AP Weather: ముంచుకొస్తున్న తుఫాన్ ముప్పు.. ఏపీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వాన దంచి కొడుతుంది. చాలా ప్రాంతాలను వరదలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో మరో బాంబు పేల్చింది వాతావరణ శాఖ. తుఫాన్ హెచ్చరిక చేసింది.

AP Weather: ముంచుకొస్తున్న తుఫాన్ ముప్పు.. ఏపీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం
Andhra Pradesh Weather Update

Updated on: Oct 15, 2022 | 12:02 PM

ఏపీ ప్రజలకు అలెర్ట్. పెను ఉపద్రవం రాబోతుంది. ఇప్పటికే ఇరు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. తుఫాన్ హెచ్చరిక వచ్చింది. ఈ నెల 20 నాటికి ఆగ్నేయ బంగాళంఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వెదర్ డిపార్ట్‌మెంట్ అంచనా వేస్తుంది. ఆ అల్పపీడనం బయపడి తీవ్ర వాయుగుండంగా మారి.. ఏపీవైపు ప్రయాణిస్తుందని అంచనా వేస్తున్నారు. తీవ్ర వాయిగుండం తుఫాన్‌గా మారే అవకాశం ఉందని చెబుతుంది వాతావరణ శాఖ. తుఫాన్ ఏర్పడితే దానికి సిత్రాంగ్‌గా నామకరణం చేయాలని నిర్ణయించారు. ఈ తుఫాన్ ఏర్పడితే ఏపీ, ఒడిస్సా, బెంగాల్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు.

ఇక రానున్న 3 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది.

రాయలసీమపై దండెత్తిన వరుణుడు

కరువు సీమను కరిమబ్బులు కరుణించాయి. వాన వరదై.. రాయలసీమ తడిసి ముద్దవుతోంది. సీమలోనే కాకుండా ఎగువ కర్నాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు నిండుకుండల్లా మారుతున్నాయి.  సత్యసాయి జిల్లా గోరంట్ల వద్ద… ఎటుచూసినా నీళ్లే. పెద్దచెరువు వంకలో ప్రైవేట్ బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. 30 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది రెస్క్యూ టీమ్. నంద్యాల జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. బనగానపల్లె నియోజకవర్గంలో సంజామల వద్ద పాలేరు వాగుపై నాలుగడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. ముదిగేడు- కమలాపురి రహదారిలో వంతెనపై వర్షపు నీరు 10 గ్రామాల ప్రజల్ని దిగ్బంధనం చేసింది. వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అటు… అవుకు రిజర్వాయర్ వద్ద సైరా జలపాతం కనువిందు చేస్తోంది.

వేదావతి నదికి నీటి ప్రవాహం పెరగడంతో…. తుంగభద్ర దిగువ కాలువ 121 వ కిలోమీటర్ మైలురాయి వద్ద బ్రిడ్జీ దిమ్మె నీటిలో కొట్టుకుపోయింది. వేదావతినదిలో 800 మీటర్ల మేర ఉన్న బ్రిడ్జీకి సంబంధించి మూడు సపోర్ట్ దిమ్మెలకు ప్రమాదం పొంచివుంది. ఇటు… హోళగుంద మండలంలో వేదావతి నది వంతెనపై వరద నీరు చేరింది. బళ్లారికి రాకపోకలు ఆగిపోయాయి. లోతట్టు గ్రామాలకు వెళ్లే రహదారులు మూసుకుపోయాయి.

పుట్టపర్తిలో చిత్రావతి నదిలో ప్రవాహం హోరెత్తుతోంది. పోటెత్తిన వరదతో బుక్కపట్నం చెరువు నిండుకుండను తలపిస్తోంది. కొత్తచెరువు రెండు వైపులా వరద ఉధృతి కొనసాగుతోంది. రాకపోకలు నిలిపివేసి పహారా కాస్తున్నారు పోలీసులు. గత ఇరవై ఏళ్లలో బుక్కపట్నం చెరువుకు వరద రావడం ఇది రెడోసారి.  కర్నాటక ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పుట్టపర్తి దగ్గర చిత్రావతి నదిలోకి పెద్ద ఎత్తున వరద నీరొచ్చి చేరుతోంది. పరివాహక ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలను అప్రమత్తం చేశారు పోలీస్, రెవెన్యూ అధికారులు. అటు… తుంగభద్ర జలాశయానికి వరద నీరు పోటెత్తడంతో 20 గేట్లు ఎత్తి వేశారు. రిజర్వాయర్లో దాదాపుగా పూర్తిస్థాయి నీటిమట్టం కొనసాగుతోంది.

ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరడంతో ఉదృతంగా ప్రవహిస్తోంది పెన్నా నది. హిందూపురం సమీపంలోని కుట్టమురుమరువలో లారీ చిక్కుకుంది. జేసీబీలతో ఒడ్డుకు చేర్చేందుకు ప్రయత్నించారు స్థానికులు. అటు… రోడ్డుకు అడ్డంగా ఉధృతంగా ప్రవహిస్తోంది కొత్తపల్లి మరవ. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఈ ఏడాదిలో ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి దిగువకు వరదనీటిని వదలడం ఇది ఆరవసారి. రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా పరవళ్లు తొక్కుతూ నాగార్జునసాగర్ వైపు ఉరకలేస్తుంది కృష్ణమ్మ. కుడి-ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో కొనసాగుతుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..