Andhra Pradesh: లోన్ తీసుకోవడమే శాపమైంది.. ఒకటి రెండు కాదు వందలాది ఫోన్లు.. చివరకు ఏం చెయ్యాలో తెలియక..
ఒకటి.. రెండు కాదు.. ఏకంగా యాభై నుంచి వంద ఫోన్లు.. ఎక్కడున్నావంటూ ప్రశ్నలు.. లోన్ చెల్లించాలంటూ బెదిరింపులు.. ఇలా రాత్రి వేళ నిద్ర పోయేటప్పుడు తప్ప మిగిలిన సమయంతా ఫోన్ కాల్స్ తో వేధింపులు.. చివరకు వేధింపులు తాళలేక యువకుడు దారుణ నిర్ణయం తీసుకున్నాడు.. పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఒకటి.. రెండు కాదు.. ఏకంగా యాభై నుంచి వంద ఫోన్లు.. ఎక్కడున్నావంటూ ప్రశ్నలు.. లోన్ చెల్లించాలంటూ బెదిరింపులు.. ఇలా రాత్రి వేళ నిద్ర పోయేటప్పుడు తప్ప మిగిలిన సమయంతా ఫోన్ కాల్స్ తో వేధింపులు.. చివరకు వేధింపులు తాళలేక యువకుడు దారుణ నిర్ణయం తీసుకున్నాడు.. పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన ఏపీలోని పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా దాచేపల్లికి చెందిన అజయ్ కుమార్ మెడికల్ షాపులో పనిచేస్తున్నాడు. ఇంకా వివాహం కాలేదు. అయితే ఏడాది క్రితం విజయవాడకు చెందిన ప్రైవేటు బ్యాంక్ లో ఏడు లక్షల రూపాయల రుణం తీసుకున్నాడు. అప్పటి నుంచి ఇన్‌స్టాల్‌మెంట్స్ చెల్లిస్తూ వస్తున్నాడు. అయితే, గత నవంబర్‌లో కూడా ఇన్ స్టాల్ మెంట్ చెల్లించిన యువకుడు.. డిసెంబర్‌లో కట్టాల్సిన ఇన్‌స్టాల్‌మెంట్ మాత్రం చెల్లించలేకపోయాడు. దీంతో లోన్ చెల్లించాలంటూ రికవరీ ఏజెంట్స్ వేధించడం మొదలు పెట్టారు.
ఈ నెల ఇన్‌స్టాల్‌మెంట్ కూడా పెండింగ్‌లో ఉండటంతో వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ప్రతి రోజూ యాభైకి పైగా ఫోన్ కాల్స్ చేస్తున్న ఏజెంట్లు వెంటనే ఇన్‌స్టాల్‌మెంట్స్ చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా అసభ్యకరంగా కూడా మాట్లాడుతున్నారు. దీంతో వారి వేధింపులు తాళలేక ఆ యువకుడు మనస్థాపానికి గురయ్యాడు. డబ్బులు చెల్లించలేక, వేధింపులు తట్టుకోలేక తనువు చాలించాలనుకున్నాడు. వెంటనే పురుగు మందు తెచ్చుకున్నాడు. ఈ రోజు ఉదయం ఇంటిలో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగాడు.
అయితే, ఇంట్లో వాళ్లకు ఈ విషయం తెలియలేదు.. ఇంటిలో కొడుకు నిద్ర పోతున్నాడనుకున్న తల్లి కొంతసేపటి తర్వాత అనుమానం వచ్చి చూడగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో ఆ యువకుడిని వెంటనే ఆసపత్రికి తరలించారు. యువకుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు.
చేతికొచ్చిన కొడుకు మరణించడంతో తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. అప్పు ఉన్నా.. కొడుకు ఆత్మహత్య చేసుకుంటాడని ఊహించలేకపోయామని..బంధువులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యువకుడి ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..