
ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనుల వద్ద సొరకాయ బుర్రలు ఎక్కువగా కనిపిస్తాయి. సొరకాయ బుర్రలో నీటిని పోస్తే కొద్దిసేపట్లోనే నీరు చల్లబడతుందని స్థానికులు చెబుతున్నారు. వేసవిలో చల్లటి నీటి కోసమే కాదు కల్లు తాగేందుకు కూడా ఆనప బుర్రనే ఎక్కువగా వినియోగిస్తారు. సొర బుర్ర ఎలా తయారు చేస్తారంటే.. బాగా ముదిరి ఎండిన సొరకాయ బుర్రను “డోకు”గా గిరిజనులు వాడతారు. మైదాన ప్రాంతాల్లో సొరకాయలను కూర , సాంబార్ తో పాటు పలు ఆహార పదార్థాల తయారీలో వాడతారు. ఇవి గుండ్రంగాను, పొడవుగాను ఉంటాయి. ఐతే ఏజెన్సీలో కనిపించే సొర కాయలు వీటికి భిన్నంగా ఉంటాయి. ఈ సొరకాయ బుర్రను గిరిజనులు ప్రత్యేకంగా చూస్తారు. కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియల సమయంలో కుండతో పాటు సొరకాయ బుర్రను పగలగొట్టి మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటారు. అందుకే ఏజెన్సీ ప్రాంతంలోని ప్రతి గిరిజన కుటుంబంలో సొరకాయ బుర్రలు కనిపించడం సర్వసాధారణం.
సొరకాయ బుర్రలు సంగీతం పలుకుతాయి. వీణల తయారీకి కూడా సొరకాయని వాడతారు. దీని తయారీకి ముదురు సొరకాయ ఎంపిక చేసుకుంటారు. దీన్ని కోసిన తర్వాత రెండు నెలలు ఆరబెడతారు. బుర్రకు బీటలు పడకుండా దానిలో గుజ్జు తొలగిస్తారు. బీటలు పడితే నాదం పలకదు. బుర్ర ఎండిన తర్వాత గింజలు తీసి వెదురు బొంగు కర్రను సొరకాయ బుర్రకు అమర్చి మూడు ఇనుప తీగలు కడతారు. ఆ తీగలు వివిధ నాదాలు చేయడానికి వీలుగా మామిడి కలపతో తయారు చేసిన చెక్కను వెదురు బొంగు కర్రకు బిగిస్తారు. ఇలా సొరకాయ బుర్రతో తమ వాయిద్యాన్ని తామే తయారు చేసుకునే కుటుంబాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఆదివాసీ సంప్రదాయం, ఆచారాల్లో సొర బుర్ర ఒక భాగంగా ఎప్పటినుంచో కనిపిస్తుంది.
వేసవి వచ్చిందంటే ఆదివాసీల వద్ద ఆనప (సొరకాయ) బుర్ర ఉండాల్సిందే. ఇది వారికి కదిలే ఫ్రిజ్ వంటిది. వేసవిలో సొరకాయ బుర్రలో నీరు నింపుకొని చల్లబడిన తర్వాత తాగుతారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే కొందరు అధికారులు సైతం సొరకాయ బుర్రలోని మంచి నీటినే తాగుతారు. వారు ఎక్కడికి పర్యటించినా వారి వాహనంలో ఆనప బుర్ర కూడా ఉండేది . వీటిలో ఔషధ గుణాలు మెండుగా వుంటాయని చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..