కూల్ న్యూస్ వచ్చేసిందోచ్. ఆంధ్రాలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. శ్రీహరికోట, సమీప ప్రాంతాల్లో నైరుతి పవనాలు విస్తరించాయి. రాష్ట్రవ్యాప్తంగా నైరుతి పవనాలు విస్తరణకు అనువైన పరిస్థితులు ఉన్నాయని ఐఎండీ తెలిపింది. రాగల 24 గంటల్లో రాష్ట్రమంతా విస్తరించనున్నాయి నైరుతి రుతుపవనాలు. వీటి ప్రభావంతో పలుచోట్ల జల్లులు పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఈసారి.. భారత్‌లోకి నైరుతి రుతుపవనాల ప్రవేశం కాస్త ఆలస్యం అయ్యింది. జూన్ 8 నాటికి అవి కేరళ తీరాన్ని తాకాయి. గతేడాది మే 29 నాటికే అవి కేరళ తీరానికి చేరుకున్నాయి. 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న ప్రవేశించాయి.
భారత్‌లో ఈసారి సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఏప్రిల్ నెలలో ప్రకటించింది. అయితే.. భారత్‌లో వర్షపాతం ప్రధానంగా రుతుపవనాల వల్లనే కురుస్తుంది. దేశ వ్యవసాయ రంగానికి రుతుపవనాలే కీలకం. మొత్తం సాగు విస్తీర్ణంలో 52 శాతం మాన్‌సూన్‌పైనే ఆధారపడి ఉంటుంది. ఇది దేశ మొత్తం ఆహారోత్పత్తిలో 40 శాతం వాటా. తద్వారా దేశ ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వానికి కీలకమైన సహకారం లభిస్తుంది.
ప్రజెంట్ ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా, తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా విస్తరించడానికి మూడు నాలుగు రోజులు పడుతుందంటున్నారు. అయితే, మాన్‌సూన్‌తోపాటు ఉపరితల ద్రోణి కూడా ఆవరించి ఉండటంతో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో జోరుగా గాలివానలు ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం