మైలవరం ఎమ్మెల్యే టీడీపీలో చేరిపోయారా..? కృష్ణ ప్రసాద్ తండ్రి కామెంట్స్ వైరల్

కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గం ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్‌ను కాదని, మైలవరం వైసీపీ ఇంఛార్జిగా తిరుపతి యాదవ్‌ను వైఎస్ జగన్ నియమించారు. దీంతో కార్యకర్తలతో సమావేశాలు జరిపి ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు వసంత కృష్ణప్రసాద్ . 

మైలవరం ఎమ్మెల్యే టీడీపీలో చేరిపోయారా..? కృష్ణ ప్రసాద్ తండ్రి కామెంట్స్ వైరల్
Vasantha Krishna Prasad

Updated on: Feb 04, 2024 | 8:08 PM

మైలవరం పాలిటిక్స్‌ గరం గరంగా మారాయి. మరో 24 గంటల్లో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ ప్రకటించారు. మరోవైపు కృష్ణప్రసాద్‌ ఇప్పటికే టీడీపీలో చేరిపోయారని ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు ప్రకటించడం కలకలం రేపుతోంది. ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తన నియోజకవర్గంలోని వేర్వేరు మండలాల అనుచరులతో వరుస సమావేశాలు జరుపుతున్నారు. నాలుగున్నరేళ్లుగా తనకు వైసీపీ సహకరించడం లేదని క్యాడర్‌ ముందు వాపోయారాయన. దీంతో ఆయన అనుచరుల్లో పలువురు వైసీపీకి రాజీనామా చేసేందుకు సంసిద్ధమయ్యారు. సోమవారం కార్యకర్తలతో సమావేశమయ్యాక భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు.

మరోవైపు ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావుతో నందిగామ జనసేన ఇన్‌ఛార్జ్‌ రమాదేవి భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు ఆమె చెప్పారు. రమాదేవితో భేటీ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తన తనయుడు కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారని నాగేశ్వరరావు చెప్పారు.

ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరతారనే ప్రచారంపై మైలవరం టీడీపీ ఇన్‌ఛార్జ్‌ దేవినేని ఉమ స్పందించారు. గతంలో తండ్రీ కొడుకులు తనను ఓడించేందుకు దుష్ప్రచారం చేశారని గుర్తు చేశారు.

మైలవరం ఇన్‌ఛార్జ్‌గా జెడ్పీటీసీ తిరుపతి రావ్‌ యాదవ్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్థానంలో వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా నియమించడంతో దుమారం రేగింది. తాజాగా వసంతకు మరో షాక్ ఇచ్చింది హైకమాండ్. మైలవరం పరిధిలో 28 మంది కో ఆపరేటివ్ సొసైటీల చైర్మన్లు, సభ్యులను ప్రభుత్వం తప్పించింది. కృష్ణప్రసాద్ వేరే పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందనే నివేదికలతో వైసీపీ ఈ పని చేసినట్లు సమాచారం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..