Yanamala vs Buggana: మాజీ ఆర్థికమంత్రిగా ఉండి ప్రజలను తప్పుదోవ పట్టించడం దుర్మార్గం.. యనమలకు బుగ్గన కౌంటర్

యనమల వర్సెస్‌ బుగ్గన. ఇద్దరి మధ్య లేఖల యుద్ధం నడుస్తోంది. అప్పులు, దాని లెక్కలు. ఏపీలో నడిచేదంతా ఇదే కథ.

Yanamala vs Buggana: మాజీ ఆర్థికమంత్రిగా ఉండి ప్రజలను తప్పుదోవ పట్టించడం దుర్మార్గం.. యనమలకు బుగ్గన కౌంటర్
Yanamala Buggana

Updated on: Sep 17, 2021 | 9:05 PM

Yanamala vs Buggana: యనమల వర్సెస్‌ బుగ్గన. ఇద్దరి మధ్య లేఖల యుద్ధం నడుస్తోంది. అప్పులు, దాని లెక్కలు. ఏపీలో నడిచేదంతా ఇదే కథ. ఇది కథకాదని టీడీపీ వారంటారు. మీ కథలు నమ్మడానికి ఎవరూ లేరని వైసీపీ నేతలంటున్నారు. మాజీ ఆర్థిక మంత్రి యనమల విడుదల చేసిన లెక్కలకు తాజాగా కౌంటర్‌ గణాంకాలు విడుదల చేశారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌. కరోనా సంవత్సరాన్ని కలిపి లెక్కలు గట్టి ఆర్థిక వృద్ధి కాలేదని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.

కరోనాకు ముందు ఏడాది 2019-20లో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 7.23 శాతం వృద్ధి ఉన్నట్లు కొత్త చిట్టా విడుదల చేశారు. వ్యవసాయ రంగంలో 7.91 శాతం ; పారిశ్రామిక రంగంలో 10.24 శాతం వృద్ధి నమోదైందని చెప్పారు. 2020 – 21 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ఇండెక్సులో ఏపీకి 3వ ర్యాంకు వచ్చినట్లు గుర్తు చేశారు. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం పేదరిక నిర్మూలన, అసమానతల తగ్గింపులో 5, 6 స్థానాల్లో నిలిచామన్నారు. తప్పుడు లెక్కలతో యనమల ప్రజలను బురిడీ కొట్టించలేరంటూ ఘాటుగా స్పందించారు బుగ్గన.

బాధ్యత లేని ప్రతిపక్షంగా టీడీపీ వ్యవహరిస్తోందన్నారు బుగ్గన. మాజీ ఆర్థికమంత్రిగా ఉండి ప్రజలను తప్పుదోవ పట్టించడం దుర్మార్గమన్నారు. గత టీడీపీ ప్రభుత్వం దిగిపోయే సమయానికి రాష్ట్ర GSDP కూడా క్షీణిస్తూ వచ్చిందన్నారు. టీడీపీ చూపించిన నిరుద్యోగ రేటుపైనా ఆయన మండిపడ్డారు. యనమల పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఏ లెక్కల ప్రకారం నిరుద్యోగ రేటు 6.5శాతమో చెప్పాలన్నారు. 2018-19లో 5.7శాతమున్న నిరుద్యోగ రేటు.. 2019-20 కల్లా 5.1శాతానికి దిగొచ్చిందన్నారు. వైసీపీ రెండున్నరేళ్ల పాలనలో అప్పులే తప్ప అభివృద్ధి లేదని విమర్శించారు యనమల. వృద్ధిరేటు పడిపోయిందన్నారు.. దీనికి కౌంటర్‌గానే లెక్కలతో సహా వివరాలు వెల్లడించారు బుగ్గన.

Read also: Char Dham Yatra: స్టే ఎత్తివేత, మరికొన్ని గంటల్లో చార్ ధామ్ యాత్ర.. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ