పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఓ యువకుడి సాహసం ఇద్దరి ప్రాణాలు నిలబెట్టింది. నీళ్లలో మునిగిపోతున్న తండ్రీ కూతుళ్లను సాయిబాబా అనే యువకుడు ఎంతో ధైర్యం చేసి కాపాడాడు. తణుకు షుగర్ ఫ్యాక్టరీ దగ్గర్లో ఓ కారు ప్రమాదవశాత్తూ కాల్వలోకి దూసుకెళ్లింది. ఏం జరిగిందో కారులో ఉన్నవాళ్లకు అర్థమై బయటకు వచ్చే ప్రయత్నం చేసేలోపే నీళ్లు ముంచెత్తాయ్. చుట్టుపక్కల వాళ్లు ప్రమాదం చూసి కేకలు వేయడంతో అక్కడకు చేరుకున్న సాయిబాబా అనే యువకుడు క్షణం ఆలోచించకుండా నీళ్లలోకి దూసేశాడు.. కారులో ఇరుక్కున్న తండ్రీ కూతుళ్లను కాపాడాడు. సమయ స్ఫూర్తితో వ్యవహరించి.. కారు అద్దాలు పగలగొట్టి.. అక్కడకు వచ్చిన మిగతా వారితో కలిసి ఇద్దరినీ ఒడ్డుకు చేర్చాడు. వీళ్లు సేఫ్‌గా బయటకు వచ్చేప్పటికి కారు పూర్తిగా నీళ్లలో మునిగిపోయింది. ప్రమాద సమయంలో కారులో ఉన్న ఇద్దరూ క్షేమంగా బయటకు రావడంతో అక్కడున్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తే సాయిబాబా.. ఈ రియల్ హీరో ఇప్పుడు ఇద్దరి ప్రాణాలు కాపాడాడు. కారు నీళ్లలోకి దూసుకెళ్ళాక డోర్లు లాక్ అయిపోయాయి.. లోపల ఉన్న వాళ్లు సాయం కోసం కేకలు వేస్తుంటే వెంటనే వాళ్లను రక్షించేందుకు రంగంలోకి దిగిపోయాడు. అద్దాలు పగలగొట్టి ముందుగా తండ్రిని, తర్వాత ఆ యువతిని కాపాడాడు.