
ప్రముఖ శైవ క్షేత్రం, బనగానపల్లె మండలంలోని యాగంటి శ్రీ ఉమా మహేశ్వర స్వామి క్షేత్రం కార్తీక మాసం పురస్కరించుకొని మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల అక్టోబరు 22 నుంచి నవంబరు 20వ తేదీ వరకు కార్తీక మాసం ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. నవంబరు 3, 10, 17 తేదీలలో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. నవంబరు 5న వచ్చే కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో అత్యంత వైభవంగా లక్ష దీపోత్సవం నిర్వహించనున్నారు.
యాగంటి ఆలయం అనేక విశిష్టతలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న నంది విగ్రహం కాలక్రమేణా పెరుగుతూనే ఉంటుందని భక్తులు బలంగా నమ్ముతారు. ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య రాజు హరిహర బుక్కరాయలు నిర్మించారు. ఇక్కడ శివుడిని విగ్రహ రూపంలో పూజిస్తారు. ఈ క్షేత్రం అగస్త్య మహర్షి ఆలయ నిర్మాణ కథకు కూడా ప్రసిద్ధి చెందింది.
ఈ కార్తీక మహోత్సవాల ఏర్పాట్లపై ఆలయ ఈవో పాండురంగా రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారని, రాష్ట్ర నలుమూలల నుంచి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి, భక్తులు సంతోషంగా తిరిగి వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించినట్లు ఆయన వివరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..