
అర్ధరాత్రి హైవేపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వేగంగా దూసుకెళుతోంది. ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉన్నారు. ప్రయాణం సాఫీగా సాగుతుండగా తెల్లవారింది. కాలకృత్యాలు తీర్చుకునేందుకు బస్సు ఓ చోట ఆగింది. నిద్రలేచిన ఓ మహిళ తన వెంట తెచ్చుకున్న నగల బ్యాగు కోసం వెతికింది. అంతే… ఆమె గుండె జారిపోయింది. రూ.40 లక్షల విలువైన 300 గ్రాముల బంగారు నగలు ఉన్న చిన్న బ్యాగు కనిపించలేదు. వెంటనే బస్సు సిబ్బందిని అప్రమత్తం చేయడంతో ప్రయాణికులంతా కలిసి బస్సులో వెతికారు. కొద్దిసేపటికే డోర్ వద్ద నగల బ్యాగు కనిపించింది. కానీ బ్యాగులో ఉండాల్సిన బంగారు ఆభరణాలు మాత్రం మాయమయ్యాయి. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన మహిళ బస్సును సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లాలని కోరింది.
నెల్లూరు-ప్రకాశం జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తున్న వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న వేంపాటి రాధ అనే మహిళ నగలు చోరీకి గురయ్యాయని ఫిర్యాదు చేసింది. విజయవాడలో ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు 300 గ్రాముల బంగారు ఆభరణాలను బ్యాగులో పెట్టుకుని ఆమె ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఉలవపాడు మండలం కోవూరు సమీపానికి బస్సు చేరుకున్న సమయంలో నగలు కనిపించడం లేదని రాధ బస్సు డ్రైవర్‌కు తెలిపింది. దీంతో బస్సులో గాలించిన సిబ్బంది, అనంతరం బస్సును సమీపంలోని ప్రకాశం జిల్లా టంగుటూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ పోలీసులు బస్సులో తనిఖీలు చేపట్టారు.
బస్సులో ఎలాంటి రిజర్వేషన్ లేకుండా ఎక్కిన ఓ యువకుడిపై బాధితురాలు అనుమానం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. టికెట్ కూడా కట్ చేయకుండా, కేవలం డబ్బులు తీసుకుని ఖాళీగా ఉన్న సీటులో అతడిని కూర్చోబెట్టారని ఆమె ఆరోపించింది. అర్ధరాత్రి తమపై మత్తు కలిగించే స్ప్రే చేసి, తాము నిద్రలో ఉండగానే నగలు అపహరించి ఉండవచ్చని కూడా ఆమె అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం.
బస్సులో సీసీ కెమెరాలు ఉంటే నిందితుడిని సులభంగా గుర్తించే అవకాశం ఉండేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనలో బస్సు సిబ్బందికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? రిజర్వేషన్ లేకుండా ప్రయాణికుడిని ఎందుకు ఎక్కించుకున్నారు? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.