు ఐదు లేదా ఆరు గ్రహాల అనుకూల సంచారం ఉంటుంది. ఇది విపరీత రాజయోగాలు, ఆకస్మిక ఆర్థిక లాభాలు, ఉద్యోగ అవకాశాలు, వివాహ యోగాలు మొదలైన శుభ పరిణామాలకు దారితీస్తుంది. ఈ అనుకూల కాలం రెండు నెలల వరకు కొనసాగుతుంది. ఏయే రాశుల వారికి ఈ అనుకూలమైన పరిస్థితి ఉంటుందో ఇక్కడ చూద్దాం..

శుభ గ్రహాల బలం.. ఆ రాశులకు ఆకస్మిక ధన లాభాలు, కలలో కూడా ఊహించని..
Telugu Astrology

Edited By: Janardhan Veluru

Updated on: May 29, 2025 | 7:33 PM

ఒక రాశికి అయిదారు గ్రహాలు అనుకూలంగా ఉండడమన్నది అరుదుగా జరుగుతుంటుంది. ఈ విధంగా ఎక్కువ గ్రహాల అనుకూలత కలిగినప్పుడు విపరీత రాజయోగాలు, ఆకస్మిక ధన లాభాలు, కలలో కూడా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటుంటాయి. మే 31 తర్వాత నుంచి ఈ విధంగా అయిదారు గ్రహాల అనుకూల సంచారం వల్ల మేషం, వృషభం, తుల, ధనుస్సు, మకరం, మీన రాశులకు తప్పకుండా కొన్ని శుభ యోగాలు పట్టే అవకాశం ఉంది. అధికార యోగం, ధన యోగం, విదేశీయానం, ఉద్యోగం, సంపన్న కుటుంబంలో పెళ్లి, ప్రేమ వ్యవహారాల్లో విజయం వంటివి జరిగే అవకాశం ఉంది. ఈ అనుకూల సమయం దాదాపు రెండు నెలల వరకూ కొనసాగే సూచనలున్నాయి.

  1. మేషం: ఈ రాశివారికి రాశ్యధిపతి కుజుడు చతుర్థ, పంచమ స్థానాల్లో సంచారం చేయడం, రాహువు, శుక్రుడు, రవి, బుధుడు, గురువు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏలిన్నాటి శని దోషం తగ్గిపోతుంది. వృత్తి, ఉద్యోగాలతో పాటు ఆర్థికంగా కూడా ఉచ్ఛ స్థితికి చేరుకునే అవకాశం ఉంది. అనేక విధాలుగా సంపద పెరుగుతుంది. ఏ కార్యం తలపెట్టినా సఫలమవుతుంది. సంతాన యోగం కలుగుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.
  2. వృషభం: ఈ రాశివారికి రాశ్యధిపతి శుక్రుడితో సహా అయిదు గ్రహాలు అనుకూలంగా సంచారం చేయడం వల్ల ఆడింది ఆటగా పాడింది పాటగా జీవితం సాగిపోతుంది. అనేక విధాలుగా ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంది. రావలసిన డబ్బు అందడంతో పాటు ఆస్తి కలిసి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు, జీతభత్యాల వృద్ధికి అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వినడం జరుగుతుంది.
  3. తుల: ఈ రాశివారికి రాశ్యధిపతి శుక్రుడితో సహా అయిదు గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల రాజ యోగాలు, ధన యోగాలు కలుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కలతో పాటు సొంత ఇంటి కల కూడా సాకారం అవుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో జీత భత్యాలు, అదనపు రాబడి బాగా పెరుగుతుంది. సంపన్నులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
  4. ధనుస్సు: రాశ్యధిపతి గురువు సప్తమ స్థానంలో సంచారం చేయడం, రవి, కుజ, బుధ, రాహువులు బాగా అనుకూలంగా మారడం వల్ల మరో రెండు నెలల పాటు వీరి జీవితం నల్లేరు మీద బండిలా సాగి పోతుంది. ఈ రాశివారికి మహా భాగ్య యోగం పట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతికి, జీతభత్యాలు బాగా పెరగడానికి అవకాశం ఉంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి.
  5. మకరం: ఈ రాశివారికి రాశ్యధిపతి శనితో పాటు ఆరు గ్రహాల అనుకూలత వల్ల ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరడంతో పాటు ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులను పొందే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు ధన వర్షం కురిపిస్తాయి. సంపన్నులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.
  6. మీనం: ఈ రాశివారికి రాశ్యధిపతి గురువు చతుర్థంలో ఉండడంతో పాటు, రవి, కుజ, బుధ, శుక్ర, కేతు గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల ఏలిన్నాటి శని ప్రభావం తగ్గడంతోపాటు రాజ యోగాలు పట్టే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆస్తి లాభం కలుగుతుంది. ఆస్తి పాస్తుల విలువ పెరుగుతుంది. సొంత ఇల్లు అమరుతుంది. సిరిసంపదలు బాగా వృద్ది చెందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు కలుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి.