Vijayawada Floods: విజయవాడ మునక వెనుక బుడమేరు వాగు పాత్ర ఎంత? విజయవాడ దుస్థితికి అసలు కారణమేంటి?

విజయవాడను ముంచిన బుడమేరు.. మైలవరం కొండల్లో పుట్టిన ఒక పెద్ద వాగని చెప్పాలి. చిన్న పిల్ల కాలువల రూపంలో దీని ప్రయాణం మొదలవుతుంది. వెలగలేరు వద్ద బుడమేరుగా మారి విజయవాడ రామకృష్ణాపురం వద్ద కాలువరూపంలోకి రూపాంతరం చెంది చివరికి కొల్లేరు సరస్సులో కలుస్తుంది. మొత్తం దాదాపు 170 కిలోమీటర్ల దూరం ప్రవహించే బుడమేరులో.. ఏటా 10 వేల నుంచి 11 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది. మరి ఒక్కసారిగా దీని ప్రవాహం ఎందుకు పెరిగింది?

Vijayawada Floods: విజయవాడ మునక వెనుక బుడమేరు వాగు పాత్ర ఎంత? విజయవాడ దుస్థితికి అసలు కారణమేంటి?
Vijayawada Floods
Follow us
Gunneswara Rao

|

Updated on: Sep 03, 2024 | 9:33 PM

వర్షం, వరద తరువాత విజయవాడ పరిస్థితి దారుణంగా మారింది. కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడూ చూడనంత విషాదం. కొన్నేళ్లుగా ఎప్పుడూ ఎరుగనటువంటి కష్టం.. నష్టం. కొండచరియలు విరిగిపడి కొందరు మృతి చెందిన ఘటన.. మనసులను కలచివేస్తుంది. ప్రకృతి బీభత్సానికి, వరుణుడి ప్రకోపానికి గజగజలాడింది బెజవాడ నగరం. అసలు విజయవాడ నగరానికి ఎందుకీ పరిస్థితి వచ్చింది? భారీ వర్షానికి ఎందుకు చిగురుటాకులా వణికింది? వరద విలయంతో ఎందుకు బిక్కుబిక్కుమంటోంది? బుడమేరు వాగే కొంపముంచిందా? ఎందుకంటే.. ఇటు బుడమేరు, అటు కృష్ణా నది.. మధ్యలో బెజవాడ నగరం. దీంతో వరద మొత్తం నగరాన్ని ముంచేసింది. ఎక్కడ చూసినా నీళ్లు. ఈమధ్యకాలంలో విజయవాడ ప్రజలకు ఇలాంటి దుస్థితి ఎదురుకాలేదు. సింగ్ నగర్, వాంబే కాలనీ, మార్కండేయ దేవి నగర్.. ఇలా ఎటు చూసినా వరద నీరే దర్శనమిస్తోంది. భారీవర్షాలు, ఆపై వరదలు.. దీంతో విద్యుత్ సరఫరాపై ఇది తీవ్ర ప్రభావం చూపించింది. ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు. గంటలకొద్దీ పవర్ కట్ తో సెల్ ఫోన్ టవర్లు కూడా పని చేయలేదు. దీంతో సిగ్నల్స్ లేక, ఛార్జింగ్ లేక మొబైల్ ఫోన్లు కూడా పనిచేయకుండా పోయాయి.

Vijayawada Floods 1

Vijayawada Floods 1

కొన్ని ఏరియాల్లో మొదటి అంతస్తు వరకు నీళ్లు చేరాయి. దీంతో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నవారిని భవనాల పైకి అధికారులు తరలించారు. మరికొందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పడవల ద్వారానే ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. డ్రోన్స్ ద్వారా ఆహారం సప్లయ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. హెలికాప్టర్లు, బోట్లు, ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లు, ప్రభుత్వ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు.. విజయవాడను ఆదుకోవడానికి ఇలా అంతా రంగంలోకి దిగారు. దాదాపు 50 వేల ఇళ్లు, 3 లక్షల మంది ప్రజలు వరద గుప్పిట్లో చిక్కుకోవడంతో సహాయక చర్యలు పెద్ద ఎత్తున చేపట్టాల్సి వచ్చింది. అటు అక్షయపాత్ర, హోటల్స్ అసోసియేషన్.. ఇలా అంతా వరద బాధితులకు ఆహారం, ఇతర వస్తువులు అందించడానికి తలో చేయి వేశారు. అయినా బాధితులకు సమస్యలు తప్పలేదు. అసలు విజయవాడకు ఇంతటి దుస్థితి రావడానికి కారణమేంటి? బుడమేరు వాగేనా?

ఖమ్మం, ఎన్టీఆర్ జిల్లా సరిహద్దుల్లో ఉన్న కొండలు, గట్లు మీద నుంచి ఏర్పడే జలాశయాలు, నీటి ఊటలు, వర్షపు నీటి ద్వారా ఏర్పడిందే ఈ బుడమేరు. ఇక ఈ బుడమేరు వాగు ప్రవాహం పెరగడం వల్లే బెజవాడ.. దాదాపు గత అర్థ శతాబ్దంలో.. ఎప్పుడూ చూడనంత వరదను చూడాల్సి వచ్చిందంటున్నారు నిపుణులు. కాలనీలకు కాలనీలు నీట మునిగాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బుడమేరు వాగు అంత డేంజరా? అది ఆగ్రహిస్తే.. పరిస్థితి ఇలాగే ఉంటుందా? అసలు దాని ప్రవాహం ఏ రూటులో వెళుతుంది? దానివల్ల బెజవాడ ఎలా ఎఫెక్ట్ అయ్యింది?

Vijayawada Floods 2

Vijayawada Floods 2

బుడమేరు వాగు ప్రవాహం.. శాంతినగర్, ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి, గొల్లపూడి మీదుగా వెళుతుంది. దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయం సమీపంలో కృష్ణానదిలో కలుస్తుంది. కాకపోతే ఇక్కడ సమస్య ఏమిటంటే.. కృష్ణా నదిలో ప్రవాహం తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీంతో ఆ నదిలో కలవాల్సిన వాగు ప్రవాహం వెనక్కు వస్తోంది. దీంతో ఆ ప్రవాహమంతా.. గొల్లపూడి దగ్గర భవానీపురం మీదుగా వెళ్లాల్సి వస్తోంది. దీనివల్లే అటు అజిత్ సింగ్ నగర్, ఆటోనగర్ వరదలో చిక్కుకున్నాయి. దీంతో సింగ్ నగర్, నున్న, గన్నవరం.. ఈ ప్రాంతాలకు వెళ్లే దారి లేకుండా పోయింది. దీనివల్ల ఇక్కడ వరద ముంచెత్తింది. అందుకే అనేక అపార్ట్ మెంట్ లు, ఇళ్లపై వరద ఎఫెక్ట్ పడింది. జనజీవనం కూడా స్తంభించింది. బెజవాడలో చాలా ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకుపోవడానికి బుడమేరు వాగును కారణంగా చెబుతున్నారు నిపుణులు.

Vijayawada Floods 3

Vijayawada Floods 3

బుడమేరు ఒక్కటే కాదు.. అటు వెలగలేరు ప్రవాహం కూడా అంతే ఉధృతంగా కనిపించింది. బుడమేరు పరిస్థితి చూస్తే.. 30 ఏళ్ల తరువాత ఈ స్థాయిలో తన విశ్వరూపం చూపించింది. దీని ప్రవాహం ఎంత ఉన్నా సరే.. అది కృష్ణా నదిలో కలిసిపోతే ఎలాంటి సమస్యా ఉండేది కాదు. కానీ కృష్ణానదికి ఎగువ నుంచి ప్రవాహం పెరుగుతోంది. దీంతో బుడమేరు ప్రవాహం.. కృష్ణానదిలో కలిసే ప్రాంతంలో ఈ వాగు ప్రవాహం వెనక్కు వచ్చింది. దీనివల్లే వరద నీరు బెజవాడను ఈ స్థాయిలో ముంచెత్తింది. అటు కృష్ణానది ప్రవాహం ఎక్కువగా ఉండడం, ఇటు బుడమేరు ప్రవాహం వెనక్కు రావడంతో ఆ నీరు ఎటూ వెళ్లే మార్గం లేకుండా పోయింది. దీంతో బెజవాడలో కొన్ని ప్రాంతాలను వరద ముంచెత్తింది. కృష్ణానది ప్రవాహం తగ్గితే.. బుడమేరు వాగు ప్రవాహం అందులో కలుస్తుంది. దీంతో వరద నీరంతా కృష్ణమ్మలో కలుస్తుంది. అప్పుడు పరిస్థితులు పూర్తిగా చక్కబడతాయి.

Vijayawada Floods 4

Vijayawada Floods 4

బుడమేరు.. మైలవరం కొండల్లో పుట్టిన ఒక పెద్ద వాగని చెప్పాలి. చిన్న పిల్ల కాలువల రూపంలో దీని ప్రయాణం మొదలవుతుంది. వెలగలేరు వద్ద బుడమేరుగా మారి విజయవాడ రామకృష్ణాపురం వద్ద కాలువరూపంలోకి రూపాంతరం చెంది చివరికి కొల్లేరు సరస్సులో కలుస్తుంది. అలా అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరుకు నీటిని సరఫరా చేసే అతి ముఖ్యమైన వాగుల్లో ఇదొకటి. మొత్తం దాదాపు 170 కిలోమీటర్ల దూరం ప్రవహించే బుడమేరులో.. ఏటా 10 వేల నుంచి 11 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది. 2005లో భారీ వర్షాలకు బుడమేరులో ఏకంగా 75 వేల క్యూసెక్కుల నీరు ప్రవహించిందంటారు. అప్పుడే విజయవాడ వరదముంపులో చిక్కుకుంది. మళ్లీ 19 ఏళ్ల తర్వాత ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ నీటిని మధ్యలో రెగ్యులేట్‌ చేసేందుకు మైలవరం దిగువన జి.కొండూరు మండలం వెలగలేరు దగ్గర 12 అడుగుల ఎత్తున రెగ్యులేటర్ కట్టారు. ప్రవాహాన్ని కంట్రోల్ చేయడంతో పాటు సాగునీటి అవసరాలకూ వాడుకునేలా బుడమేరు డైవర్షన్ ఛానల్ ను నిర్మించారు. 11వేల 500 క్యూసెక్కుల నీరు ఫెర్రీ దగ్గర కృష్ణానదిలో కలిసేలా ఇది నిర్మాణమైంది. ఎన్టీపీఎస్‌ నుంచి వచ్చే వేడినీళ్లు కూడా దీంతో పాటే కృష్ణానదిలో కలుస్తాయి. పోలవరం కుడికాలువని వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర వద్ద బీడీసీకి అంటే.. బుడమేరు డైవర్షన్‌ ఛానల్‌కి కలిపి 33వేల క్యూసెక్కులు ప్రవహించేలా మార్పు చేశారు.

Vijayawada Floods 5

Vijayawada Floods 5

బుడమేరు ప్రవాహం కృష్ణమ్మలో కలవకపోవడానికి ప్రకృతిని కారణంగా చూపించవచ్చు. కానీ బుడమేరు ప్రాంతాన్ని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాల మాటేంటి? అక్కడికీ బుడమేరు డైవర్షన్ పనులను 2005లోనే చేపట్టారు. కానీ అవి కాస్తా ఆగిపోయాయి. నిజానికి బుడమేరు ప్రవాహ ఉధృతి విజయవాడపై ప్రభావం చూపించకుండా ఉండడానికి కరకట్టను కూడా ఏర్పాటు చేశారు. కానీ 2008 నుంచి ఇది పూర్తిగా ధ్వంసమైంది. అక్కడ ఇళ్ల నిర్మాణం మొదలైంది. అది కాస్తా కాలనీలకు కాలనీలు ఏర్పడేలా చేసింది. అందుకే ఇప్పుడు కరకట్ట రూపురేఖలు లేకుండా పోయాయి. ఈ ఆక్రమణలు పెరిగేసరికీ.. బుడమేరు ప్రవాహం వెళ్లడానికి రూటు లేకుండా పోయింది. అందుకే ఇప్పుడు ఆ వాగు ప్రవాహం పెరగడంతో.. అది కాస్తా విజయవాడను ముంచెత్తింది. బెజవాడను వణికించిన బుడమేరు వాగు ప్రయాణంలో ఎన్నో మలుపులు మెలికలు ఉంటాయి. దాంతో ఎక్కువ ప్రవాహం వచ్చినపుడు అది గట్టు దాటి పరిసర ప్రాంతాల్లోకి ప్రవహిస్తోంది. 20ఏళ్ల క్రితం చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు అర్థాంతరంగా నిలిచిపోవడంతో విజయవాడ నగరానికి ఇంతటి కష్టం తప్పలేదు. రిటైనింగ్ వాల్ నిర్మించడంతోపాటు నదీ పరివాహక ప్రాంతంలోని ఆక్రమణలు తొలగించడం.. అలాగే కొల్లేరును కూడా ప్రక్షాళన చేస్తేనే బుడమేరుతో బెజవాడకు ముప్పు తప్పుతుందంటున్నారు నిపుణులు.

Vijayawada Floods 6

Vijayawada Floods 6

విజయవాడ కన్నీరు పెట్టడానికి కారణం ఈ బుడమేరు వాగు. బెజవాడ మధ్యలో ప్రవహించే బుడమేరుకు ఊహించనంత వరద వచ్చింది. పైగా ఆ ప్రవాహం కృష్ణమ్మలో కూడా కలవలేదు. దీంతో విజయవాడకు ఇంతటి కష్టం, నష్టం వచ్చింది. చండ్రగూడెం, సబ్జపాడు లాంటి గ్రామాలతో పాటు అనంతవరం, పొందుగల గ్రామాల మీదుగా మైలవరం చేరి జి.కొండూరు మండలంలోని కుంటముక్కల మీదుగా ఈ వాగు ప్రవహిస్తుంది. చుట్టపక్కల గ్రామాల్లో ఉన్న పంటపొలాల్లోని నీటితో పాటు.. సమీపంలో ఉన్న గ్రామాల వ్యర్థ జలాలను తనలో కలుపేసుకుంటుంది. అలా వెలగలేరు వరకు నీటి ప్రవాహాన్ని మోసుకొస్తుంది. ఇక బుడమేరుకు దుఃఖదాయిని అనే పేరు కూడా ఉంది. అలా ఎందుకంటారో విజయవాడ ప్రస్తుత పరిస్థితి చూసినవారికి అర్థమవుతుంది. ఎక్కడో పుట్టి విజయవాడ మధ్యలో ప్రవహించి.. బెజవాడ కన్నీటికి కారణమవుతోంది. ఎప్పుడు దీంతో ప్రమాదం పొంచే ఉంటోంది. అలాంటిది ఊహించనంత వరద వస్తే.. ఇలా నగరానికి నగరాన్నే తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఈ వాగును నియంత్రించేందుకు జి.కొండూరు మండలం వెలగలేరులో 11 గేట్లను ఏర్పాటు చేశారు. వీటినే బుడమేరు లాకులు అంటారు. వరద నీటిని నియంత్రించడమే కాకుండా పంట పొలాలకు నీళ్లిచ్చే ఉద్దేశంతో ఈ లాకులును ఏర్పాటుచేశారు. అయితే ఈ బుడమేరు లాకులు తెరిస్తే ఆ ప్రవాహం విజయవాడ రూరల్ గ్రామాలను టచ్ చేస్తుంది. వాటి మీదుగా ఆ ప్రవాహం వెళ్లి.. చివరకు కొల్లేరులో కలుస్తుంది. బుడమేరు పొంగడంతో విజయవాడలో 40 శాతం జనాభాపై ప్రభావం పడింది. బుడమేరు కావచ్చు.. లేదా మరేదైనా కారణం కావచ్చు. విజయవాడ నగరానికి భవిష్యత్తులో ఇలాంటి ముంపు ముప్పు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ఆక్రమణల విషయంలో కఠినంగా వ్యవహరించాలి. అప్పుడే వర్షం నీరు, వరద ప్రవాహం నగరంలోకి రాకుండా తగిన విధంగా ప్రణాళికలు రూపొందించాలి. అప్పుడే విజయవాడకు ఈ బాధ తప్పుతుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి