
బాపట్ల జిల్లా రేపల్లేకు చెందిన ఆనంద్ గుంటూరుకు వచ్చి నివసిస్తున్నాడు. నగరంలోని ఓ మిఠాయి దుకాణంలో పనిచేస్తున్నాడు. అదే దుకాణంలో పనిచేసే మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఆమె ఫోన్ నంబర్ తీసుకొని ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు.. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చాడు. అయితే ఆమె తనకు ఇష్టం లేదని చెప్పినా వినిపించుకోకుండా వెంబడించాడు. ఈ క్రమంలోనే ఒక రోజు ఆమెను తనతో పాటు దేవాపురంలోని తన రూంకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత కూడా ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.
అయితే, బాలికను పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చిన ఆనంద్ ఈ నెల ఏడో తేదిన ఆమెను బెదిరించి ఒంగోలు తీసుకెళ్లాడు. అక్కడ ఆంజనేయ స్వామి దేవాలయానికి తీసుకెళ్లి మెడలో మూడు ముళ్లు వేశాడు. పెళ్లి చేసుకున్నానని చెప్పి ఆమెను ఒంగోలు నుండి రేపల్లేలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. బాలిక కనిపించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి బాలిక ఆచూకీ కోసం గాలించడం మొదలు పెట్టారు. అయితే రేపల్లేలోని ఆనంద్ ఇంటి నుండి ఈ నెల 9 తేదిన బాలిక బయట పడి గుంటూరులోని ఇంటికి చేరింది.
రెండు రోజుల పాటు ఎక్కడికెళ్లావంటూ తల్లిదండ్రులు ప్రశ్నించడంతో ఆనంద్ పెళ్లి చేసుకున్న విషయాన్ని చెప్పేసింది. దీంతో బాలికను తీసుకొని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ వెళ్లారు. మైనర్ బాలికను లైంగికంగా బెదిరించడమే కాకుండా పెళ్లి చేసుకున్నందుకు ఆనంద్ పై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకున్నా చట్టపరమైన చర్యలు తప్పవని డిఎస్పీ మధుసూదనరావు అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..