అనంతపురం జిల్లా గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన అరుదైన ఘటన ఇది. 5.8 కేజీల బరువున్న బాలుడికి జన్మనిచ్చిందో మహిళ. అది కూడా సహజ ప్రసవం కావడంతో ఆ కుటుంబసభ్యుల ఆనందం మాటల్లో చెప్పలేనిది. గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రి ఓ అరుదైన ఘటనకు వేదికగా నిలిచింది. కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన తేజస్విని అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో సమీపంలోని ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె స్థితిని గమనించిన వైద్యులు గుంతకల్లు, బళ్ళారి లేదంటే కర్నూలు లాంటి సిటీల్లో ఉన్న పెద్ద ఆసుపత్రులకు తీసుకెళ్లాలని సూచించారు. వెంటనే గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. అప్పటికే పురిటి నొప్పులతో బాధపడుతున్న తేజస్వినిని పరిశీలించిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు సుజాత.. ధైర్యాన్ని చెప్పి తప్పకుండా సహజ ప్రసవం ద్వారా డెలివరీ అయ్యేలా చేస్తామన్నారు.
ఒకటిన్నర గంటపాటు నొప్పులు భరించిన ఆ గర్భిణీకి.. సహజంగానే కాన్పు జరిగింది. అయితే పిల్లాడు బాలభీముడిలాగా.. చాలా బొద్దుగా ఉన్నాడు. సహజంగా ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉండటంతో కంగారు పడ్డారు. సాధారణంగా మూడు నుంచి మూడున్నర కేజీల బరువు ఉంటారు. కానీ ఈ పిల్లాడు 5.8 కేజీల బరువుతో పుట్టాడు. దీంతో వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నట్టు తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. డాక్టర్లు వైద్య సిబ్బంది అందరూ శ్రమించి తమకు సహకారం అందించడం చాలా ఆనందంగా ఉందన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చాలా అద్భుతంగా ఉందన్నారు తేజస్విని భర్త నాగిరెడ్డి. వారి కష్టం చూసిన తమకు కన్నీళ్లు వచ్చాయన్నారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఆసుపత్రికే వచ్చి వైద్యం చేయించుకోవాలని కోరారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..