టీడీపీ, జనసేన సీట్ల పంపకంపై ఏపీలో రాజకీయ రచ్చ జరుగుతోంది. పొత్తుల్లో భాగంగా మొదటి జాబితాలో టీడీపీ 94, జనసేన 24 సీట్లలో పోటీ చేయబోతున్నట్టు ప్రకటించాయి. అయితే జనసేన కేవలం 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ తీసుకోవడంపై సొంత పార్టీ నేతల్లో అసంతృప్తి మొదలైంది. దీనిపై జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గౌరవప్రదమైన సీట్లంటే కనీసం 40 అసెంబ్లీ, 5 పార్లమెంటు స్థానాలు దక్కడమేనని అన్నారు. ప్రకటించకుండా మిగిలిన 57స్థానాల్లో 16 అసెంబ్లీ సీట్లు, రెండు పార్లమెంట్ టికెట్లు కావాల్సిందేనని అన్నారు.
పొత్తు ధర్మం ప్రకారం సీట్ల కేటాయింపు జరగలేదని సీనియర్ కాపు నేత హరిరామజోగయ్య అన్నారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. ఒకరు ఇవ్వడం.. మరొకరు దేహీ అని పుచ్చుకోవడం..పొత్తు ధర్మం అనిపించుకోదని తెలిపారు. జనసేనకు కేవలం 24 సీట్లు ఇవ్వడమేంటని.. జనసేన పరిస్థితి అంత హీనంగా ఉందా ? అని ప్రశ్నించారు. జనసేన శక్తిని పవన్ తక్కువ అంచనా వేసుకుంటున్నారని.. 24 సీట్ల కేటాయింపు జనసేనను సంతృప్తిపరచలేదని చెప్పారు. జనసేన శ్రేణులు రాజ్యాధికారంలో గౌరవ వాటా కోరుకుంటున్నారని.. పవన్‌ను రెండున్నరేళ్లు సీఎంగా చూడాలనేది వాళ్లకోరిక అని హరిరామజోగయ్య తెలిపారు. పార్టీ శ్రేణులను సంతృప్తిపరచకుండా.. వైసీపీని ఎలా ఓడించగలరని లేఖలో పేర్కొన్నారు.
మరోవైపు జనసేన సీట్ల సంఖ్య వ్యవహారం అధికార వైసీపీకి సరికొత్త అస్త్రంగా మారనుందా ? అనే చర్చ కూడా జరుగుతోంది. ముష్టి 24 సీట్ల కోసం పవన్ కల్యాణ్ చంద్రబాబుతో కలవడం ఎందుకని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు కోసమే పవన్ కల్యాణ్ రాజకీయాలు చేస్తారనే తమ వాదన మరోసారి నిజమైందని ఆరోపిస్తున్నారు.
మొత్తానికి పొత్తుల్లో జనసేనకు దక్కిన సీట్ల సంఖ్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో.. పవన్ చెప్పినట్టు ఇరు పార్టీల మధ్య ఓటు ట్రాన్స్‌ఫర్ సాఫీగా సాగుతుందా ? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..