Yaas Cyclone Effect: ఆంధ్రప్రదేశ్ వాతావరణ సమాచారం.. రాగల మూడు రోజులు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..

|

May 24, 2021 | 3:20 PM

Weather Report of AP: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘యాస్’ తుపాను వాయువ్య దిశగా కదిలిందని భారత వాతావరణ శాఖ...

Yaas Cyclone Effect: ఆంధ్రప్రదేశ్ వాతావరణ సమాచారం.. రాగల మూడు రోజులు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..
Yaas Cyclone
Follow us on

Weather Report of AP: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘యాస్’ తుపాను వాయువ్య దిశగా కదిలిందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం తుపాను తూర్పు మధ్య బంగాళాఖాతంలో పోర్ట్ బ్లెయిర్‌కు ఉత్తర-వాయువ్యంగా 620 కిలోమీటర్ల దూరంలో, పారాదీప్‌కి దక్షిణ ఆగ్నేయంగా 530 కిలోమీటర్లు, బాలాసోర్‌కి 630 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయం, దిఘా (పశ్చిమ బెంగాల్)కి దక్షిణ ఆగ్నేయంగా 620 కిలోమీటర్ల వద్ద కేంద్రీకృతమై ఉందని తెలిపారు. ఇది ఉత్తర-వాయువ్య దిశగా వెళ్లే అవకాశం ఉందన్నారు.

రానున్న 12 గంటల్లో తీవ్రమైన తుపానుగా, 24 గంటల్లో చాలా తీవ్రమైన తుపానుగా మారుతుందని వెల్లడించారు. ఇదికాస్తా మే 26వ తేదీన తెల్లవారుజామున ఉత్తర-వాయువ్య దిశగా వెళ్లడం, మరింత బలపడి ఉత్తర ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపంలో ఉన్న వాయువ్య బంగాళాఖాతానికి చేరుకుంటుందన్నారు. అదే రోజు మధ్యాహ్నం సమయానికి తీవ్రమైన తుపానుగా మారి పారాదీప్, సాగర్ ద్వీపాల మధ్య ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలను దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఇదిలాఉండగా.. యాస్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీలో రాగల మూడు రోజుల వరకు వాతావరణం ఎలా ఉండబోతోందనే దానిపై కీలక ప్రకటన చేశారు. వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరకోస్తాంధ్ర ప్రాంతంలో ఇవాళ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో పాటు భారీ వర్షాలు కొన్ని చోట్ల సంభవించే అవకాశం ఉంది. మంగళవారం నాడు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు ఒకటి రెండుచోట్ల కురువనున్నాయి. ఇక బుధవారం నాడు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంలో ఇవాళ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. మంగళవారం నాడు దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బుధవారం నాడు దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

రాయలసీమలో ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే బుధవారం నాడు రాయలసీమలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

కాగా, నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు తీరం వెంబడి సముద్రం అలజడిగా ఉంటుందని అధికారులు ప్రకటించారు. సముద్రంలో అలలు 2.9 మీటర్ల నుంచి 4.5 మీటర్ల ఎత్తులో‌ ఎగసి పడతాయని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. అలాగే తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Also read:

వైభవంగా శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు.. సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు

Priyanka Arul Mohan: అక్కినేని యంగ్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన నాని హీరోయిన్.. ఏ సినిమాలో అంటే..