Vijayawada: “పోయిన బైక్‌ గురించి పట్టించుకోలేదు.. కొత్త బైక్ కొంటే ఫైన్ వేస్తారా..?”

బైక్ పోయిందని ఫిర్యాదు ఇచ్చిన పట్టించుకోలేదు. కొత్త బైక్ కొంటే ఫైన్లు రాస్తున్నారు. ఈ అన్యాయంపై ఓ యువకుడు విజయవాడ సీపీ ఆఫీస్ ఎదుటే వినూత్న నిరసన చేపట్టాడు. ఇప్పుడు ఆ సంఘటన నగరంలో చర్చనియాంశమైంది. పూర్తి వివరాలు కథనంలో ...

Vijayawada: పోయిన బైక్‌ గురించి పట్టించుకోలేదు.. కొత్త బైక్ కొంటే ఫైన్ వేస్తారా..?
Youth Protest

Edited By:

Updated on: Feb 08, 2026 | 12:19 PM

బెజవాడలో ఓ యువకుడు నడి రోడ్డుపై నిరసనకు దిగాడు. ట్రాఫిక్‌ పోలీసుల తీరుని ప్రశ్నిస్తూ ఓ ప్లకార్డుతో రోడ్డుపైనే బైఠాయించాడు. దీనికి కారణం పోలీసులు అతని టూవీలర్‌పై చలాన్‌ రాయడం.. అసలే ఒక బైక్‌ పోగొట్టుకుని ఆ కేసు తేలక ఫ్రస్ట్రేషన్‌లో ఉంటే.. ఇప్పుడు ఇలా కొత్త కేసు రాయడంఏంటనేది ఆ యువకుడి ప్రశ్న. 3 ఏళ్ల కిందట ఈ యువకుడి బైక్‌ పోయిందట. అప్పుడే పోలీసులకు కంప్లైంట్‌ ఇచ్చాడట. 3 ఏళ్లుగా ఆ కేసు ఏమైందని స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నా తనకు న్యాయం జరగడం లేదంటున్నాడు.  పాత బైక్‌ దొరకదని అర్థమై ఇటీవలే కొత్త బైక్ కొనుక్కుని ఇలా రోడ్డుపైకి వచ్చాడో లేదో పోలీసులు అలా చిన్న కేసు రాశారట. దీంతో.. ఈ యువకుడికి చిర్రెత్తుకొచ్చింది.

బైక్‌ పోయిందంటూ పెట్టిన పాత కేసులో న్యాయం చెయ్యండి.. లేదా ఇప్పుడు పెట్టిన కేసు తీసెయ్యండి అంటూ అతను రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపాడు. బైక్‌ పోయిందని చెప్తే పట్టించుకోని పోలీసులకు ఇప్పుడు కేసులు రాసే అధికారం ఎక్కడిదని అతను ప్రశ్నిస్తున్నాడు. CP ఆఫీస్‌ ముందే యువకుడు రోడ్డుపై నిరసనకు దిగడంతో సూర్యారావుపేట పోలీసులు అతనికి కాసేపు నచ్చ చెప్పాలని చూశారు. మాట వినకపోయేసరికి బలవంతంగా అతన్ని స్టేషన్‌లోకి తీసుకెళ్లారు. ఎంత చెప్పినా మాట వినకుండా న్యూసెన్స్‌ చేశాడంటూ ఇప్పుడు ఇతనిపై ఇంకో కేసు పెడతారో ఏమో తెలియదు కానీ.. ఇతను చేసిన నిరసన మాత్రం చర్చనీయాంశమైంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.