Andhra Pradesh: భర్త అన్న ఒక్క మాటకే ఉసురు తీసుకున్న మహిళా గ్రామ వాలంటీర్.. ఆ మాట ఏంటంటే..?
ఒకే ఒక్క మాట.. మనస్థాపం చెందిందామె. అంతే బ్రిడ్జి మీద నుంచి దూకేసింది. ఇంతకీ ఆ భర్త ఏమన్నాడు? ఆ భార్య మనసెందుకు బాధ పడింది?
Konaseema district : కోనసీమ జిల్లా మామిడికుదురు(Mamidikududru) మండలంలో నివశించే మురళీకృష్ణ- తులసీ దుర్గలది అన్యోన్య దాంపత్యం.. ఇద్దరిదీ అరమరికల్లేని కాపురం. భార్య తులసి మహిళా వాలంటీర్ గా పని చేస్తోంది.. అయితే ఈమె ఆదివారం అయితే చాలు చర్చికి వెళ్తుంది. దైవ ప్రార్ధనలు చేస్తుంది. ఎప్పటిలాగానే ఈ ఆదివారం కూడా చర్చికి వెళ్లాలనుకుంది. భర్తను కూడా చర్చికి రమ్మని పిలిచింది.కానీ అతడు ససేమిరా అన్నాడు. నాకు వేరే పన్లున్నాయ్.. నువ్వు కావాలంటే వెళ్లు అన్నాడు. ఇక్కడే తీవ్ర మనస్థాపం చెందింది తులసీ దుర్గ. నువ్వు రాకుంటే నేను చచ్చిపోతా అంటూ బెదిరించింది. అంతా ఉట్టిదే అనుకున్నాడు. అలా చేయదులే అనుకున్నాడా భర్త. భర్త తన మాటలు నమ్మడం లేదని గుర్తించిన తులసి బైక్ మీద పాశర్లపూడి బ్రిడ్జి(pasarlapudi bridge) దగ్గరకు వచ్చింది. ఆవేశంతో బ్రిడ్జి మీద నుంచి కిందకు దూకేసింది. అప్పటికీ ఏపీ టూరిజం సిబ్బంది ప్రాణాలకు తెగించి ఆమెను ఒడ్డుకు తీసుకురాగలిగారు. కానీ తులసీ దుర్గ ప్రాణాలు దక్కలేదు. తన భార్య ఇంత పని చేస్తుందని అస్సలు ఊహించలేదనీ.. ఆమె మృతదేహంపై పడి.. బోరున విలపిస్తున్నాడు భర్త మురళీ కృష్ణ. అయితే ఇది కేవలం చర్చికి రాకపోవడం వల్ల వచ్చిన మనస్థాపమా? లేక మరేదైనా కారణం ఉండొచ్చా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఏది ఏమైనా భార్య ఆకస్మిక మరణంతో మురళీకృష్ణ రోదన చూసి ఆ చుట్టుపక్కల వారంతా చలించిపోయారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..