పెళ్లి చేసుకుంటావా అని సరదాగా అడిగినందుకు ఇద్దరు మైనర్లు ఏకంగా ఓ మహిళ ప్రాణాలు తీశారు. కడప జిల్లాలో జరిగిన ఈ దారుణం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లా పెద్దకుడాల గ్రామానికి చెందిన నాగమ్మకు ఇరవై ఏళ్ల క్రితం బక్కన్నగారి పల్లెకు చెందిన వ్యక్తితో పెళ్లైంది. విభేదాలు రావడంతో రెండు నెలలకే భర్తను వదిలేసింది. ఆ తర్వాత సింహాద్రిపురం మండలం, బిదినం చేర్లకు చెందిన మరో వ్యక్తికిచ్చి తల్లిదండ్రులు పెళ్లి చేశారు. 9ఏళ్ల తర్వాత రెండో భర్తను కూడా ఆమె వదిలేసి పుట్టింటికి వచ్చింది. స్థానికంగా మేకలు మేపుకుంటూ జీవనం సాగిస్తోంది.
అయితే ఇటీవల మేకలు మేపేందుకు వెళ్లిన నాగమ్మ గుట్టల్లో శవంగా కనిపించింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టాగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.పెద్దకుడాల గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్లతో నాగమ్మ సరదాగా పెళ్లి చేసుకుంటారా అని అడిగిందట. దీంతో నాగమ్మ మాటలను సీరియస్ గా తీసుకున్న మైనర్లు గుట్టల్లోకి వెళ్లి పెళ్లి సంగతేంటని నిలదీశారు. తాను సరదాగా అన్నానని నాగమ్మ చెప్పడంతో ఆమెను కౌగిలించుకున్నారు. వెంటనే ప్రతిఘటించిన ఆమె ఇంట్లో పెద్దలకు, గ్రామస్తులకు చెప్తానని బెదిరించింది. దీంతో ఆందోళన చెందిన మైనర్లు ఆమెను రాళ్లతో కొట్టి చంపారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు జువైనల్ హోమ్‌కు తరలించారు.