ఈ వానలు ఇప్పట్లో వీడేలా లేవు. ఏపీ ప్రజలకు అలెర్ట్. మళ్లీ వానొస్తుంది. అవును.. వెదర్ డిపార్ట్‌మెంట్ రెయిన్ అలెర్ట్ ఇచ్చింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ, యానాం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బుధవారం నుంచి మళ్లీ వర్షాలు ఊపందుకుంటాయని అధికారులు చెబుతున్నారు. పలు ప్రాంతాల్లో భారీ నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని అంచనా వేస్తున్నారు. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉంది. మరో 4 రోజులు పాటు వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ భారీ వర్షాల ప్రభావంతో చెరువులు, కాలవల కట్టలు తెగే అవకాశం ఉందని.. .. అధికారులు అలెర్ట్‌గా ఉండాలని వెదర్ డిపార్ట్‌మెంట్ సూచించింది. వరి, అరటి పంటలకు మైనర్ డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని తెలిపింది. వాన పడుతున్న సమయంలో ప్రజలు చెట్ల కింద నిలబడవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. చెరువులు, కాలవలు, తూములకు దూరంగా ఉండాలని.. వర్షం కురుస్తున్న సమయంలో కరెంట్ పోల్స్, వైర్లను తాకవద్దని కోరింది.
ఉమ్మడి అనంతపురం జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా అనంతపురం సిటీని వరద ముంచెత్తింది. రుద్రంపేట, నడిమివంక పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. 4వ రోడ్డు, 5వ రోడ్డు ప్రాంతాల్లోకి వరద చొచ్చుకొచ్చింది. లోతట్టు కాలనీలు ముంపులో చిక్కుకున్నాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నిన్న రాత్రి నుంచి కొన్ని కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిపేశారు. ఇలాంటి వరదను ఎప్పుడూ చూడలేదని చెప్తున్నారు అనంతపురం వాసులు.
అటు.. పుట్టపర్తిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడ్డాయి. ఏకధాటి వానకు పట్టణంలో రోడ్లన్నీ సెలయేర్లుగా మారిపోయాయి. సత్తెమ్మ గుడి దగ్గర నడుములోతు నీరు చేరింది. వాహనాలు మునిగాయి. రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..