ఆర్టీసీ బస్సులో ఓ యువకుడు ఉన్మాదిలా ప్రవర్తించాడు. తోటి ప్రయాణికులపై కారం చల్లి తీవ్ర గందరగోళం సృష్టించాడు. ఈ హఠాత్పరిణామానికి కంగుతిన్న ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కారం ఘాటుకు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. బస్సులో అసలు ఏం జరుగుతుందో తెలియక తికమకపడ్డారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం ఆయోధ్యలంకకు చెందిన ఉండాల రాంబాబు అనే యువకుడు దుబాయి వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లాడు. అయితే పాస్‌పోర్టు, వీసా వివరాలు సరిగా లేకపోవడంతో ఎయిర్‌పోర్టు అధికారులు అతన్ని వెనక్కి పంపారు. దీంతో తిరుగు ప్రయాణంలో అతను హైదరాబాద్ నుంచి రాజోలు వెళ్తున్న ఆర్టీసీ ఇంద్ర బస్సులో స్వగ్రామానికి బయల్దేరాడు. పాలకొల్లు పట్టణం సమీపంలోకి బస్సు రాగానే ఉన్మాదిలా మారిపోయాడు. గల్ఫ్ వెళ్ళడానికి తీసుకెళ్లిన 2కేజీలు కారం బ్యాగ్‌లో ఉండటంతో 18మంది ప్రయాణికులు, చిన్న పిల్లలపై దానిని చల్లాడు. దీంతో వారందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
కాగా ఇదే సమయంలో రాంబాబు తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే ప్రయాణికులు పట్టుకొని పాలకొల్లు బస్ స్టేషన్ లో పోలీసులకు అప్పగించారు. శంషాబాద్ విమానాశ్రయం అధికారులు పాస్‌పోర్టు సరిగాలేదని వెనక్కి పంపారని తీవ్ర నిరాశకు గురైన రాంబాబు ప్రయాణికులపై కారం చల్లాడని పోలీసులు తెలిపారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..