
ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల గల్లంతు పంచాయతీ కొనసాగుతుంది.. సుమారు ఆరు నెలలుగా తెలుగుదేశం పార్టీతో పాటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాకు ఫిర్యాదులు చేస్తున్నారు. తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేస్తున్నారంటూ రెండు పార్టీలు ఎవరికి వారు ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు రెండు నెలల క్రితమే రెండు పార్టీల నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదులు చేసాయి. అయితే రాజకీయ పార్టీల నుంచి వస్తున్న ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కూడా చర్యలు తీసుకుంటున్నారు. బోగస్ ఓట్లు, ఒకే డోర్ నెంబర్‌తో వందలాది ఓట్లు ఉండటం, మనుషులు లేకున్నా ఓటర్ ఐడీలు ఇస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధారాలతో సహా సీఈవోకు సమర్పించారు.
మరోవైపు ఉరవకొండ,పర్చూరు నియోజకవర్గాల్లో ఓట్ల నమోదు,తొలగింపులో అక్రమాలు జరిగాయంటూ పలువురు అధికారులపై కూడా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. దీంతో పాటు గత నెల 21 వరకూ ఇంటింటి ఓటర్ సర్వే కూడా నిర్వహించింది. ప్రతి ఇంటికి వెళ్లిన బూత్ లెవల్ ఆఫీసర్లు ఆయా ఇళ్లలోని ఓటర్లను వెరిఫై చేసారు. ఎవరికైనా ఓట్లు తొలగించినట్లయితే నమోదు చేసేలా కూడా అవకాశం కల్పించారు. ఇలా డోర్ టు డోర్ వెరిఫై చేసిన తర్వాత ఇటీవల డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను విడుదల చేసారు సీఈవో ముకేష్ కుమార్ మీనా. గత నెల 27న విడుదల చేసిన డ్రాఫ్ట్ జాబితాపై తాజాగా మళ్లీ తీవ్ర వివాదం మొదలైంది. టీడీపీ-వైసీపీ మధ్య ఆరోపణలు, మాటల యుద్దం మొదలైంది. దీంతో ఓట్ల పంచాయతీ ఇప్పుడే తెగేలా కనబడటం లేదు.
రాష్ట్రంలో నకిలీ ఓట్ల పంచాయతీ కొంతకాలంగా రాజకీయంగా వేడి రగిల్చింది. వచ్చే ఎన్నికల్లో లక్షల ఓట్లు తొలగించేస్తున్నారంటూ పార్టీల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. గత నెలలో డోర్ టు డోర్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత అక్టోబర్ 27వ తేదీన ముసాయిదా ఓటర్ జాబితా విడుదల చేసింది ఎన్నికల కమిషన్. ఈ జాబితాపై టీడీపీ-వైసీపీల మధ్య రచ్చ మొదలైంది. జిల్లాల వారీగా ఓటర్ జాబితాలను తనికీలు చేసుకున్న ఆయా పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో పార్టీ ప్రతినిధుల బృందం తాజాగా మరోసారి సీఈవో మీనాను కలిసిన ఓట్ల గల్లంతుపై ఫిర్యాదు చేసింది. అటు వైసీపీ నేతలు కూడా పలు జిల్లాల్లో ఎన్నికల అధికారులను కలిసి ఫిర్యాదులు చేస్తున్నారు. డ్రాఫ్ట్ ఓటర్ జాబితా ద్వారా ఓటర్లను వారి ఇళ్లకు సమీపంలోని పోలింగ్ స్టేషన్లకు మార్చడం, భార్యాభర్తలకు ఒకే పోలింగ్ స్టేషన్ లో ఓటు వేసే అవకాశం కల్పించడం వంటి మార్పులు చేస్తామని ఈసీ ప్రకటించింది.
తాజాగా ఈసీ డ్రాఫ్ట్ లిస్ట్ పై అనేక ఆరోపణలు గుప్పిస్తుంది తెలుగుదేశం పార్టీ. డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ నిండా అవకతవకలే అంటున్నారు ఆ పార్టీ నేతలు. అనేక నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్ ల వారీగా ఓటర్ల వివరాలు లేవంటున్నారు. ఒక్కో బూత్ కు ఇన్ని ఓట్లు తొలగించాలనే లక్ష్యంతో వాలంటీర్లు, అధికారులు పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి అనిల్ తో పాటు పలువురు వైసీపీ నేతలకు రెండు మూడు చోట్ల ఓట్లు ఉన్నాయని చెబుతున్నారు. టీడీపీకి పోలయ్యే ఓట్లు.. న్యూట్రల్ ఓట్లు తొలగించడానికి తాడేపల్లి ప్యాలెస్‌లో ఒక పెద్ద బృందమే పనిచేస్తోందని టీడీపీ ఆరోపణ చేస్తోంది. కొన్నిచోట్ల కలెక్టర్లే వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని అంటున్నారు.
డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ప్రకారం రాష్ట్రంలో 4కోట్ల పైచిలుకు ఓట్లుంటే.. వాటిలో 15 లక్షల ఓట్లు యాడ్ చేస్తే.. 13 లక్షలు తొలగించడం సరికాదంటున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఓ చెట్టుకు కూడా ఓటు హక్కు ఇచ్చారని టీడీపీ నేతలు ఆధారాలు చూపించారు. అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం టీడీపీ ఆరోపణలను తిప్పికొడుతుంది. అసలు టీడీపీ నాయకులే గత ఎన్నికల్లో లక్షలాది దొంగ ఓట్లు సృష్టించారని చెప్పుకొస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి భారీగా ఓట్లను మార్చేసారని ఆరోపిస్తున్నారు. విజయవాడలో ఓ కార్పొరేటర్ కు రెండు చోట్ల ఓటు హక్కు ఉండటంపైనా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసారు. అటు టీడీపీ,ఇటు వైసీపీ కూడా ఆధారాలతో సహా ఓట్ల తొలగింపుపై ఫిర్యాదులు చేస్తుండటం తీవ్ర చర్చగా మారింది.
ఎన్నికలకు మరో ఐదు నెలలు మాత్రమే గడువు ఉన్న సమయంలో ఓట్ల తొలగింపు పై రోజుకో ఫిర్యాదు రావడం అటు ఈసీతో పాటు ఇటు పార్టీల్లో కూడా ఆందోళన మొదలైంది. రెండు ప్రధాన పార్టీలు తమ సానుభూతిపరుల ఓట్లు తొలగించేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫారం -7 ద్వారా ఓట్లను భారీగా తొలగించేయడం పట్ల చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి మొదలైంది. వచ్చే జనవరి 5 వ తేదీన తుది ఓటర్ జాబితాను విడుదల చేయనుంది ఈసీ. డిసెంబర్ 9 వ తేదీ వరకూ కొత్తగా ఓటు నమోదుకు అవకాశం కల్పించింది. దీంతో అప్పటిలోగా ఓట్లు కోల్పోయిన వారి చేత కొత్తగా ఓటు నమోదు చేయించేలా పార్టీలు ముందుకెళ్తున్నాయి. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసుందుకు కూడా సిద్దమవుతుంది టీడీపీ. దీంతో నకిలీ ఓట్ల అంశం కొత్త తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోెసం ఇక్కడ క్లిక్ చేయండి..