
ఏపీలో ఎన్నికల సమరానికి సైరన్ మోగించింది కేంద్ర ఎన్నికల సంఘం. దీంతో, రాష్ట్ర రాజకీయవాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొన్నాళ్లుగా మార్పులు, చేర్పులు అంటున్న వైసీపీ.. అధికారికంగా అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేసి.. ప్రత్యర్థులకు కొత్తసవాల్ విసిరింది. కూటమికట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ సైతం… తగ్గేదేలె అంటున్నాయి. మరి, సీట్ల కేటాయింపు విషయంలో వెనుబడిన వర్గాలకు మేమంటే మేము న్యాయం చేశామంటూ.. ప్రధాన పార్టీలు తొడలుకొడుతుండటంతో… రాష్ట్రంలో ఇప్పుడు క్యాస్ట్ ఈక్వెషన్స్ కీలకంగా మారాయి. షెడ్యూల్ వచ్చేయడంతో ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైపోయింది. అభ్యర్థులపేర్లు ప్రకటించడంలో.. ప్రధానపార్టీలు పోటాపోటీగా వ్యవహరిస్తుండటంతో.. రాజకీయ వేడి మరింత ఎక్కువైంది. క్యాండిడేట్స్ విషయంలో మార్పులు, చేర్పులంటూ కాస్త ముందున్న వైసీపీ… అధికారికంగా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించేసింది. ఒక్క అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని మాత్రం ఇంకా ప్రకటించలేదు.
ఎమ్మెల్యే, ఎంపీ కలిపి దాదాపు 64స్థానాలు బీసీలకు కేటాయించి సామాజిన న్యాయం పాటించామన్నారు సీఎం జగన్. సగం సీట్లు ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించి… ఆ వర్గాలకు అవకాశాలు కల్పించడంలో తమను మించినవారెవ్వరూ లేరని మరోసారి నిరూపించామని చెప్పారు. సామాజిక న్యాయంపై మాటలు చెప్పడంకాదు.. చేతల్లో చేసి చూపించామన్నారు జగన్. వైసీపీని అధికారం నుంచి దించడమే లక్ష్యంగా కూటమి కట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ కూడా… సోషల్ ఇంజినీరింగ్‌లో బిజీగా ఉన్నాయి. కులాలు,వర్గాల వారిగా సీట్ల కేటాయింపుల్లో అధికారపార్టీకి ఏమాత్రం తగ్గబోమని చెబుతున్నాయి. ఇప్పటికే దాదాపు 130స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన కూటమి.. వైసీపీకి ధీటుగా ముందుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తోంది.
ఎన్నికల షెడ్యూల్ రావడంపై టీడీపీ అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఐదుకోట్ల ఏపీ ప్రజలు ఐదేళ్లుగా ఈరోజుకోసమే ఎదురు చూస్తున్నారన్న ఆయన… జగన్‌కు కౌంట్‌డౌన్ మొదలైందన్నారు. ఇక రాష్ట్రానికి అన్నీ మంచిరోజులే రాబోతున్నాయన్నారు. కొన్నాళ్లుగా ప్రధాన పార్టీలన్నీ బీసీ మంత్రాన్ని జపిస్తున్నాయి. గెలుపు తంత్రాల్లో అదే కీలకమైందిగా భావిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ అభ్యర్థుల ప్రకటన.. ఏపీలో సామాజిక సమీకరణలను తెరమీదకు తీసుకొచ్చింది. మరి, ఎన్నికల్లో ఏ వర్గం ఏ పార్టీకి అండగా ఉంటుందనే చర్చ మొదలైంది. మే 13న పోలింగ్ జరిగేనాటికి… రాష్ట్రంలో క్యాస్ట్ ఈక్వెషన్స్ ఎలా మారుతాయి? జూన్ 4న ఎలాంటి ఫలితాలకు కారణమవుతాయి? అన్నదే ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.